రెండో ప్రపంచ యుద్ధ సంఘటనల ఆధారంగా హాలీవుడ్ లో ఎన్నో క్లాసిక్స్ వచ్చాయి. వాటిల్లో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకూ బాంబుల మోతతో దద్దరిల్లిపోయే సినిమాలు కొన్ని, మరి కొన్ని భావోద్వేగాలను హైలెట్ చేస్తూ, యుద్ధంలో జరిగిన వినాశనాన్ని చూపిన సినిమాలు, రెండో ప్రపంచ యుద్ధ వేళ యూధులు బలైన విధానాన్ని మానవతాధోరణితో చూపిన సినిమాలు, యుద్ధ తంత్రాలను చాటిన సినిమాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. అలాంటి సినిమాలు చాలా వరకూ క్లాసిక్స్ గా నిలిచాయి.
బాంబుల మోతతో దద్ధరిల్లిన డన్ కిర్క్, సేవింగ్ ప్రైవేట్ ర్యాన్ వంటి సినిమాలు ఆల్ టైమ్ క్లాసిక్స్ జాబితాలో ఉంటాయి. అలాగే యూధులపై జరిగిన అరాచకాలను హైలెట్ చేసిన షిండ్లర్స్ లిస్ట్, ది పియానిస్ట్ వంటి సినిమాలూ గొప్ప సినిమాలుగా శాశ్వత ప్రశంసలను పొందాయి. యుద్ధ తంత్రాల గురించి వచ్చిన డార్కెస్ట్ అవర్, హిట్లర్ పతనం గురించి వచ్చిన డౌన్ ఫాల్, పూర్తి కల్పిత కథగా వచ్చిన ది ఇంగ్లోరియస్ బాస్టర్డ్స్ వంటి సినిమాలన్నీ క్లాసిక్స్ గా నిలిచాయి. ఎంతో భిన్నమైన కథా రచనలతో వచ్చిన ఆ క్లాసిక్స్ అన్నీ ఒక ఎత్తు. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో అద్భుతాలు చేసి పెద్దగా గుర్తింపుకు నోచుకోక, ఆఖరికి ఆత్మహత్య చేసుకుని మరణించిన ఒక మేధావి కథ మరో ఎత్తు. ఆ మేధావి పేరే అలన్ ట్యూరింగ్, ఆయన గురించిన కథే 'ది ఇమిటేషన్ గేమ్' సినిమా.
'మిషన్లు ఆలోచించగలవా?' ఈ ప్రశ్నకు ఇప్పుడు సమాధానం సులువుగా చెబుతాం. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నామనే విషయాన్ని గుర్తు చేస్తాం. ఫేస్ బుక్, యూట్యూబ్ లలో కూడా మనం ఎలాంటి వీడియాలను అయితే చూస్తుంటామో, అలాంటి వీడియోలే మన దగ్గరకు వస్తాయి. ఆ స్థాయిలో మెషిన్స్ డెవలప్ అయ్యాయిప్పుడు. మనకు రుచికి తగ్గట్టుగా అవే వడపోసి కంటెంట్ ను తెచ్చిపెడుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఉదయం లేస్తే ఇప్పుడు సామాన్యుడి జీవితం కూడా ఎంతగానో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోనే ముడిపడి ఉంది. మరి ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్స్ మేధతో మనిషికి సాయంగా నిలవడం గురించి తొలి తొలిగా ఆలోచించిన వ్యక్తుల్లో ఒకరు అలన్ ట్యూరింగ్.
ఈ మేధావి తన మేధాశక్తి ఏ స్థాయిది అంటే.. రెండో ప్రపంచ యుద్ధ వ్యవధే తగ్గింది. తగ్గిన ఆ యుద్ధ వ్యవధితో కొన్ని లక్షల ప్రాణాలను కాపాడారు. యుద్ధం ఒక్కో రోజు కొనసాగిన కొన్ని వేల మంది ప్రాణాలను తీస్తూ పోయింది. ప్రపంచాన్ని అనేక నెలలకు వెనక్కు నెట్టేంత వినాశనాన్ని సాగించింది. అలాంటి యుద్ధాన్ని రెండు నెలలు ముందుగానే ముగించగలిగిన ఘనత ఏ అమెరికన్ ప్రెసిడెంట్ తో, నాటి రష్యన్ నియంతదో, చర్చిల్ దో కాదు.. అలన్ ట్యూరింగ్ అని అని అంటారు.
అయితే అలాంటి అలన్ ట్యూరింగ్ విషయంలో ఆయన స్వదేశమే ఎంతో అమానవీయంగా ప్రవర్తించింది. చివరకు ఆయన ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ఎందుకంటే.. ఆయన లైంగికాస్తులు భిన్నమైనవి కావడం వల్ల! ఆయన గే కావడం వల్ల ఆయన ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. తన మేధస్సుతో ప్రపంచ యుద్ధ సమయాన్ని తగ్గించిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న 39 సంవత్సరాల తర్వాత బ్రిటీష్ రాణి ఆయనకు అపాలజీ చెప్పింది. ఆయనతో తమ ప్రభుత్వం వ్యహరించిన తీరుకు క్షమాపణలు ప్రకటించింది బ్రిటీష్ రాణి. అయితే అప్పటికే ట్యూరింగ్ ఆత్మహత్య చేసుకుని 39 సంవత్సరాలు గడిచాయి.
ప్రపంచయుద్దం ముగిసిన కొన్నేళ్ల తర్వాత.. 1951తో ప్రారంభం అవుతుంది. ట్యూరింగ్ ఇన్ డీసెంట్ గా ప్రవర్తిస్తున్నాడని వార్తలు వస్తాయి. ఆయన లైంగిక ఆసక్తులు మగవాళ్లపై ఉన్నాయంటూ పత్రికల్లో పరోక్షకథనాలు వస్తాయి. ఆయన ఇంటి దగ్గర చోటు చేసుకున్న పరిణామాల గురించి పోలీసుల విచారణ సాగుతుండగా.. గతంలోకి వెళ్తుంది కథ. బోర్డింగ్ స్కూల్లో ఉన్నప్పుడే తన సాటి విద్యార్థి అయిన ఒక అబ్బాయితో స్నేహంగా ఉంటూ, అతడితోనే రొమాంటిక్ ఫీలింగ్స్ పెంచుకుంటాడు ట్యూరింగ్. ట్యూరింగ్ స్నేహితుడి పేరు క్రిస్టోఫర్. ఒకసారి సెలవులు అయిపోయాకా అతడు తిరిగి స్కూల్ కు రాడు. అదేమంటే అతడు చనిపోయాడని తెలుస్తుంది ట్యూరింగ్ కు.
అదే విధమైన లైంగికాసక్తులతో పెరిగి పెద్దాడు అయిన ట్యూరింగ్ గొప్ప మెథామెటీషియన్ గా ఎదుగుతాడు. 1939లో బ్రిటన్ రెండో ప్రపంచ యుద్ధరంగంలోకి ప్రవేశిస్తుంది. కేవలం సైనిక శక్తితో జర్మనీని ఎదుర్కొనడమే కాకుండా.. జర్మన్ సాంకేతిక రహస్యాలను, అది మెసేజ్ లను పాస్ చేసుకునే తీరును కూడా బ్రేక్ చేస్తే తమ పని సులువు అవుతుందని బ్రిటన్ భావిస్తుంది. అందుకోసం బ్రిటన్ ఎనిగ్మా మిషన్ జనరేట్ చేసే కోడ్ ను బ్రేక్ చేసి, యుద్ధతంత్రంలో జర్మనీ ఎప్పుడు ఏం చేయబోతోందో కనుక్కొనే ప్రయత్నాన్ని మొదలుపెడుతుంది. అలా ప్రారంభం అయిన ఆ ప్రక్రియలో ట్యూరింగ్ కూడా భాగం అవుతాడు. అయితే అక్కడి వారు ఇతడిని మొదట్లో పట్టించుకోరు. ఆ తర్వాత నాటి బ్రిటన్ ప్రధాని చర్చిల్ కు సమాచారం ఇచ్చేంత స్థాయికి ఎదిగి ఆ ప్రక్రియలో తనే ప్రధాన పాత్రధారిగా ఎదుగుతాడు ట్యూరింగ్.
జర్మన్ ఎనిగ్మా కోడ్ ను డీకోడ్ చేయడం కోసం ఒక మిషన్ ను రూపొందించే ప్రయత్నం మొదలుపెడతాడు. అయితే అది అంత తేలికగా కాదు. ఎంతో కష్టపడతాడు. జర్మన్లు ఎప్పటికప్పుడు కొత్తగా కోడ్ ను జనరేట్ చేస్తూ ఉంటారు. దాన్నంతా సంగ్రహించుకుని డీకోడ్ చేసే మిషన్ కోసం రేయింబవళ్లూ కష్టపడతాడు. ఈ ప్రయత్నంలో అతడి కార్యదక్షత చూసి మొదట్లో అతడిని ద్వేషించిన సాటి పరిశోధకులు కూడా సహకరిస్తారు. ఒక లేడీ క్రిప్టోగ్రాఫర్ కూడా వారితో భాగస్వామి అవుతుంది. ఆమె ట్యూరింగ్ ను ప్రేమిస్తుంది.
సంవత్సరాల శ్రమ అనంతరం చివరకు తన మిషన్ ను విజయవంతంగా ఆవిష్కరిస్తాడు ట్యూరింగ్. ఒక దశలో ఆ మిషన్ వ్యర్థం అని, నిధులను కూడా నిలిపివేయాలని బ్రిటన్ ప్రభుత్వం భావిస్తుంది. అయితే వారిని అనేక రకాలుగా కన్వీన్స్ చేసి.. ఎట్టకేలకూ కోడ్ ను విశ్లేషించి, డీకోడ్ చేయగల మిషన్ ను ఆవిష్కరిస్తాడు ట్యూరింగ్. దాని పేరు ట్యూరింగ్ మిషన్ అనిఅంతా అన్నా, తను మాత్రం దానికి 'క్రిస్టోఫర్' గా పేరు పెడతాడు ట్యూరింగ్. అది ఈ మేధావి బాల్య స్నేహితుడి పేరు!
ఈ క్రమంలో ట్యూరింగ్ గే అనే అంశం అతడితో పనిచేసే ఒక పరిశోధకుడికి తెలుస్తుంది. అతడు ఒక రష్యన్ స్పై అని ట్యూరింగ్ కు అర్థం అవుతుంది. కానీ దాన్ని బయటపెట్టలేడు. ఆ విషయాన్ని బయటపెడితే ట్యూరింగ్ గే అనే అంశాన్ని బయటపెడతానంటూ అతడు బ్లాక్ మెయిల్ చేస్తాడు.
తనను ప్రేమిస్తున్న అమ్మాయిని కూడా కేవలం ఆమె ట్రాన్స్క్రిప్టింగ్ స్కిల్స్ ను వాడుకోవడానికే తను ప్రేమిస్తున్నట్టుగా నటించినట్టుగా ట్యూరింగ్ అంటాడు. క్రిస్టోఫర్ విజయవంతంగా పని చేస్తుంది. అయితే దాని ద్వారా సమాచారాన్ని బ్రిటన్ అర్థం చేసుకుంటున్న విషయం తెలిస్తే, జర్మనీ వ్యూహాలను మార్చేస్తుందని.. కాబట్టి. .దాన్ని నెమ్మదినెమ్మదిగా వాడాలని నిర్ణయిస్తారు. యుద్ధం ముగుస్తుంది. ట్యూరింగ్ ఇన్ డేసెంట్ గా ప్రవర్తిస్తున్నాడనే ఆరోపణలు వస్తాయి. 1950లో అతడిపై విచారణ జరుగుతుంది.
ట్రీట్ మెంట్ ను తీసుకోవాలని పోలీసులు సూచిస్తారు. ఏడాది కాలం పాటు అతడికి హార్మోనల్ బ్యాలెన్స్ కు అంటూ ట్రీట్ మెంట్ అందిస్తారు. అతడి ప్రియురాలు వేరే పెళ్లి చేసుకుంటుంది. తనను తాను మార్చుకోలేక, ప్రపంచం కోరినట్టుగా మారలేక 1954 జూన్ ఏడున ట్యూరింగ్ ఆత్మహత్య చేసుకుని చనిపోతాడు. ఇలా రెండో ప్రపంచ యుద్ధం వ్యవధినే తగ్గించి, కొన్ని మిలియన్ల కొద్దీ ప్రజల జీవితాలను రక్షించిన ట్యూరింగ్ జీవితం విషాదంతం అయ్యిందని వివరిస్తూ సినిమా ముగుస్తుంది.
ఆరేళ్ల కిందట వచ్చిన ఈ సినిమాలో, షెర్లాక్ హోమ్ పాత్రలో అప్పటికే జీవించిన బెనెడిక్ట్ కుంబర్బ్యాట్చ్ శాస్త్రవేత్త ట్యూరింగ్ పాత్రకు ప్రాణం పోశాడు. ఆస్కార్స్ లో ఎనిమిది అవార్డులకు నామినేట్ అయ్యి, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో ఈ సినిమా అవార్డును పొందింది. అత్యంత భారీ వసూళ్లు సాధించిన ఇండిపెండెంట్ మూవీగా నిలిచింది.
-జీవన్ రెడ్డి.బి