Advertisement

Advertisement


Home > Movies - Movie News

మీరైనా మ‌గాడిని దూరం పెట్టండి...

మీరైనా మ‌గాడిని దూరం పెట్టండి...

సినిమా హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవ‌డం త‌నకెంత మాత్రం న‌చ్చ‌ద‌ని ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ తేల్చి చెప్పారు. అనేక అంశాల‌పై సృజ‌నాత్మ‌కంగా, భిన్నంగా త‌న‌వైన అభిప్రాయాల‌ను పూరీ జ‌గ‌న్నాథ్ త‌న మ్యూజింగ్స్‌లో చెబుతూ ఆక‌ట్టుకుంటున్నారు. 

ఈ నేప‌థ్యంలో తాజాగా ‘సింగిల్‌ బై ఛాయిస్‌’ అనే కాన్సెప్ట్‌ గురించి హీరోయిన్స్ పెళ్లిళ్ల‌పై సంచ‌ల‌న విష‌యాలు చెప్పుకొచ్చారు. హీరోయిన్స్‌కు పెళ్లిళ్లు వ‌ద్ద‌ని ఏ కార‌ణంతో చెబుతున్నారో ఆయ‌న మాటల్లోనే తెలుసుకుందాం.

‘సినిమా హీరోయిన్స్‌ పెళ్లిళ్లు చేసుకుంటే నాకెందుకో న‌చ్చ‌నే నచ్చదు. ఎందుకంటే కోటిమందిలో ఒకరికి నటిగా మారే అవకాశం లభిస్తుంది. అందుకే వాళ్లు ఎంతో ప్ర‌త్యేకం. అందరిలాగే  హీరోయిన్స్ కూడా పెళ్లిళ్లు చేసుకుని పిల్లల్ని కంటే నాకు నచ్చదు. హీరోయిన్స్‌ని తమ అభిమానులు దేవతల్లా భావిస్తుంటారు. అలాంటి దేవతలు పురిటి నొప్పులు పడుతుంటే చూడలేను. 

మనందరం పూజించే నిజమైన దేవతలు కూడా ఎప్పుడూ పిల్లల్ని కనలేదు. పిల్లల్ని కనాలనే కోరిక మనుషులకు ఉంటుంది. దేవతలకు కాదు. కాబట్టి, మీరు కూడా పెళ్లిళ్లు చేసుకోకుండా దేవతల్లా ఉంటే మాకిష్టం. సాధారణ అమ్మాయిలతో పోల్చుకుంటే వ్యక్తిగతంగా మీరు ఎంతో స్ట్రాంగ్‌గా ఉంటారు. మీరైనా మగవాడిని దూరం పెట్టవచ్చు కదా! ప్రేమ లేకపోతే చచ్చిపోతారా?’ అని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఇంకా ఆయ‌న ఏమ‌న్నారంటే...

‘జయలలిత, మాయావతి, మమతాబెనర్జీ.. ఇలా ఎంతోమంది మహిళలు స్ఫూర్తి నింపడానికి ఉన్నారు. వాళ్లకు మగవాళ్లతో పనిలేదు. పురాణాల్లో కూడా సింగిల్‌ ఉమెన్స్ ఎంతోమంది ఉన్నారు. ఇక, హాలీవుడ్‌లో అయితే పెళ్లిని పక్కనపెట్టిన లేడీ సూపర్‌స్టార్స్‌కు కొదవే లేదు. రంభ ఊర్వశి, మేనకలు పెళ్లి చేసుకోలేదు కాబట్టే స్వర్గంపై అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. 

హీరోయిన్స్‌ అందరూ నా మాట విని దేవతల్లా ఆలోచించండి. నేను స్ట్రాంగ్‌ ఉమెన్‌ అని మీరు ఫీలైతే జీవితంలో సింగిల్‌గా ఉండిపోండి. స్ట్రాంగ్‌ ఉమెన్‌ మాత్రమే ఈ దేశాన్ని మార్చగలరు’ అని పూరీ వివరించారు. మ‌గ‌వాళ్ల‌ను దూరం పెడితే చ‌చ్చిపోతారా? అని ప్ర‌శ్నించ‌డానికి చాలా ధైర్యం కావాలి. అలాంటి ధైర్యం పూరీకి పుష్క‌లంగా ఉంది. అందుకే త‌న భిన్న‌మైన ఆలోచ‌న‌ల‌ను స‌మాజంతో పంచుకుంటున్నాడు. 

పూరీ జ‌గ‌న్నాథ్ అభిప్రాయాల‌తో విభేదించే వాళ్లు, ఏకీభవించే వాళ్లు ఉన్నారు. కానీ ఆయ‌న అభిప్రాయాల‌ను విన‌డానికి ఇష్ట‌ప‌డ‌ని వాళ్లు లేరు. అదే ఆయ‌న మాట‌ల్లోని మ్యూజింగ్స్ ప్ర‌త్యేక‌త‌. లోకంలో ర‌క‌ర‌కాల వ్య‌క్తులు, అభిప్రాయాలు. ఒక్కొక్క‌రికి ఒక్కో ర‌క‌మైన అనుభ‌వాలు, అభిప్రాయాలున్నాయి. అందుకే ఇలాంటి భిన్న‌మైన ఆలోచ‌న‌లు మ‌న ముందుకు వ‌స్తున్నాయి. 

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?