బహుశా గత కొన్నేళ్లలో పేరున్న హీరో, స్టార్ ఇమేజ్ ఉన్న హీరోయిన్ సినిమాల్లో ఏదీ ఇన్ని సార్లు విడుదల వాయిదా పడలేదు. అసలు ఈ సినిమా ఎప్పుడో ప్రారంభం అయ్యింది. చాలా సంవత్సరాలు సెట్స్ మీద, మరి కొన్నేళ్లు ల్యాబ్ లో మగ్గిపోయింది.
ల్యాబ్ లో మగ్గిపోయిందనేది పాతపదం కాబోలు. డిజిటల్ యుగంలో.. చిప్ లో మగ్గిపోయిన సినిమా ఇది. ఈ సినిమాకు గత ఏడాది రెండేళ్లలో కూడా పలు సార్లు విడుదల తేదీలు ప్రకటించారు. అదిగో.. ఇదిగో.. అంటూ ప్రకటనలు అయితే వచ్చాయి. అయితే సినిమా మాత్రం రాలేదు.
ఇలాంటి నేపథ్యంలో ఇటీవల కూడా అక్టోబర్ ఎనిమిదిన ఈ సినిమా విడుదల అంటూ ప్రకటించారు. అయితే ఈ సారి అయినా.. ఈ సినిమా విడుదలవుతుందా? అనేది రొటీన్ కొశ్చన్ మార్క్ గానే నిలిచింది. అయితే ఈ సారి మాత్రం ఈ సినిమాకు మోక్షం దక్కినట్టుగా ఉంది.
ఓ మోస్తరు టౌన్లలో కూడా ఈ సినిమా విడుదలకు సంబంధించిన వాల్ పోస్టర్ కనిపిస్తోంది. కొన్నేళ్లుగా విడుదల వార్తల్లో తప్ప, విడుదల కాని.. గోపిచంద్, నయనతారల ఆరడుగులబుల్లెట్ సినిమా విడుదల అయ్యింది.
మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఏ మేరకు పట్టించుకుంటున్నారో కానీ, హీరో-హీరోయిన్ల స్పందన కూడా కనిపించలేదు. దీనికి డైరెక్షన్ చేసిన దర్శకుడు బి.గోపాల్ బైట్ ఇచ్చి..దీనిపై తనకు మిగిలిన ఆసక్తిని చూపించారు. ఇక గోపిచంద్ కూడా ఈ సినిమాను పట్టించుకుంటున్నట్టుగా కనిపించలేదు.
ఇక నయనతార అయితే.. మామూలుగానే షూటింగ్ పూర్తయిన తర్వాత తన సినిమాలను పట్టించుకోదు! అలాంటిది ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమా విడుదల గురించి ఆమెకు తెలిసి ఉంటుందని కూడా అనుకోలేమేమో!
ఇలాగే చాలా యేళ్లుగా పెండింగ్ లో నడిచిన రాజశేఖర్ సినిమాలు ఈ మధ్యనే రెండు విడుదల అయ్యాయి. ఆర్జీవీ-రాజశేఖర్ సినిమా ఒకటి, అర్జున అని మరో సినిమా. వీటి తరహాలోనే మగ్గిన గోపిచందర్ సినిమా కూడా విడుదల అయ్యింది. అయితే మామూలు పరిస్థితుల్లోనే ఈ సినిమాలు ప్రేక్షకుల్లో ఏ మేరకు ఆసక్తి కలిగించేవో కానీ, ఇలా కరోనా పరిస్థితులతో ఇంకా థియేటర్ల వైపుకు రావడానికి మెజారిటీ సినీ ప్రియులు ఆలోచిస్తున్న తరుణంలో.. ఈ పెండింగ్ సినిమాలు విడుదల కావడం గమనార్హం.