పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల జాబితాలో హరి హర వీరమల్లు, ఉస్తాద్ సినిమాలు రెండూ వున్నాయి. అందులో సందేహం లేదు. కానీ ఆ రెండు సినిమాలు ఎప్పుడు రెడీ అవుతాయి అన్నది మాత్రం మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది. 2023 లో అయితే రావు. 2024లో అయినా వస్తాయా? అన్నదే చూడాలి.
దర్శకుడు త్రివిక్రమ్ సెట్ చేసిన ఓజి సినిమా షూట్ చకచకా జరిగిపోతోంది. డిసెంబర్ లో విడుదలయిపోతుంది. అందులో అనుమానం అస్సలు లేదు. కానీ వంద రోజుల వర్కింగ్ డేస్ కావాలి ఉస్తాద్ సినిమాకు. పవన్ ఎప్పుడు ఇస్తారు ఇన్ని వర్కింగ్ డేస్? పైగా జూలై నెలలో కూడా మలి విడత వారాహి యాత్ర వుందీ అంటున్నారు. ఒక వేళ ఏమాత్రం గ్యాప్ దొరికినా జూలై, ఆగస్ట్ ల్లో ఓజి సినిమాకే కేటాయిస్తారు. ఎందుకుంటే ముందు దాన్ని పూర్తి చేయాలి.
2019 సెప్టెంబర్ లో విడుదలైంది గద్దలకొండ గణేష్. మరో రెండు నెలల్లో నాలుగేళ్లు పూర్తవుతుంది దర్శకుడు హరీష్ శంకర్ నుంచి సినిమా వచ్చి. ఇప్పుడు ఎన్నికల మూడు అలుముకుంటోంది. ముందస్తు ఎన్నికలు అంటున్నారు. అంటే వీటన్నింటి నుంచి పవన్ ఫ్రీ అవ్వాలంటే కనీసం ఆరు నెలలు పడుతుంది.
ఆ తరువాత పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు. విజయం సాధిస్తే అధికార వ్యవహారాల్లో బిజీగా వుంటారు. బై బ్యాడ్ లక్ తేడా వస్తే మానసికంగా మళ్లీ సిద్దం కావడానికి చాలా సమయమే పడుతుంది.
ఈ లెక్కన ఉస్తాద్ ఎప్పుడు తెరపైకి వస్తుంది. ఇక జనాలు ఆల్ మోస్ట్ మరిచిపోతున్న హరి హర వీరమల్లు పరిస్థితి ఏమిటి? తెలియాల్సి వుంది.