ప్రభుత్వ వైద్యమే బలోపేతం కావాలి

ఆశయాలు మంచివే కావచ్చు. కానీ ఆచరణ సాధ్యమా కాదా అన్నది చూడాలి. అసలు ఆసుపత్రులు బలోపేతం చేయకుండా ఆరోగ్యశ్రీ మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రతి ఆసుపత్రిని అన్ని రోగాలకు చికిత్స…

ఆశయాలు మంచివే కావచ్చు. కానీ ఆచరణ సాధ్యమా కాదా అన్నది చూడాలి. అసలు ఆసుపత్రులు బలోపేతం చేయకుండా ఆరోగ్యశ్రీ మీద వేల కోట్లు ఖర్చు చేస్తున్నాయి ప్రభుత్వాలు. ప్రతి ఆసుపత్రిని అన్ని రోగాలకు చికిత్స అందించే విధంగా వైద్యులను, సిబ్బందిని నియమించి, సదుపాయాల కల్పించి, మందులు వుంచితే అసలు ఏ ఆరోగ్యశ్రీ అవసరం లేదు. కార్పొరేట్ ఆసుపత్రుల వ్యాపారం దారుణంగా దిగజారిపోతుంది. కానీ ప్రభుత్వాలు ఎందుకో ఆ దిశగా ఆలోచించకుండా వాటినే మరింత బలోపేతం చేసేలా చర్యలు తీసుకుంటున్నాయి.

కార్పొరేట్ ఆసుపత్రులు ఎలా బతుకుతున్నాయి. ఇన్స్యూరెన్స్ కంపెనీల ద్వారా. ఆసుపత్రులు, భీమా కంపెనీలు పరస్పరం సహకరించుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఆసుపత్రులు భీమా వుంది కదా అని చెప్పి, ఫీజులు దారుణంగా వసూలు చేస్తున్నాయి. ఒకప్పుడు లక్ష రూపాయలు ఖర్చు అయ్యే చికిత్సలు ఇప్పుడు లక్షల్లోకి మారిపోయాయి. ఫీజులు ఎక్కువ వున్నాయి. భీమా సరిపోదు అని చెప్పి, లక్షలకు లక్షలపాలసీలు అంటగడుతున్నారు. ఇలా ఇటు భీమా కంపెనీలు, అటు ఆసుపత్రులు పరస్పరం సహకరించుకుంటూ వర్ధిల్లుతున్నాయి.

ఆరోగ్యశ్రీ అంటూ ప్రభుత్వం మెడికల్ కార్డులు అర్హులైన వారికి ఇస్తోంది. ఇలా అందుకుంటున్నవారు కోట్లలో వున్నారు. వీరందరూ ప్రయివేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కోట్లలో బిల్లులు ప్రభుత్వానికి వెళ్తుంటే, కాస్త అటు ఇటు ఆలస్యమైనా వాళ్లకు మంజూరవుతున్నాయి. ఆరోగ్యశ్రీ పథకం అనుమతించబడును అని ఆసుపత్రులు బోర్డులు పెడుతున్నాయి అంటే అర్థం ఏమిటి? ఆ పధకం వాటికి లాభదాయకంగా వుందనే కదా?

జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ఇలా కాదు.. భీమానే సరైనది అంటున్నారు. దాదాపు మూడు కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భీమా చేయించాలి అంటే ఎంత నిధులు అవసరం అవుతాయి అన్నది పవన్ కు అవగాహన లేనట్లుంది. ప్రమాద భీమా వేరు, ఆరోగ్య భీమా వేరు. ప్రమాద భీమా అన్నది తక్కువ ఖర్చుతో అయ్యేది. అది ఆల్రెడీ కెేంద్రం అమలు చేస్తున్న స్కీముల్లో వుంది. పైగా చాలా బ్యాంక్ లు తమ సేవింగ్ అక్కౌంట్లకు అనుసంధానంగా అందిస్తున్నాయి కూడా.

కానీ ఆరోగ్య భీమా అలా కాదు. ఇప్పుడున్న కార్పొరేట్ ఆసుపత్రుల బిల్లులతో చూసుకుంటే ప్రతి మనిషికి కనీసం అయిదు లక్షల రూపాయల విలువైన భీమా పాలసీ అవసరం అవుతుంది. ఇలాంటి పాలసీ ప్రయివేటుగా తీసుకోవాలంటే ఇప్పుడున్న రేట్ల ప్రకారం కనీసం మనిషికి పాతిక వేలకు పైగానే ఖర్చవుతుంది. ప్రభుత్వం గంప గుత్తగా తీసుకుంటుంది కనుక, కనీసం పది వేలు లెక్క వేసుకున్నా, దాదాపు ఆరు నుంచి తొమ్మిది కోట్ల మందికి ఈ పాలసీ తీసుకోవాల్సి వుంటుంది. ఎన్ని వేల వేల కోట్లు ఖర్చు అవుతుంది?

ప్రభుత్వం ఇప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా కూడా వేల కోట్లు ఖర్చు చేస్తోంది.  ఇలా భీమ స్కీములు లేదా ఆరోగ్య శ్రీ పథకాలు అనే కన్నా, ప్రతి పది పంచాయతీలకు ఓ ముఫై పడకల ఆసుపత్రి అనే పద్దతని ప్లాన్ చేసి, నిపుణులను నియమించి, సదుపాయాలు కలిగించడం అనే దాన్ని మొదలు పెట్టాలి. ఇప్పుడు మొదలుపెడితే పదేళ్లకు అయినా ఓ కొలిక్కి వస్తుంది.

వాస్తవం మాట్లాడుకోవాలంటే జగన్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు, సదుపాయాలు కొంత వరకు మెరుగు అయ్యాయన్నది వాస్తవం. ప్రతి జిల్లాకు ఓ మెడికల్ కాలేజీ అన్నది మంచి స్కీము. అది పూర్తిగా కార్యరూపం దాల్చాల్సి వుంది. ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీ, ప్రతి మండలంలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, ప్రతి పది పంచాయతీలకు ఓ ముఫై పడకల ఆసుపత్రి వుండేలా చూడాలి. స్పెషలిస్ట్ లను నియమించాలి.

ఇదంతా ఓ దశ వర్ష ప్రణాళిక మాదిరిగా చేయాలి. అప్పుడు ఆరోగ్యశ్రీలు అవసరం వుండదు..భీమాలు అవసరం వుండదు. పైగా కార్పొరేట్ ఆసుపత్రులకు ముకుతాడు వేసినట్లు అవుతుంది. అంతే తప్ప పదివేల కోట్లతో భీమా అయిపోతుంది అనే ధీమా జస్ట్ ప్రజలకు ఏదో చెప్పడం వరకు పనికి వస్తుంది లేదా భీమా కంపెనీలను పెంచి పోషించడానికి పనికి వస్తుంది తప్ప, వైద్య రంగాన్ని బలోపేతం చేయడానికి మాత్రం కాదు.