ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు అనుకున్నదొకటైతే, మరొకటి అవుతోంది. ఏపీలో బీజేపీ గురించి మాట్లాడుకోవాలంటే సోము వీర్రాజుకు ముందు, తర్వాత అని తప్పక చెప్పుకోవాలి. కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడిగా ఉన్నంత కాలంలో టీడీపీ ఎజెండానే నడిచిందనే అభిప్రాయం బీజేపీ శ్రేణుల్లోనే బలంగా ఉంది. చివరికి బీజేపీ పాలసీకి విరు ద్ధంగా, టీడీపీ విధానానికి అనుకూలంగా కన్నా లక్ష్మినారాయణ రాజధాని విషయంలో గవర్నర్‌కు లేఖ రాయడం ఆ పార్టీలో తీవ్ర దుమారం రేపింది.
మూడు రాజధానుల బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లులకు సంబంధించి సంతకం చేయవద్దని గవర్నర్‌కు కన్నా లక్ష్మినారాయణ లేఖ రాయడం మిగిలిన పార్టీలను పక్కన పెడితే బీజేపే షాక్‌కు గురైంది. దీంతో బీజేపీ అధిష్టానం సీరియస్‌గా కన్నా లక్ష్మినారా యణకు హిత బోధ చేయాల్సి రావడం గమనార్హం. ఇక ఉపేక్షిస్తే టీడీపీ చేతిలోకి బీజేపీ పోయేలా ఉందని గ్రహించిన ఆ పార్టీ పెద్దలు…అదును చూసి కన్నాను ఇంటికి సాగనంపి సోము వీర్రాజుకు అధ్యక్ష బాధ్యతలు అప్పజెప్పారు.
ఈ నేపథ్యంలో సోము వీర్రాజు తన మార్క్ ఏంటో చూపాలనే పట్టుదలతో ఉన్నారు. పార్టీని బలోపేతం చేయాలనే పట్టుదల, కసి ఆయనలో కనిపించాయి. ముఖ్యంగా ఏపీలో ప్రతిపక్ష స్థానం ఖాళీగా ఉందని పదేపదే బీజేపీ నేతలు ప్రకటించడం ద్వారా…తమ టార్గెట్ ఏ పార్టీనో చెప్పకనే చెప్పినట్టైంది. టీడీపీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఆయన పలు ఇంటర్వ్యూల్లో చెబుతూ వస్తుండడం చూస్తున్నాం.
అయితే ఆయన చెబుతున్న దానికి, జరుగుతున్న దానికి పొంతన కుదరడం లేదు. బీజేపీలోకి వలసల కథ పక్కన పెడితే ఉన్న వాళ్లను బయటికి పంపే కార్యక్రమం చురుగ్గా సాగుతోంది. కారణాలేవైనా రెండుమూడు రోజులకో సారి ఫలానా బీజేపీ నేతను సోము వీర్రాజు సస్పెండ్ చేశారనో, బహిష్కరించారనే, షోకాజ్ నోటీస్ ఇచ్చారనో….తదితర వార్తలను చూడాల్సి వస్తోంది. కానీ పార్టీలో కలుపు మొక్కలను బయటికి పంపడం కూడా బీజేపీ బలోపేతంలో భాగమే అని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.
తాజాగా అక్రమ మద్యం రవాణా కేసులో పట్టుబడిన మచిలీపట్నం బీజేపీ నేత అంజిబాబును ఏకంగా పార్టీ నుంచి సోము వీర్రాజు బహిష్కరించారు. అంతేకాదు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని ఆయన కోరడం గమనార్హం. మిగిలిన కుటుంబ పార్టీల్లో మాదిరిగా అక్రమాలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రశ్నే లేదనే సంకేతాన్ని సోము వీర్రాజు పంపారని బీజేపీ నేతలు చెబుతున్నారు.
రాజధాని అమరావతి విషయంలో పార్టీ వైఖరిని తప్పు పడుతూ ఓ పత్రికలో వ్యాసం రాసిన తిరుపతి బీజేపీ నేత ఓవీ రమణ, అలాగే రాజధాని రైతులకు మద్దతుగా దీక్షలో కూచుని పార్టీ వైఖరిని నిరసిస్తూ తన చెప్పుతో తాను కొట్టుకున్న అధికార ప్రతినిధి గోపాలకృష్ణపై కూడా క్రమశిక్షణా చర్యల కింద సోము వీర్రాజు సస్పెన్షన్ వేటు వేసిన విషయం తెలిసిందే. అలాగే పార్టీ వైఖ రికి భిన్నంగా రాజధాని అంశంపై మాట్లాడిన రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి ప్రకటనను ట్విటర్ వేదికగా పార్టీ ఖండించడం ద్వారా…ఆయన నోరు మూయించిన విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
అయితే సోము వీర్రాజు పంథాపై బీజేపీ నేతల అనుకూల వైఖరి ఎలా ఉన్నా…ఇక పార్టీలో చేరికలెప్పుడు అనే ప్రశ్న పదేపదే ఉత్పన్నమవుతోంది. కరోనా కారణంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుంచి కదల్లేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇక ఆయన కుమారుడు లోకేశ్ గురించి చెప్పుకోవాల్సిన పనే లేదు. ఏ రకంగా చూసినా ఏపీలో టీడీపీ బతికి బట్ట కట్టే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించడం లేదు. సోము వీర్రాజు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాపు సామాజిక వర్గంలో మాత్రం ఒక పాజిటివ్ మూవ్‌మెంట్ కనిపిస్తోంది.
పవన్‌కల్యాణ్, చిరంజీవి, సోము వీర్రాజు, ముద్రగడ పద్మనాభం, సీబీఐ మాజీ అధికారి జేడీ లక్ష్మినారాయణ తదితరుల కలయికకు బీజేపీ వేదిక కానుందనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదే జరిగితే బీజేపీకి ఓ బలమైన సామాజిక వర్గం అండ దొరికినట్టవుతుంది. సోము వీర్రాజు అనుకున్నట్టు టీడీపీని పూర్తిగా, వైసీపీలో కొన్ని వర్గాలను తన పార్టీ వైపు తిప్పుకునేందుకు సీరియస్‌గా ప్రయత్నిస్తే మాత్రం 2024కు కాకపోయినా, 2029 నాటికైనా బలమైన ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశాలు లేకపోలేదు.