ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీకి అంత సీన్ లేదన్న వాదనలో నిజం వుంది. కానీ ఆ పార్టీ అంటే ఏపీలోని అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ వణుకుతున్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన అధినేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్ రాజకీయ పంథాను బీజేపీ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ఇంత వరకూ వాళ్లిద్దరి భేటీపై ఏపీ బీజేపీ అధికారికంగా స్పందించలేదు. ఒకవేళ ఏపీ బీజేపీ నేతల్లో ఎవరైనా మాట్లాడినా, అవి వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే అంటున్నారు.
ఈ నేపథ్యంలో మిత్రుడైన పవన్‌కల్యాణ్‌ను టీడీపీ లాక్కెళితే… బీజేపీ ఊరుకుంటుందా? అనేది ప్రశ్న. 2019 ఎన్నికలకు ముందు బీజేపీతో పెట్టుకుంటే… పరిణామాలు ఎలా వుంటాయో చంద్రబాబుకు అనుభవంలోకి వచ్చింది. కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ నాటి ముఖ్యమంత్రి చంద్రబాబుకు చుక్కలు చూపించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలుకుని, ఇతరత్రా ముఖ్య ఉన్నతాధికారుల మార్పు చేసి చంద్రబాబుకు ఊపిరి ఆడకుండా చేసింది. చంద్రబాబుకు డబ్బు అందకుండా చేసి, చేతులు కట్టేసింది. దీంతో అధికారంలో ఉండి కూడా చంద్రబాబు ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో డబ్బు పంచలేకపోయారు.
అలాగే ఎన్నికల సంఘం నుంచి కూడా చంద్రబాబుకు సహాయ నిరాకరణ ఎదురైంది. ఇలా వ్యవస్థల నుంచి చంద్రబాబుకు వ్యతిరేకత ఎదురైంది. ఈ నేపథ్యంలో తమను కాదని పవన్‌కల్యాణ్‌ను దగ్గరికి తీసుకుంటే మళ్లీ 2019 నాటి చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం ఇటు చంద్రబాబు, అటు పవన్‌కల్యాణ్‌లోనూ ఉంది.
తాజాగా తెలంగాణ సీఎస్ సోమేశ్‌కుమార్ ఉదంతమే నిదర్శనం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని హైకోర్టు తీర్పు వెలువరించిన మరుక్షణమే… కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 12వ తేదీలోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం చూస్తే…కక్ష కడితే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
అలాంటిది తాము కోరుకున్న పవన్‌ను తీసుకెళితే బీజేపీ చూస్తూ ఊరుకుంటుందా? అనేది ప్రధాన ప్రశ్న. బీజేపీ తత్వం తెలిసిన వారెవరైనా సినిమా చూపిస్తుందనే చెబుతారు. ఈ నేపథ్యంలో తమ కలయికపై బీజేపీ వైఖరి ఎలా వుంటుందోననే ఆందోళన చంద్రబాబు, పవన్‌లో ఉండడం ఆశ్చర్యం కలిగించదు. అందుకే బీజేపీని కూడా కలుపుకెళ్లాలని ఆ ఇద్దరి నేతల తాపత్రయం. భవిష్యత్‌లో బీజేపీ వైఖరి వారి కలయిక ప్రభావం ఆధారపడి వుంటుంది.