అదృష్టం బాగుండి వేవ్ లాంటిది వస్తే ఏమో కానీ లేదూ అంటే అనకాపల్లి ఎమ్మెల్యే పోరు బరిలో జనసేన అభ్యర్ధి కొణతాల రామకృష్ణ ‘అరయంగ కర్ణుడీల్గె ఆర్గురి చేతన్’ అన్నట్లు వుంది పరిస్థితి.
అనకాపల్లి నియోజకవర్గంలో కొణతాల రామకృష్ణ ఏ పార్టీలోకి వెళ్లకుండా, జనాలకు దూరంగా వుండిపోయినా నాలుగైదేళ్లు కావస్తోంది. ఇలాంటి టైమ్ లో తన అన్న కోసం పవన్ కళ్యాణ్ కోరి కొణతాలను పార్టీలోకి ఆహ్వానించి, చంద్రబాబును ఒప్పించి మరీ ఎమ్మెల్యే ఎన్నికల బరిలోకి దింపారు. ఇప్పుడు ఈ పొరులో కొణతాలకు కలిసి రాని పాయింట్లు ఎన్నో.
ఆరోగ్యం-డబ్బు
కొణతాల చాలా కాలంగా మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారని తెలుస్తోంది. అందుకే ఆయన ఎక్కువగా బయటకు రావడం లేదు. పైగా ఆర్థికంగా ఏమంత బలంగా లేరు. ఆయన అల్లుడు ఒకరు బిల్డర్. అతనే పెట్టుబడి పెట్టాలని టాక్. సరే డబ్బుదేముంది జనసేన పార్టీ సర్దుబాటు చేస్తుంది.. నాగబాబు కోసం అయినా సర్దుకోవచ్చు. కానీ మరీ పదుల కోట్లు అయితే సర్దుబాటు చేయదు కదా?
దాడితో విబేధాలు
మాజీ మంత్రి దాడి వీరభద్రరావుకు కొణతాలకు ఉప్పు నిప్పు. చిత్రంగా ఇప్పుడు ఇద్దరూ మిత్ర పక్షాలలోకి వచ్చారు. దేశంలో వున్నారు దాడి. జనసేనలో కొణతాల. తన కొడుకు రత్నాకర్ కు సీటు ఇస్తారని ఆశించారు దాడి వీరభద్రరావు.
ఇప్పుడు కొణతాల గెలిస్తే దాడి వీరభద్రరావు మళ్లీ పార్టీ మారాలి. లేదూ అంటే కొడుకుకు రాజకీయ భవిష్యత్ వుండదు. అనకాపల్లి ప్లేస్ జనసేనకు ఫిక్స్ అయిపోతే ఇక దాడి వీరభద్రరావు చేసేది ఏమీ వుండదు. అందువల్ల ఈ ఎన్నికల్లో బయటకు ఎలా వున్నా దాడి వర్గం కొణతాలకు సహకరించదు. వారిది, వారి వర్గానిది చిరకాల వైరం.
బంధువే కానీ
తెలుగుదేశం టికెట్ ఆశించిన బలమైన అభ్యర్థి పీలా గోవింద్ కు కొణతాలతో చాలా దగ్గర బంధుత్వం వుంది. కానీ పీలా గోవింద్ వర్గం మాత్రం పూర్తిగా ఆగ్రహావేశాలతో వుంది. కొణతాల పేరు ప్రకటించగానే పల్లె పల్లెల్లో ఫ్లెక్సీలు తీసేసారు. పీలా గోవింద్ వర్గం అంతా ఇప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలతో వుంది. చంద్రబాబు బుజ్జగించవచ్చు, పీలా మెత్త బడవచ్చు. కానీ ఆయన వర్గం అయితే మాత్రం కాదు.
పరుచూరి బాధ
గంటా శ్రీనివాసరావు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన పరుచూరి భాస్కరరావు అనకాపల్లి జనసేన టికెట్ ఆశించారు. గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి ఓడి పోయారు. బోలెడు డబ్బు నష్టపోయారు. గత అయిదేళ్లుగా ఇదే నియోజకవర్గాన్ని మట్టిపెట్టుకుని వున్నారు. పార్టీ కోసం స్వంత సొమ్ము ఖర్చు చేస్తూ వచ్చారు. ఇప్పుడు టికెట్ ఆశించారు. రాలేదు. జనసేనలో చాలా మంది పరుచూరి భాస్కరరావు అంటే అభిమానంగా వున్నారు. వారంతా ఇప్పుడు కొణతాల వైపు తిరుగుతారా? అన్నది అనుమానమే.
ఎంపీ/ఎమ్మెల్యే
ఎన్నికలు దగ్గరకు వచ్చాక ఎమ్మెల్యేకు మాకు వేయండి.. ఎంపీ మీ ఇష్టం.. లేదా ఎంపీకి మాకు వేయండి ఎమ్మెల్యేకు మీ ఇష్టం అనడం చాలా చోట్ల కామన్. ఇప్పుడు ఈ ఎన్నికల్లో కూడా అలాగే జరుగుతుందని, జనసేనను అభిమానించి కాపులు నాగబాబుకు అండగా వుండి, కొణతాలను పక్కన పెట్టినా ఆశ్చర్యం లేదని టాక్ వినిపిస్తోంది.
అయ్యన్న అండ వుంటుందా?
అయ్యన్న పాత్రుడు తన కుమారుడికి ఎంపీ సీటు ఆశించారు. కానీ ఇవ్వలేదు. జనసేనకు కేటాయించారు. ఇది అందరికీ తెలిసిందే. ఇప్పుడు అయ్యన్న పాత్రుడి వెలమ సామజిక వర్గం ఎటు వుంటుంది అన్నది చూడాలి. ఆ ప్రభావం కొణతాల మీద పడకుండా చూసుకోవాల్సి వుంటుంది.