గుంటూరుకారం థియేటర్లలో ఇకపై హనుమాన్

హనుమాన్ సినిమాకు నైజాంలో జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై గతంలో గ్రేట్ ఆంధ్ర పలు కథనాలు  కూడా ఇచ్చింది. హైదరాబాద్ లో మరీ ఘోరంగా కేవలం 4 సింగిల్స్ స్క్రీన్స్ మాత్రమే…

హనుమాన్ సినిమాకు నైజాంలో జరిగిన అన్యాయం గురించి అందరికీ తెలిసిందే. దీనిపై గతంలో గ్రేట్ ఆంధ్ర పలు కథనాలు  కూడా ఇచ్చింది. హైదరాబాద్ లో మరీ ఘోరంగా కేవలం 4 సింగిల్స్ స్క్రీన్స్ మాత్రమే హనుమాన్ కు దక్కాయి.

బాధాకరమైన విషయం ఏంటంటే, హనుమాన్ ను ప్రసారం చేస్తామని అగ్రిమెంట్లు చేసుకొని మరీ, నైజాంలో చాలా స్క్రీన్స్ లో గుంటూరుకారం సినిమాను వేశారు. దీంతో మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ కు నష్టం వాటిల్లింది.. అలా నిన్న హను-మాన్ సినిమా నైజాంలో చాలా స్క్రీన్స్ పోగొట్టుకుంది.

అయితే ఇకపై హనుమాన్ కు ఈ సమస్య ఉండబోదు. మరికొన్ని రోజుల్లో నైజాంలో ఈ సినిమాకు కావల్సినన్ని స్క్రీన్స్ దొరకబోతున్నాయి. హనుమాన్ కోసం అగ్రిమెంట్లు చేసుకొని.. నిన్న, ఈరోజు గుంటూరుకారం సినిమాను ప్రదర్శిస్తున్న చాలా స్క్రీన్స్ ఇప్పుడు తిరిగి హనుమాన్ వైపు రాబోతున్నాయి.

అగ్రిమెంట్లు ఉన్నప్పటికీ తమ సినిమాను ప్రదర్శించకపోవడంతో, మైత్రీ మూవీస్ సంస్థ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ను ఆశ్రయించింది. తమకు జరిగిన నష్టాన్ని నిర్మాతల మండలి ముందు ఉంచింది. దీనిపై స్పందించిన కౌన్సిల్, అగ్రిమెంట్ ప్రకారం తక్షణం హను-మాన్ సినిమాను ప్రదర్శించాలని ఎగ్జిబిటర్లను కోరింది. అంతేకాదు, ఈ 2 రోజుల నష్టాన్ని కూడా థియేటర్లు భరించాలని సూచించింది.

నిజానికి తమకు అన్యాయం జరుగుతోందనే విషయాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, నిర్మాత నిరంజన్ రెడ్డి సినిమా విడుదలకు ముందు నుంచే పెద్దల్ని సంప్రదించారు. ఎట్టకేలకు వాళ్లకు ఫిలింఛాంబర్ నుంచి మద్దతు లభించింది. మరోవైపు గుంటూరుకారం సినిమాకు నెగెటివ్ టాక్ రావడం, హను-మాన్ కు హిట్ టాక్ రావడంతో, ఇక ఆటోమేటిగ్గా థియేటర్లన్నీ హను-మాన్ వైపు రావడం ఖాయం.