తీసుకునే ప్రతి నిర్ణయం గురించీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వయంగా వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి రాకూడదు. జంబో క్యాబినెట్ వుంది కదా.. ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. విప్‌లు వుండనే వున్నారు. పార్టీ తరఫున మాట్లాడేందుకు అధికార ప్రతినిథులకూ కొదవ లేదు. అయినాగానీ, ఎందుకో జగన్ తీసుకుంటున్న సంచలన నిర్ణయాలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు అధికార పక్షం నుంచి కౌంటర్ సరిగ్గా పడటంలేదు.
బోటు మునిగిపోయిన వ్యవహారంలో కావొచ్చు, కృష్ణా నదికి వరదలొచ్చినప్పుడు కావొచ్చు.. ప్రాజెక్టుల రివర్స్ టెండరింగ్ వ్యవహారంలో కావొచ్చు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీపై కావొచ్చు.. విపక్షాలు యాగీ చేయడం సర్వసాధారణమే. ఆ యాగీకి కౌంటర్ ఇవ్వాల్సిన బాధ్యత మంత్రుల మీదా, ఇతర వైసీపీ నేతల మీదా వుంది. అమరావతి విషయంలో బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆ తర్వాత పలువురు మంత్రులు భిన్నమైన వాదనలు విన్పించారు. ఆ వ్యవహారంపై అప్పట్లో పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగింది.. ఆ తర్వాత అంతా ఒక్క తాటిపైకొచ్చారు.
కోడెల ఆత్మహత్య వ్యవహారంలోనూ అంతే. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ముందు చాలా బాధ్యతలున్నాయి. చంద్రబాబు హయాంలోని లొసుగుల్ని వెలికి తీసే క్రమంలో అధికారులతో క్షణం తీరిక లేకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారాయన. ఈ క్రమంలో పార్టీ వాయిస్‌ని, ప్రభుత్వం తాలూకు వాదనల్ని సమర్థవంతంగా నిర్వహించాల్సింది.. పార్టీ ముఖ్య నేతలే. సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ, జూనియర్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. ఇలా అందరిదీ ఒకటే తీరు.
పార్టీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి, ట్విట్టర్‌కే పరిమితమవకుండా.. పార్టీ కార్యక్రమాలపై దృష్టిపెట్టాల్సి వుంది. ప్రతిపక్షంలో వున్నప్పుడు వున్నంత యాక్టివ్‌గా, అధికారంలో వున్నప్పుడు లేరన్నది నిర్వివాదాంశం. గత ప్రభుత్వ హయాంలోలా మంత్రులు అడ్డగోలుగా మీడియా ముందుకొచ్చి వాదించేయాలని ఎవరూ అనుకోవడంలేదుగానీ.. ముఖ్యమైన విషయాలపై ప్రభుత్వం తరఫున గట్టిగా అధికార పార్టీ నేతలు నిలబడాల్సిందే.