సినిమాకు 27 కోట్ల రెమ్యూనిరేషన్. తీరా చూస్తే థియేటర్ మార్కెట్ అంతంత మాత్రం. అసలు థియేటర్ దగ్గర ఓపెనింగ్ కూడా సరిగ్గా రాని వైనం. ఇలాంటి హీరోలు ఒకరిద్దరు వున్నారు మన టాలీవుడ్ లో. నష్టాలు మూటకట్టుకుంటున్న, నిర్మాతలు పైకి మాట్లాడరు. కొత్త నిర్మాతలు రంగంలోకి దిగుతుంటారు. రెమ్యూనిరేషన్ లు పెరుగుతూనే వుంటాయి. యావరేజ్ లను హిట్ లుగా చలామణీ చేసుకుంటారు కొందరు. డిజాస్టర్లను చూసీ చూడనట్లు వదిలేస్తుంటారు. మొత్తానికి పబ్లిసిటీ మాయతో అంతా సాగిపోతూ వుంటుంది.
ఇలాంటి నేపథ్యంలో యంగ్ టాలెంటెడ్ హీరోలు మెల్లగా పైకి వస్తున్నారు. పది కోట్లకు అటు ఇటు రేంజ్ లో అడవి శేష్ మంచి హిట్ లు కొడుతున్నారు. మంచి సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు అదే రేంజ్ లో సిద్దు జొన్నలగడ్డ కూడా తన స్టామినా చూపిస్తున్నాడు. తనే రాసుకుని, తన స్టయిలో తనే మాట్లాడి, తనే నటించి, వన్ మ్యాన్ షో అన్నట్లుగా చూపించి మాంచి సెన్సెషన్ హిట్ లు కొడుతున్నారు.
టిల్లు రెండో పార్ట్ నైజాంలో ఇరవై కోట్లు దాటిన షేర్ సాధిస్తుందని అంచనా వేస్తున్నారు. అదే అయితే ఈ పాతిక కోట్ల హీరోల సినిమాల కలెక్షన్లు దాటేసినట్లే. మరొక్క హిట్ కొడితే సిద్దు రేంజ్ మారిపోతుంది. పారితోషికం పెరగవచ్చు. కానీ కలెక్షన్లు కూడా వుంటాయి. కానీ ఇప్పటికే పాతిక కోట్లు తీసుకుంటున్న వాళ్ల కలెక్షన్లు మాత్రం అలా వుండడం లేదు. కానీ అప్పుడయినా వాళ్ల రెమ్యూనిరేషన్లు దిగుతాయా? అంటే ఇచ్చేవారు ఎవరో ఒకరు వుంటూనే వుంటారు. కాబట్టి నడుస్తూనే వుంటుంది కథ.
మరో నలుగురు వరకు మిడ్ రేంజ్ హీరోలు వున్నారు. వీళ్లు పది కోట్లు దాటితే మాట్లాడండి అని కూర్చున్నవాళ్లే. అలాగే ఇచ్చుకుంటూ సినిమాలు తీస్తున్నారు. కానీ వీళ్లకు హిట్ లు దరిదాపుల్లో లేవు. ఒకరిద్దరైతే అసలు హిట్ అంటే ఎలా వుంటుంది అని మొహం వాచి వున్నారు. అయినా రేటు తగ్గించం అని కూర్చున్నారు. ఏడాదికి ఒకరో ఇద్దరో నిర్మాతలు వచ్చి, అడిగినది ఇచ్చి బలైపోతున్నారు.
సిద్దు, అడవిశేష్, నవీన్ పోలిశెట్టి లాంటి యంగ్, న్యూ టాలెంట్ మరింతగా ఇండస్ట్రీలోకి రావాలి. అప్పుడు కానీ ఈ పది కోట్లు, పాతిక కోట్ల హీరోల డిమాండ్ లకు తెరపడదు.