అంతర్జాతీయ వేదికపై ఆర్ఆర్ఆర్ మెరిసింది. అంచనాల్ని అందుకుంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కించుకుంది.
80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో ఆర్ఆర్ఆర్ లోని “నాటు నాటు” సాంగ్ కు బెస్ట్ ఒరిజినల్ సాంగ్-మోషన్ పిక్చర్ విభాగంలో గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. దీంతో ఆస్కార్ రేసులో ఆర్ఆర్ఆర్ ఇంకాస్త ముందుకు వెళ్లినట్టయింది.
సంగీత దర్శకుడు కీరవాణి, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకున్నారు. తను అందుకున్న అవార్డ్ ను దర్శకుడు రాజమౌళి, హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కు అంకితం చేశారు.
రాజమౌళి విజన్ కు ఈ అవార్డ్ దక్కుతుందని తెలిపిన కీరవాణి, తనను నిరంతరం నమ్మి, సపోర్ట్ చేస్తున్న రాజమౌళికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ పాటలో అద్భుతంగా డాన్స్ చేసిన చరణ్-తారక్ కు కూడా థ్యాంక్స్ చెప్పారు.
నాటు-నాటు పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కలిసి ఆలపించారు. ప్రేమ్ రక్షిత్ డాన్స్ కంపోజ్ చేశాడు. టాప్ గన్ మేవరిక్, బ్లాక్ పాంథర్ లాంటి పలు హాలీవుడ్ సినిమాల్లోని సాంగ్స్ తో పోటీపడి మరీ నాటు-నాటు పాట ఈ అవార్డ్ ను ఎగరేసుకుపోయింది. తెలుగు సినిమాకు, తెలుగు పాటకు దక్కిన అపురూప గౌరవం ఇది.