పండగ సీజన్ రిలీజ్‌ల్లో అత్యంత డైలమాలో వున్న సినిమా ఒకే ఒక్కటి ‘హనుమాన్’. ఈ సినిమాకు విడుదల తేదీనే శాపంగా మారింది. ఏనాటికో విడుదల కావాల్సి వుంది. కానీ టీజర్ కు వచ్చిన హైప్ చూసి, కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. దాదాపు 1500 పైగా సిజి షాట్ లను చాలా కేర్ తీసుకుని చేయించారు. వాటిలో సగానికి పైగా షాట్ లను మళ్లీ మళ్లీ చేయించారు. ఇప్పుడు ఇంకా దాదాపు నాలుగు వందల సిజి షాట్ ల వరకు రెడీ కావాల్సి వుంది. సరే, అవి వచ్చేస్తాయి. పెద్దగా సమస్య లేదు.
కానీ సంక్రాంతికి విడుదల చేయాలి అంటే ఎలా? సంక్రాంతికి హనుమాన్ తో కలిపి పక్కా నాలుగు సినిమాలు ఫిక్స్ అయి వున్నాయి. గుంటూరుకారం మహేష్ బాబు సినిమా అందువల్ల థియేటర్ల సమస్య రాదు. సైంధవ్ వెంకటేష్ సినిమా. సురేష్ బాబు బ్యాకింగ్ వుంటుంది. థియేటర్ల సమస్య వుండదు. ఈగిల్ సినిమాను హోల్ సేల్ గా అమ్మేసారు. కొనుక్కున్న వాళ్లు థియేటర్లను ఇప్పటి నుంచే జాగ్రత్త చేసుకుంటున్నారు.
ఇక మిగిలింది హనుమాన్ మాత్రమే. పైగా మిగిలిన సినిమాల కన్నా పక్కా నార్త్ బెల్ట్ లో విడుదల ప్లాన్ చేసుకున్న సినిమా ఇది. కానీ నిర్మాతలకు మాత్రం తెలుగు నాట బలమైన నెట్ వర్క్ లేదు. మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాను మిగిలిన వారితో పోటీ పడి విడుదల చేసుకోవడంలో నిర్మాత వీక్ అనే చెప్పాలి.
అలాంటపుడు సంక్రాంతికి రావడమా? వద్దా? రాకుండా వుంటే మళ్లీ డేట్ ఎప్పుడు దొరుకుతుంది. పైగా నార్త్ బెల్ట్ లో డేట్ కావాలి. అయోధ్య రామమందిరం ఓపెనింగ్ బజ్ ను ఈ సినిమా క్యాష్ చేసుకోవాలి అనుకుంటే సంక్రాంతికే రావాలి. కానీ అలా రావాలి అంటే నైజాంలో సరైన బయ్యర్ దొరకాలి. మైత్రీ మూవీస్ తో డిస్కషన్లు జరుగుతున్నాయి. కానీ వాళ్లు కొన్నా కూడా థియేటర్ల సమస్య వుంటుంది.
అందుకే ఏం చేయాలో అన్నది క్లారిటీ లేక హనుమాన్ మేకర్లు సతమతమవుతున్నారు. త్వరలో ఓపాట విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్ లోనే ట్రయిలర్ విడుదలకు కూడా సన్నాహాలు చేస్తున్నారు.