ఇప్పటికే టాలీవుడ్ లో డ్రగ్స్ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. కేపీ చౌదరి అరెస్ట్ తర్వాత 12 మంది సెలబ్రిటీల పేర్లు బయటకొచ్చాయి. అషు రెడ్డి లాంటి వాళ్లు ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి స్పందించారు. త్వరలోనే పోలీసులు, ఛార్జ్ షీట్ తయారుచేసి, కొంతమందికి నోటీసులు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు.
ఇలాంటి సెన్సిటివ్ టైమ్ లో, మాదక ద్రవ్యాలపై సంచలన ప్రకటన చేశాడు హీరో నిఖిల్. తనకు చాలామంది, చాలాసార్లు డ్రగ్స్ ఆఫర్ చేశారంటూ బాంబ్ పేల్చాడు. సిగరెట్ నుంచి మొదలుపెడితే, నార్కోటిక్స్ వరకు చాలా ఆఫర్లు వచ్చాయని, అలాంటి పరిస్థితులకు లొంగకుండా ఉన్నప్పుడు మాత్రమే వ్యక్తులుగా ఎదుగుతామని అన్నాడు నిఖిల్.
తను జీవితంలో డ్రగ్స్ కు అలవాటుపడితే తనకు హ్యాపీడేస్ అనే సినిమా వచ్చి ఉండేది కాదన్నాడు నిఖిల్. అదే విధంగా ఏదైనా సక్సెస్ పార్టీలో తను డ్రగ్స్ తీసుకుంటే.. కార్తికేయ-2 లాంటి పాన్ ఇండియా హిట్ తనకు వచ్చి ఉండేది కాదని అభిప్రాయపడ్డాడు. కాబట్టి క్షణికావేశానికి గురికాకుండా, డ్రగ్స్ కు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశాడు.
మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన నిఖిల్, ఇలా మాదక ద్రవ్యాలపై సంచలన ప్రకటన చేశాడు. తనకు ఎవరు డ్రగ్స్ ఆఫర్ చేశారనే విషయాన్ని అతడు బయటపెట్టలేదు కానీ, ఇండస్ట్రీలో డ్రగ్స్ చాలా కామన్ అనే విధంగా ఉన్నాయి నిఖిల్ మాటలు.
పార్టీలకు వెళ్లడం తప్పుకాదంటున్నాడు నిఖిల్. జీవితాన్ని ఎంజాయ్ చేయాలని యువతకు పిలుపునిచ్చాడు. అదే సమయంలో మాదక ద్రవ్యాలు, ధూమపానం లాంటివాటికి దూరంగా ఉండాలని.. అప్పుడే లైఫ్ ను ఫుల్ గా ఎంజాయ్ చేయగలమని అన్నాడు. డ్రగ్స్ కు అలవాటు పడితే జీవితాన్ని కోల్పోవడం తప్ప మరో ఆప్షన్ ఉండదని హెచ్చరించాడు.