ఇప్పటికీ వెంకటేష్ నటించిన 2 సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. ఇప్పుడు మరో సినిమా కూడా ఓటీటీ దారిలో నడుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే హీరో సందీప్ కిషన్ నటిస్తున్న గల్లీ రౌడీ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజయ్యే అవకాశాలున్నాయి.
అన్నీ తానై ఈ సినిమాను నడిపిస్తున్నాడు కోన వెంకట్. ఈ సినిమాకు స్క్రీన్ ప్లే అందించడమే కాకుండా, సహ-నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు నిర్మాత ఎంవీవీ సత్యనారాయణ తరఫున ఈ మూవీ బిజినెస్ వ్యవహారాలు కూడా ఈయనే చూస్తున్నాడు. ఇందులో భాగంగా గల్లీ రౌడీని నేరుగా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేద్దామనే ప్రతిపాదన తీసుకొచ్చారు కోన.
డైరక్ట్ ఓటీటీ రిలీజ్ డీల్స్ క్లోజ్ చేసిన అనుభవం కోన వెంకట్ కు ఉంది. ఇంతకుముందు అనుష్క, మాధవన్ నటించిన నిశ్శబ్దం లాంటి పెద్ద సినిమానే డైరక్ట్ గా ఓటీటీ రిలీజ్ కు ఇచ్చేసిన కోనకు, గల్లీ రౌడీ లాంటి సినిమాను హ్యాండిల్ చేయడం పెద్ద ఇబ్బంది కాదు. సందీప్ కిషన్ నుంచి పెద్దగా సమస్య ఎదురుకాకపోవచ్చు.
సందీప్ కిషన్, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ చిత్రానికి నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, బాబీ సిమ్హా, పోసాని కీలక పాత్రలు పోషించారు.