హరీష్ శంకర్ మరోసారి కెలికాడు. ఓవైపు మహేష్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలు ఉన్నప్పటికీ.. పాన్-ఇండియా స్టార్ అవ్వగలిగే క్వాలిటీస్ మాత్రం వరుణ్ తేజ్ కే ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రభాస్ తర్వాత ఆలిండియా లెవెల్లో స్టార్ అయ్యే లక్షణాలు వరుణ్ తేజ్ లోనే ఉన్నాయని, అతడితో కేజీఎఫ్ లాంటి సినిమా తీయొచ్చని అభిప్రాయపడ్డాడు.
“ప్రభాస్ కాకుండా ప్యాన్-ఇండియా లెవెల్ కు సరిపోయే హీరో వరుణ్ తేజ్ మాత్రమే. గద్దలకొండ గణేష్ చూస్తున్నప్పుడు నాకు అనిపించిన ఫీలింగ్ ఇది. కచ్చితంగా వరుణ్ తో కేజీఎఫ్ లాంటి సినిమా తీయొచ్చు. తన కటౌట్ కు, తన యాక్టింగ్ ప్యాషన్ కు, తన సెన్సిబులిటీస్ కు పాన్-ఇండియా రేంజ్ లో సూట్ అవుతాడు వరుణ్.”
వరుణ్ తో గద్దలకొండ గణేష్ సినిమా చేశాడు కాబట్టి హరీష్ ఇలా అన్నాడని అనుకోవడానికి వీల్లేదు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు లిస్ట్ లో చాలామంది హీరోలుండగా, వరుణ్ ఒక్కడే పాన్-ఇండియాకు అర్హుడని చెప్పడం కాస్త వివాదాస్పదమైంది. అదే సమయంలో బడ్జెట్ పై కూడా స్పందించాడు. భారీ బడ్జెట్ ఉంటే పాన్-ఇండియా సినిమా అయిపోదంటూ సాహోపై పరోక్షంగా సెటైర్లు వేశాడు.
“పాన్-ఇండియా లెవెల్లో డైరక్టర్ అవ్వాలంటే బడ్జెట్ సమస్య కాదు. బడ్జెట్ అనేది కథను బట్టి వస్తుంది. ఓన్లీ బడ్జెట్ ఉంటే పాన్-ఇండియా సినిమా రాదు. వెయ్యి కోట్లు టేబుల్ పై వేసుకొని కూర్చుంటే బాహుబలి స్క్రిప్ట్ రాదు. బాహుబలి వచ్చిన తర్వాత 2వేల కోట్లు అయినా వస్తాయి. స్క్రిప్ట్ అనేది ఫండ్స్ తీసుకొస్తుంది.. అంతే తప్ప ఫండ్స్ తో క్రియేటివిటీ రాదు.”
తన కామెంట్స్ తో ఎప్పటికప్పుడు వివాదాలకు కేంద్రబిందువుగా మారుతుంటాడు హరీష్. అయితే రీసెంట్ టైమ్స్ లో ఆయన తన దూకుడు తగ్గించాడని అంతా అనుకున్నారు. ఇదే విషయాన్ని దిల్ రాజు కూడా ఆమధ్య చెప్పుకొచ్చారు. కానీ హరీష్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే.. అదే దూకుడుతో ఉన్నాడని అర్థమౌతోంది.