Advertisement

Advertisement


Home > Movies - Movie News

వ‌స్తున్నాయ్.. త‌మిళ భారీ సినిమాలు!

వ‌స్తున్నాయ్.. త‌మిళ భారీ సినిమాలు!

భారీ బ‌డ్జెట్ త‌మిళ సినిమాలు రాబోతున్నాయి. గ‌త కొంత‌కాలంగా త‌మిళ సినిమాల హ‌వా కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. ప్ర‌త్యేకించి త‌మిళ‌నాడు అవ‌త‌ల వీటి హ‌డావుడి అంతంత‌మాత్ర‌మే. రోబో 2 త‌ర్వాత ఆ స్థాయిలో నిలిచిన త‌మిళ సినిమాలు కూడా పెద్ద‌గా లేవు. 

పొన్నియ‌న్ సెల్వ‌న్ భారీ వ‌సూళ్లు అంటున్నా.. అది కేవలం త‌మిళ‌నాడు కోసం రూపొందిన త‌మిళ సినిమాగా నిలుస్తోంది. ఇక విక్ర‌మ్ తెలుగునాట ఫ‌ర్వాలేద‌నిపించింది. వ‌చ్చిపోయిన సినిమాల సంగ‌త‌లా ఉంటే.. త‌మిళ‌నాడు నుంచి కొన్ని భారీ సినిమాలు రాబోతున్నాయి. వాటి బ‌డ్జెట్ ఒక్కోదానికి రెండు వంద‌ల కోట్లు, అంత‌కు మించి! ఇలాంటి ప‌రంప‌ర‌లోని ఆ సినిమాలు కేవ‌లం త‌మిళంలోనే కాదు ఇత‌ర భాషాల వాళ్ల‌లో కూడా ఆస‌క్తిని అయితే రేకెత్తిస్తాయి. మ‌రి బాక్సాఫీస్ వ‌ద్ద వాటి స‌త్తా ఎలా ఉంటుందో కానీ త‌మిళ భారీ సినిమాలు అయితే ఒక‌దాని త‌ర్వాత మ‌రోటి క్యూలో ఉన్నాయి.

వీటిల్లో ముందు ఉంది ర‌జ‌నీకాంత్ *జైల‌ర్*. ర‌జ‌నీకి నిజ‌మైన హిట్ ద‌క్కి చాలా సంవ‌త్స‌రాలు అవుతున్నాయి. రోబో2 కి భారీ వ‌సూళ్లు వ‌చ్చినా.. దాని బ‌డ్జెట్ స్థాయికి అవి త‌క్కువే! ఇక ఈ మ‌ధ్య కొన్ని సినిమాలు అయితే ర‌జ‌నీ ఎందుకు వీటిని చేస్తున్నాడో అర్థం కావ‌డం లేద‌నే కామెంట్ల‌కు కార‌ణం అయ్యాయి. పెద్ద‌న్న పెద్ద డిజాస్ట‌ర్. ఇలాంటి క్ర‌మంలో జైల‌ర్ కూడా ర‌జ‌నీ ఈ మ‌ధ్య కాలంలో చేస్తున్న సినిమాల తానులోని ముక్కేనా లేక నిజంగానే ఏమైనా శ్ర‌ద్ధ చూపించారో చూడాల్సి ఉంది. ఈ సినిమా బ‌డ్జెట్ సుమారు రెండు వంద‌ల కోట్ల రూపాయ‌లు. ఇందులో 80 కోట్ల రూపాయ‌లు కేవ‌లం ర‌జ‌నీకాంత్ పారితోషికం మాత్ర‌మే అని స‌మాచారం.

ఇక మ‌రో విజ‌య్ హీరోగా రాబోతున్న లియో బ‌డ్జెట్ 250 కోట్ల రూపాయ‌ల నుంచి 300 కోట్ల‌ట‌. ఇందులో కూడా సింహ‌భాగం హీరోగారి పారితోషిక‌మే. ఈ సినిమాకు విజ‌య్ అందుకునే రెమ్యూనిరేష‌న్ 120 కోట్ల రూపాయ‌ల‌ట‌! ఇంత భారీ గా వెచ్చిస్తున్నా దీని రూప‌క‌ర్త‌ల‌కు పోయేదేం లేద‌ని.. ప్రీ రిలీజ్ బిజినెస్ లోనే 250 కోట్ల రూపాయ‌ల‌ను వారు సంపాదించేసుకున్నార‌ని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి!

విక్ర‌మ్ హీరోగా రంజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న తంగలాన్ సినిమా బ‌డ్జెట్ 150 కోట్ల రూపాయ‌ల‌ట‌. దాదాపు ద‌శాబ్ద‌కాలంగా విక్ర‌మ్ సినిమాల ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తే ఇది ఆయ‌న విష‌యంలో పెద్ద ప్ర‌యోగ‌మే అనుకోవ‌చ్చు. అయితే ఈ సినిమాను 1890ల నేప‌థ్యంలో రూపొందిస్తున్నార‌ట‌. దీంతో హీరో పారితోషికం క‌న్నా మేకింగ్ కే ఎక్కువ వెచ్చిస్తుండ‌వ‌చ్చు!

ఇక సూర్య 42వ సినిమా బ‌డ్జెట్ 300 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ అని అంచ‌నా. ఈ సినిమాను ఏకంగా ప‌ది భాష‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టుగా ఇది వ‌ర‌కే ప్ర‌క‌టించారు. ఇందులో సూర్య ఐదు పాత్ర‌ల్లో కూడా క‌నిపిస్తున్నాడ‌ని కూడా ప్ర‌క‌టించారు. ప్ర‌యోగాల‌ను చేస్తూ కూడా చెప్పుకోద‌గిన విజ‌యాల‌ను అందుకుంటున్న హీరో సూర్య‌నే. ఇలాంటి నేప‌థ్యంలో ఈ సినిమా స‌ర్వ‌త్రా ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.

ఇంకో త‌మిళ భారీ బ‌డ్జెట్ సినిమా వ‌ర‌స‌లో ఉంది. అదే ఇండియ‌న్-2 ఇప్ప‌టికే చాలా కాలంగా సెట్స్ మీద‌ ఉన్న ఈ సినిమా ఆగిపోయి, మ‌ళ్లీ మొద‌లైన‌ట్టుగా ఉంది. ఐదేళ్ల‌లో దీని వడ్డీలు ఏ స్థాయికి చేరి ఉంటాయో కానీ బ‌డ్జెట్ అయితే 250 కోట్ల రూపాయ‌లు అని అంచ‌నా!

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?