ప్రముఖ గజల్ గాయకుడు పంకజ్ ఉదాస్ ఇక లేరు. గజల్స్ లో మ్యాస్ట్రోగా పేరుపొందిన పంకజ్, ఈరోజు కన్నుమూసినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన వయసు 72 సంవత్సరాలు.
కొన్నాళ్లుగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారు పంకజ్ ఉదాస్. ఈరోజు ఉదయం 11 గంటలకు ముంబయిలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో ఆయన తుదిశ్వాస విడిచారు. తాజా సమాచారం ప్రకారం, కొన్నాళ్లుగా ఆయన కాన్సర్ తో బాధపడుతున్నారు.
సంగీత కుటుంబంలో జన్మించారు పంకజ్ ఉదాస్. ఊహ తెలిసే టైమ్ కే పంకజ్ సోదరుడు బాలీవుడ్ లో గాయకుడు. పంకజ్ కు కూడా బాలీవుడ్ ఎంట్రీ ఈజీగానే దక్కింది. అయితే ఆయన హిందీ పాటల కంటే, గజల్స్ పై మక్కువ పెంచుకున్నారు.
1980లో పంకజ్ తన తొలి గజల్ ఆల్బమ్ ఆహత్ ను విడుదల చేశారు. అది పెద్ద హిట్టయింది. ఎంతలా అంటే, బాలీవుడ్ ను సైతం పక్కనపెట్టి, వరుసగా 60 ఆల్బమ్స్ రిలీజ్ చేశారు పంకజ్.
పంకజ్ మధుర స్వరం బాలీవుడ్ శ్రోతల్ని కట్టిపడేసింది. పాడినవి తక్కువ పాటలే అయినప్పటికీ, తనదైన ముద్రవేశారాయన. భారతదేశం గర్వించదగ్గ గజల్ గాయకుల్లో ఒకరైన పంకజ్ మనమధ్య లేకపోవడం బాధాకరం.