తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చాలా చురుగ్గా కీలకమైన మలుపులు తిరుగుతున్నాయి. తాను ఒంటరిగా ప్రస్థానం సాగిస్తున్నప్పటికీ.. కేసీఆర్ ప్రభుత్వం మీద విరుచుకుపడడంలో తీవ్రమైన దూకుడు ప్రదర్శిస్తున్న వైఎస్ షర్మిల తన పార్టీ ని కాంగ్రెసులో విలీనం చేయబోతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.
విలీన నిర్ణయం దాదాపుగా ఖరారైనట్లే. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వర్గంలో షర్మిల విలీనం పట్ల కొన్ని శషబిషలు, అసంతృప్తులు ఉన్నప్పటికీ.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెంగుళూరు వెళ్లి అక్కడి ఉపముఖ్యమంత్రి డికె శివకుమార్ తో భేటీ అయి వచ్చిన తర్వాత పరిస్థితి మొత్తం మారినట్టుగా తెలుస్తోంది. షర్మిల విలీనానికి తెలంగాణ కాంగ్రెసులోని నాయకులు అందరూ ఒప్పుకుని తీరాల్సిన పరిస్థితి ఏర్పడినట్లుగా పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
షర్మిల తాను వైఎస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించిన తర్వాత.. తెలంగాణలో సుదీర్ఘమైన పాదయాత్రను సాగించారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా పాలేరునుంచి పోటీచేస్తానని ప్రకటించారు. ఆ మేరకు ఆమె పాలేరులో రంగంలోకి దిగడానికి స్థానికంగా ఏర్పాట్లు చేసుకుంటూ వస్తున్నారు కూడా. పాలేరు సీటును ఆమెకు కేటాయించడానికి కాంగ్రెసుకు అభ్యంతరం లేదని, ఆ హామీతోనే వస్తున్నారని తెలుస్తోంది.
అయితే షర్మిల కాంగ్రెసులోకి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసుకు చాలా మేలు జరుగుతుందని తెలంగాణ పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే ప్రకటించడాన్ని ఇక్కడ కీలకంగా గమనించాలి. కాంగ్రెసుకు అలాంటి ఆశ ఉండొచ్చు గానీ, ఒకసారి తన అన్నయ్య జగన్ తో విభేదించి వచ్చేసిన తర్వాత.. ఏపీ రాజకీయాల గురించి చిన్న విమర్శ కూడా చేయకుండా, జగన్ మాటెత్తకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్న షర్మిల.. ఏపీ రాజకీయాల్లో ఆయన మీద దాడికి దిగుతారా? అనేది సందేహమే.
అయితే.. షర్మిల ఇంకా విలీనం చేయలేదు గానీ.. ముఠాలకు పేరుమోసిన తెలంగాణ కాంగ్రెసులో కొందరు నాయకులు అప్పుడే అశుభ సంకేతాలు పలుకుతున్నారు. మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. షర్మిల వస్తే కాంగ్రెసుకు మంచిదే గానీ.. ఆమెకు పార్టీ ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వకూడదని అంటున్నారు. అన్ కండిషనల్ గా, సీటు గురించి ఎలాంటి కమిట్మెంటు అడగకుండా వచ్చే నేతలను మాత్రం చేర్చుకోవాలని మధుయాష్కీ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పొంగులేటి విషయంలో కూడా ఆయన ఇదే మాట అంటున్నారు. అయినా.. సీటు గురించిన కమిట్మెంటు లేకుండా.. దారినపోయే దానయ్య అయినా సరే కాంగ్రెసులోకి ఎందుకు వస్తారనేది ప్రజల సందేహం.
అదే సమయంలో.. టికెట్ల విషయంలో బీసీలకు ప్రాధాన్యం ఇస్తే.. తెలంగాణలో కాంగ్రెసు సునాయాసంగా గెలుస్తుందని ఈ గౌడ్ నాయకుడు చెబుతున్నారు. ముందుముందు తె-కాంగ్రెస్ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయో చూడాలి.