గుంటూరు కారం.. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ. సామాన్య ప్రేక్షకుల్లో ఈ సినిమాపై ఎన్ని అంచనాలున్నాయో, అన్నే అనుమానాలు కూడా ఉన్నాయి. అప్పుడెప్పుడో ప్రారంభంలోనే ఈ సినిమా కథను పూర్తిగా మార్చేశారనే టాక్ నడిచింది. దానిపై ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ క్లారిటీ లేదు.
ఇక తాజాగా ఈ సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుంది. దీనిపై కూడా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిటీ లేదు. ఈ రెండు పెద్ద మార్పుల మధ్య చాలా జరిగాయి. ఓ దశలో తమన్ కూడా ఔట్ అనే ప్రచారం జరిగింది. వాటిపై కూడా యూనిట్ ఇప్పటివరకు స్పందించలేదు. వీటన్నింటికంటే ముఖ్యంగా అసలు ఈ సినిమా షూటింగ్ ఎప్పటికప్పుడు ఎందుకు ఆగిపోతోంది, వాయిదాల మీద వాయిదాలు ఎందుకు పడుతుందనే అనుమానాలు కూడా చాలామందికి ఉన్నాయి. మహేష్-త్రివిక్రమ్ మధ్య ఏం జరుగుతుందనే డౌట్స్ ఉన్నాయి.
ఇలా ఎన్నో అనుమానాలు మధ్య గుంటూరు కారం కొత్త షెడ్యూల్ ఇవాళ్టి నుంచి మొదలైంది. ఏప్రిల్ 6వ తేదీన ఈ సినిమా పాత షెడ్యూల్ ముగియగా.. మళ్లీ ఇన్ని రోజులకు ఫ్రెష్ షెడ్యూల్ స్టార్ట్ అయింది.
కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది కాబట్టి, అంతర్గతంగా ఉన్న సమస్యలన్నీ సమసిపోయి ఉంటాయని అంతా భావిస్తున్నారు. మరీ ముఖ్యంగా హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా క్లారిటీ వచ్చిన తర్వాతే సెట్స్ పైకి వచ్చినట్టు తెలుస్తోంది. మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే స్థానంలోకి శ్రీలీల వచ్చింది. శ్రీలీల పోషించాల్సిన పాత్ర కోసం మీనాక్షి చౌదరిని దాదాపు లాక్ చేశారు.
ఈసారి ఎలాంటి గ్యాప్స్ ఇవ్వకుండా షూటింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నాడు త్రివిక్రమ్. నవంబర్ నాటికి సినిమాను పూర్తిచేయాలని అంతా టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆ తర్వాత రాజమౌళితో చేయాల్సిన సినిమాకు సంబంధించి పనులు మొదలుపెట్టాలనేది మహేష్ ఆలోచన.