రోడ్డు షోలు, బహిరంగ సభలు పెట్టుకోవడానికి పోలీలసులు అనుమతి నిరాకరిస్తే.. తక్షణం విమర్శలు రువ్వే పనిలో పడతారు. డైరక్టుగా ముఖ్యమంత్రి మీద మాత్రమే సకల విమర్శలు వినిపిస్తుంటాయి. సీఎం అంటే.. స్థానికంగా సభకు అనుమతి ఇచ్చే సీఐ అన్నట్టుగా పోలీసులు అనుమతి నిరాకరించిన ప్రతిసారీ విమర్శలు మాత్రం సీఎం మీద చేస్తుంటారు. అదే సమయంలో అనుమతులు లభించినప్పుడు మాత్రం సీఎంకు థాంక్స్ చెప్పరు. ఆ మాట కొస్తే పోలీసులకు కూడా థాంక్స్ చెప్పరు. ఇదీ విపక్ష పార్టీల వ్యవహార సరళి.
రోడ్ షోలు, సభల పేరుతో ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటూ ఉండే విపక్షాల దుర్మార్గమైన వైఖరికి అడ్డుకట్ట వేస్తూ జగన్ మోహన్ రెడ్డి సర్కారు జీవో నెం.1 తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. సభల పేరుతో ఇష్టారాజ్యంగా చెలరేగిపోతాం అంటే అనుమతించకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. అయితే ఈ జీవో నెం.1 అనేది ప్రజాస్వామ్యాన్ని చంపేయడానికి తెచ్చిన చట్టం లాగా బూచిలాగా చూపించి ప్రజల్ని భయాందోళనల్లోకి నెట్టడానికి విపక్షాలు తొలినుంచి చాలా ప్రయత్నం చేస్తున్నాయి.
ఈ జీవో సాకుగా పెట్టుకుని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ తమ లోపాయికారీ పొత్తుల సంగతి చర్చించుకోవడానికి హైదరాబాదులో కలవడం కూడా అందరికీ తెలిసిందే. అయితే అనుమతుల విషయంలో ప్రభుత్వం అడ్డుకుంటోందని గోల చేస్తున్న ఈ పార్టీలు ఇచ్చినప్పుడు మాట్లాడకపోవడమే ఖర్మ.
జనసేన పార్టీ రణస్థలంలో యువశక్తి కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకుంది. ఉత్తరాంధ్ర యువతరం మాటల్లోనే ఆ ప్రాంత సమస్యలను వేదిక మీదినుంచి వినిపించేలా ఈ బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. వివేకానందుడి జయంతి రోజున నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆ పార్టీ చాలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది. దీనిద్వారా ఉత్తరాంధ్రలో తమ పార్టీ వేళ్లూనుకోవడానికి చాలా ఉపయోగం ఉంటుందని కూడా అనుకుంటోంది. ఇన్ని రకాల రాజకీయ వ్యూహాలతో సభకు సిద్ధం కాగా.. పోలీసుల పరంగా ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదు.
జనసేన నిర్వహించే యువశక్తి కార్యక్రమానికి బహిరంగ సభకు పోలీసులు అనుమతి ఇచ్చారు. జనసేనాని ఎంచక్కా సభ నిర్వహించుకుంటున్నారు. ఇప్పుడు మాత్రం జగన్ కు ఎందుకు థాంక్స్ చెప్పరు. అనుమతులు రాకపోతే.. జగన్ స్వయంగా తమకు అడ్డుపడుతున్నాడని ఆక్రోశించే వారు.. అనుమతులు వచ్చినప్పుడు అదే జగన్ కు థాంక్స్ చెబితే.. అప్పుడు సంస్కారం అనిపించుకుంటుంది.