ఆదిపురుష్ యూనిట్ నష్టనివారణ చర్యలకు దిగింది. ఒకేసారి రెండు కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. వీటిలో ఒకటి వివాదాస్పద డైలాగ్ ను తొలిగించడం, ఇక రెండోది నేపాల్ ప్రభుత్వానికి క్షమాపణలు చెబుతూ, అక్కడ కూడా చిన్న మార్పు చేయడం.
ముందుగా భజరంగీ (హనుమంతుడు) చెప్పిన వివాదాస్పద డైలాగ్ గురించి చెప్పుకుందాం. “గుడ్డ నీ బాబుది, తైలం నీ బాబుది, అగ్ని కూడా నీ బాబుదే, కాబట్టి కాలేదీ నీ బాబుదే” అనే డైలాగ్ తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆంజనేయుడి లాంటి దేవుడి నోట ఇలాంటి మాస్ డైలాగ్ ను, పైగా కాస్త బూతు ధ్వనించే డైలాగ్ ను చెప్పించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది.
ఇప్పుడీ డైలాగ్ ను పూర్తిగా మార్చేశారు. “గుడ్డ నీ లంకది, చమురు నీ లంకది, అగ్ని కూడా నీ లంకదే, కాబట్టి కాలేదీ నీ లంకకే” అంటూ డైలాగ్ ను పూర్తిగా మార్చేశారు. ఉన్నంతలో ఇది కొంచెం బెటర్ అనిపిస్తోంది.
ఇక నేపాల్ లో సీత జన్మస్థానంపై వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. జానకి భరత పుత్రిక అనే సంభోదనను నేపాలీయులు తీవ్రంగా వ్యతిరేకించారు. జానకి జన్మస్థలం నేపాల్ అనేది వాళ్ల వాదన. నిరసనగా ఖాట్మాండూ, ఫోఖరా మెట్రోపాలిటిన్ పరిథిలో భారతీయ సినిమాల్ని నిషేధించారు. దీనిపై స్పందించిన యూనిట్.. నేపాలీయులకు భేషరతుగా క్షమాపణలు చెప్పడంతో పాటు.. ఆ డైలాగ్ ను తొలిగించింది.
రూ. 400 కోట్ల క్లబ్ లోకి…
ఓవైపు ఆదిపురుష్ సినిమాపై వివాదాలు కొనసాగుతుంటే, మరోవైపు ఈ సినిమా మరో రికార్డ్ సృష్టించింది. తాజాగా 400 కోట్ల రూపాయల క్లబ్ లోకి చేరింది. 6 రోజుల్లో ఆదిపురుష్ సినిమాకు వరల్డ్ వైడ్ 410 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. నిజానికి సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి ఉంటే 4 రోజుల్లోనే నమోదవ్వాల్సిన రికార్డ్ ఇది.