లాక్‌డౌన్ ఎప్పుడెప్పుడు ముగుస్తుందా…ఎప్పుడెప్పుడు షూటింగ్‌లు మొదలవుతాయా అని చిత్రపరిశ్రమ తహతహలాడింది. పరిశ్రమ పెద్దల కోరిక మేరకు ప్రభుత్వాలు షూటింగ్‌లకు పర్మిషన్ ఇచ్చాయి. బుల్లితెర, వెండితెర షూటింగ్‌లు స్టార్ట్ అయ్యాయి. అలా షూటింగ్‌లు మొదలయ్యాయో లేదో, తానంటే బొత్తిగా భయమో లేకుండా పోయిందేనని కరోనా వైరస్ స్వైర విహారాన్ని చేసింది. దీంతో కొందరు నటీనటులు కరోనాబారిన పడ్డారు. బతుకు జీవుడా అంటూ కొందరు షూటింగ్‌లను రద్దు చేసు కున్నారు. మరికొందరు ఎన్నో జాగ్రత్తల మధ్య షూటింగ్‌లు నిర్వహిస్తున్నారు.
ఈ నేపథ్యంలో లోకేషన్‌లో చిత్ర యూనిట్ తీసుకునే ముందు జాగ్రత్తలతో పాటు హీరోహీరోయిన్లు వ్యక్తిగతంగా కూడా అప్రమ త్తంగా ఉంటున్నారు. తాజాగా షూటింగ్‌లో పాల్గొననున్న హీరోయిన్ దిగంగనా సూర్యవన్షీ తీసుకోవాలనుకుంటున్న జాగ్రత్తలను చూస్తే ఎంత అప్రమత్తంగా ఉన్నారో అర్థమవుతుంది. కరోనా అంటే ఆమెకు ఎంత భయభక్తులున్నాయో తెలుస్తోంది. గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో ‘సీటీమార్’ చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రంలో తమన్నాతో పాటు దిగంగనా కూడా మరో హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో దిగంగనా ఏం చెబుతున్నారంటే…
‘ సెట్స్‌లో నేను ఎవరితోనూ చేతులు కలపను (నవ్వుతూ). అంటే దానర్థం .. ఎవరికీ షేక్‌హ్యాండ్ ఇవ్వను. వీలైనంత వరకూ ఇంట్లో చేసిన వంటకాలను తింటాను. లైట్ మేకప్ చాలనే సన్నివేశాలకు నేనే మేకప్ చేసుకోవాలనుకుంటున్నాను’ అని ఆమె చెప్పుకొచ్చారు. ఎంతటి వారైనా కరోనా ముందు క్రమశిక్షణగా ఉండాల్సిందే. ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా అంతే సంగతులు.