పేరుకే జనసేనకు 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలు. వాటిలో రెండుమూడు స్థానాల్లో మినహాయించి, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో చంద్రబాబు సూచించిన అభ్యర్థులకే సీట్లు కేటాయిస్తున్నారనే చర్చ నడుస్తోంది. ఇంకా చెప్పాలంటే టీడీపీ నాయకుల్ని జనసేనలోకి పంపి, మరీ టికెట్లు ఇవ్వడం ఆశ్చర్యం కలిగిస్తోంది. నిన్నటికి నిన్న ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో టీడీపీ ఇన్‌చార్జ్ మండలి బుద్ధ ప్రసాద్‌ను జనసేనలోకి చేర్చుకున్నారు. టికెట్ ఆయనకే అని చెప్పాల్సిన పనిలేదు.
తాజాగా చంద్రబాబు ఆదేశాలతో ఏకంగా అభ్యర్థినే మారుస్తున్న పరిస్థితి. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు సీటును జనసేనకు కేటాయించారు. ఇక్కడి నుంచి ఎనమల భాస్కర్‌రావు పోటీ చేస్తారని పవన్‌కల్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల్లోనే అక్కడి రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. ఎలాగైనా తమ అభ్యర్థిని నిలబెట్టాలనే పట్టుదలతో ఉన్న టీడీపీ ఇన్‌చార్జ్ ఎం.రూపానందరెడ్డి వ్యూహాత్మకంగా పావులు కదిపారు.
జనసేన అభ్యర్థిపై వైసీపీ రంగు చల్లారు. పెనగలూరు మండలం ఎన్ఆర్ పురం దళితవాడకు చెందిన ఎనమల భాస్కర్‌రావు విద్యావంతుడు. అయితే ఈయన పెనగలూరు జెడ్పీటీసీ సభ్యుడి మేనల్లుడని, వైసీపీ నేతలతో మంచి సంబంధాలున్నాయని కొన్ని ఫొటోలను తెరపైకి తీసుకొచ్చారు. ఎనమల భాస్కర్‌రావును తప్పించేలా పవన్‌కు చెప్పాలని చంద్రబాబుపై రైల్వేకోడూరు ఇన్‌చార్జ్ ఒత్తిడి తెచ్చారు.
జనసేన అభ్యర్థిని నేడో, రేపో తప్పించనున్నారు. ఈ స్థానంలో టీడీపీ ఇన్‌చార్జ్ రూపానందరెడ్డి తన అభ్యర్థిగా అరవ శ్రీధర్‌ను పెట్టొచ్చని రైల్వేకోడూరులో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ఈయన ఓబులవారిపల్లె మండలం ముక్కవారిపల్లె సర్పంచ్. టీడీపీ గ్రామస్థాయి నాయకుడు. రైల్వేకోడూరు సీటు పేరుకే జనసేనది. ఇక్కడ నిలిచేది మాత్రం టీడీపీ నాయకుడని ఆ నియోజకవర్గ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఈ సంబరానికి అసలు జనసేన సీట్లు తీసుకోవడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమైంది.