బోణీ కొట్టలేకపోయిన బెల్లంకొండ

ఇన్నాళ్లూ తన సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ బెల్ట్ ను ఆకర్షించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చూసి, నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకైనా మంచిదని రీమేక్ సబ్జెక్ట్ ను…

ఇన్నాళ్లూ తన సినిమాల డబ్బింగ్ వెర్షన్లతో నార్త్ బెల్ట్ ను ఆకర్షించాడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్. యూట్యూబ్ లో వచ్చిన వ్యూస్ చూసి, నేరుగా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ఎందుకైనా మంచిదని రీమేక్ సబ్జెక్ట్ ను సెలక్ట్ చేసుకున్నాడు. యాక్షన్ సబ్జెక్ట్ ను బాగా తీస్తాడనే పేరున్న వినాయక్ ను దర్శకుడిగా తీసుకున్నాడు. ఇలా సెటప్ అంతా బాగానే కుదిరినప్పటికీ, రిజల్ట్ మాత్రం తేడాకొట్టింది.

అవును.. హిందీలో ఛత్రపతి సినిమాకు చాలా బ్యాడ్ టాక్ వచ్చింది. ఏ సెక్షన్ ఆడియన్స్ ను ఇది మెప్పించలేకపోయింది. దీనికి కారణం మేకర్స్ అప్ డేట్ అవ్వకపోవడమే.

ప్రభాస్ హీరోగా నటించిన ఛత్రపతి సినిమా 2005లో వచ్చింది. 18 ఏళ్ల తర్వాత ఆ సినిమాను రీమేక్ చేస్తున్నారు. అంటే, దాదాపు 2 జనరేషన్ల గ్యాప్. సో.. ఇప్పటితరం ఆడియన్స్ టేస్ట్, మరీ ముఖ్యంగా బాలీవుడ్ సెన్సిబిలిటీస్ చూసుకొని కథకు మార్పుచేర్పులు చేయాలి.

కానీ ఒరిజినల్ ను చెడగొట్టకూడదనే ఉద్దేశమో లేక మళ్లీ రీ-వర్క్ ఎందుకనే నిర్లక్ష్యమో తెలీదు కానీ.. ఉన్నదున్నట్టు రీమేక్ చేశారు. దీంతో ఈతరం బాలీవుడ్ ఆడియన్స్ కు ఛత్రపతి నచ్చలేదు. రాజమౌళి తీసిన ఛత్రపతిలో అద్భుతమైన ఎమోషన్ ఉంటుంది. అదే అతడి బలం కూడా. ఈ హిందీ ఛత్రపతిలో అదే మిస్సయింది. ఛత్రపతి ఒరిజినల్ వెర్షన్ లో ఫైట్ లో కూడా ఓ ఎమోషన్ కనిపిస్తుంది. కానీ ఈ హిందీ ఛత్రపతిలో ఎలాంటి ఎమోషన్ కనిపించలేదు.

రీమేక్ చేసేటప్పుడు కథలో ఆత్మను పట్టుకోవడం ముఖ్యం అంటారు. ఛత్రపతి రీమేక్ లో ఆ ప్రయత్నం మచ్చుకు కూడా కనిపించదు. ఒరిజినల్ ను చెడగొట్టామనే కామెంట్స్ వస్తాయనే భయంతో సన్నివేశాలు కూడా మార్చకుండా తీసేశారు. అయితే ఇప్పటి తరానికి ఎక్స్ పోజింగ్ కావాలనే ఉద్దేశంతో భలేగా కెమెరా యాంగిల్స్ సెట్ చేశారు. కానీ ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి.

చివరికి బెల్లంకొండ కూడా ఆకట్టుకోలేకపోయాడంటూ బాలీవుడ్ మీడియా ఏకి పడేసింది. పొడుగ్గా, కండలతో ఉన్న హీరో రౌడీల్ని కొట్టడం మినహా మరేం చేయలేదని, ఇక హీరోయిన్ నుష్రత్ బరూచా, తన కెరీర్ లోనే చెత్త సినిమా చేసిందని రివ్యూలు పడ్డాయి. ఈమధ్య కాలంలో వచ్చిన వరస్ట్ రీమేక్స్ లో ఒకటిగా ఛత్రపతి నిలుస్తుందంటూ కామెంట్స్ పడుతున్నాయి.

ఈ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు బెల్లంకొండ. బాలీవుడ్ డెబ్యూ కోసం తన టాలీవుడ్ కెరీర్ ను పణంగా పెట్టాడు. అయినప్పటికీ అతడికి సరైన ఫలితం దక్కలేదు. అతడు చేసిన తప్పంతా ఛత్రపతి సినిమాను ఎత్తుకోవడమే అనేది బాలీవుడ్ మాట. బాహుబలితో బాలీవుడ్ లో కూడా ప్రభాస్ క్రేజ్ తెచ్చుకున్న నేపథ్యంలో, అతడు నటించిన ఛత్రపతి హిందీ వెర్షన్ ను చాలామంది చూశారు. దీంతో ఆ సినిమాతో పోలిక పెట్టడం మొదలుపెట్టారు. ఏ దశలోనూ ఒరిజినల్ ను ఈ హిందీ ఛత్రపతి అందుకోలేకపోయింది.