మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక సాక్షి, వాచ్‌మన్ రంగన్న ఇంటి వద్ద మఫ్టీ పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు. రంగన్న పులివెందులలో ఉంటారు. వివేకా హత్య కేసులో సీబీఐ దాదాపు 50 రోజుల పాటు అవిశ్రాంతంగా దర్యాప్తు జరిపింది.
ఈ కేసును ఛేదించడంలో చివరి దశకు చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేసులో కీలక సాక్షిగా భావిస్తున్న వాచ్‌మన్ రంగన్న వాంగ్మూలాన్ని రెండు రోజుల క్రితం జమ్మలమడుగు మెజిస్ట్రేట్ ఎదుట రికార్డ్ చేసిన సంగతి తెలిసిందే.
అనంతరం రంగన్న పులివెందులలోని తన ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా వాంగ్మూలంలో తాను చెప్పిన పేర్ల గురించి లీక్ చేశారు. వివేకా ముఖ్య అనుచరుడు ఎర్రగంగిరెడ్డి తన పేరు చెబితే చంపుతానని బెదిరించారని రంగన్న సంచలన ఆరోపణ చేశారు. అయితే రంగన్న ఆరోపణలను ఎర్రగంగిరెడ్డి ఖండించారు. తానెప్పుడూ, ఎవరినీ బెదిరించలేదని ఆయన సమాధానం ఇచ్చారు.
మరోవైపు రాష్ట్రంలోనే అత్యంత ముఖ్యమైన కేసుకు సంబంధించి కీలక సాక్షిగా వ్యవహరిస్తున్న రంగన్న భద్రతపై సర్వత్రా ఆందోళన నెలకుంది. ఆయన ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రంగన్న ఇంటి వద్ద పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
మఫ్టీ పోలీసులతో రంగన్న ఇంటి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. ఆయన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి వివేకా కేసులో రంగన్న వాంగ్మూలం, ఎర్రగంగిరెడ్డి చంపుతానని బెదిరించారనే ఆరోపణలు ఒక్క సారిగా రాజకీయాలను వేడెక్కించాయి.