వైసీపీ అనుబంధ సంఘాలకు ఈ నెల 4న నూతన సారథులను నియమించారు. అయితే వైసీపీ ప్రచార విభాగానికి సంబంధించి రథసారథుల నియామకంలో ఆ పార్టీ తీవ్ర గందరగోళానికి గురవుతోంది. ఏ పార్టీకైనా ప్రచార విభాగమనేది అత్యంత కీలకమైంది. అలాంటి విభాగానికి బాధ్యులను నియమించడంలో వైసీపీ అట్టర్ ప్లాప్ అవుతోంది. ఇందుకు వారంలోనే మూడుసార్లు నియామక ప్రకటన ఇవ్వడం నిదర్శనం.
మొదట వైసీపీ ప్రచార విభాగం రథసారథులుగా ఆర్.ధనుంజయ్‌రెడ్డి, పుత్తా ప్రతాప్‌రెడ్డిలను నియమించారు. ఆ మరుసటి రోజే ప్రతాప్‌రెడ్డి ప్లేస్‌లో బసిరెడ్డి సిద్ధారెడ్డిని నియమిస్తూ మరో ప్రకటన వైసీపీ నుంచి వచ్చింది. అసలేం జరిగిందని ఆరా తీయగా ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఇస్తే ఒకరికే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని, తనకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వద్దే పలుకుబడి వుందని పుత్తా ప్రతాప్‌రెడ్డి పార్టీ పెద్దలతో అన్నట్టు తెలిసింది.
ప్రచార విభాగం అధ్యక్ష బాధ్యతలను మరొకరితో కలిసి పంచుకోడానికి ప్రతాప్‌రెడ్డి ఇష్టపడలేదు. ఆ పదవిని ఆయన తిరస్కరించినట్టు తెలిసింది. దీంతో బసిరెడ్డి సిద్ధారెడ్డి పేరు తెరపైకి ఇచ్చింది. ఈయన ఒకప్పుడు ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వద్ద పీఏగా పని చేశాడు. అప్పట్లో భారీ ఎత్తున భూదందాలకు పాల్పడ్డాడనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
ఉమ్మడి కడప జిల్లా రాయచోటికి చెందిన సిద్ధారెడ్డి విశాఖలో భూకబ్జాలకు పాల్పడ్డాడనే ఆరోపణలపై సజ్జల ఇంటికి సాగనంపారు. ఇతని విషయమై సీఎం జగన్‌కు కూడా ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో కనుచూపు మేరలో కనిపించకుండా తరిమేయాలని జగన్ ఆదేశించినట్టు వైసీపీ నేతలు చెప్పుకునే వారు.
ఈ నేపథ్యంలో బసిరెడ్డి సిద్ధారెడ్డి పేరు ఏకంగా వైసీపీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్ష హోదాతో రావడం ఆ పార్టీలోని ముఖ్యుల్ని ఆశ్చర్యపరిచింది. ఈయనకు పార్టీలో నెంబర్‌గా చెప్పుకునే రాజ్యసభ సభ్యుడి ఆశీస్సులున్నట్టు ప్రచారం జరుగుతోంది. అయితే బసిరెడ్డి నియామకంపై సీఎం జగన్‌కు పార్టీ ముఖ్యులతో పాటు పోలీసు అధికారులు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో అతన్ని తొలగిస్తూ… ధనుంజయరెడ్డికి మాత్రమే బాధ్యతలు అప్పగిస్తూ తాజాగా మరో ప్రకటన రావడం గమనార్హం.
పార్టీలో కీలక పదవుల్లో నియామకాలు సీఎం జగన్‌కు తెలియకుండానే జరుగుతున్నాయనేందుకు ఇదే నిదర్శనం. పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యం ఇస్తున్నారనేందుకు ఇంత కంటే ఉదాహరణ ఏం కావాలనే చర్చ వైసీపీ ఇన్నర్ సర్కిల్స్ నడుస్తోంది.