కోడెల ‘గండం’.. టీడీపీకి తొలగిపోలేదింకా.!

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య కేసుకి సంబంధించి తమకేదో పెద్ద ఊరట లభించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెగ ఉబలాటపడిపోతున్నారు. సీబీఐకి ఈ కేసు అప్పగించాలంటూ…

ఏపీ మాజీ అసెంబ్లీ స్పీకర్‌, టీడీపీ సీనియర్‌ నేత కోడెల శివప్రసాద్‌ ఆత్మహత్య కేసుకి సంబంధించి తమకేదో పెద్ద ఊరట లభించినట్లు తెలుగుదేశం పార్టీ నేతలు తెగ ఉబలాటపడిపోతున్నారు. సీబీఐకి ఈ కేసు అప్పగించాలంటూ అనిల్‌ అనే వ్యక్తి న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే, అందులో ప్రజా ప్రయోజనాలేమున్నాయంటూ న్యాయస్థానం ఆ పిటిషన్‌ని కొట్టిపారేసిన విషయం విదితమే. 'కోడెల విషయంలో అత్యుత్సాహం చూపాలనుకున్నారు.. న్యాయస్థానం ముందర బోల్తా కొట్టేశారు..' అంటూ టీడీపీ సోషల్‌ మీడియా 'దళం' నానా యాగీ చేస్తోంది. అయితే, టీడీపీ నేతలు మాత్రం ఈ వ్యవహారంపై ఆచి తూచి స్పందిస్తున్నారు.

'తెలంగాణ పోలీసులపై నమ్మకం వుంది.. కేసు విచారణ దశలో వుండగా, సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏంటి.?' అన్నది న్యాయస్థానం ప్రశ్న. సో, కోడెల ఆత్మహత్యకి సంబంధించి కేసు 'క్లోజ్‌' అయినట్లు కాదు. అసలు కోడెల ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారు.? ఏ పరిణామాలు ఆయన్ని ఆత్మహత్య వైపు ప్రేరేపించాయి.? అన్న దిశగా విచారణ కొనసాగుతోంది. వైఎస్‌ జగన్‌ సర్కార్‌ 'వేధించింది' అంటూ టీడీపీ హడావిడి చేస్తోందిగానీ, చంద్రబాబు తీరు నచ్చక కోడెల, బీజేపీ వైపు చూస్తున్న విషయాన్ని విస్మరిస్తే ఎలా.?

ఇక, కోడెల కుటుంబ సభ్యుల వ్యవహారంపై గుంటూరు జిల్లాలో ఇంకా చర్చ జరుగుతూనే వుంది. నిజానికి, కోడెలపై వ్యతిరేకత కంటే, ఆయన కుటుంబ సభ్యులపై వ్యతిరేకతే చాలా చాలా ఎక్కువ. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుంటే, టీడీపీకి ముందుంది ముసళ్ళ పండగ.. అని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఆత్మహత్య చేసుకునేందుకోసం ఇంజెక్షన్‌ చేసుకున్నారనీ.. ఇంకోటనీ టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనాలపైనా విచారణ జరిగితే.. అప్పుడెలాంటి ఆసక్తికరమైన విషయాలు వెలుగు చూస్తాయో ఏమో.!