తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు.. 14 సంవత్సరాల పాటు సీఎం, 10 యేళ్ల పాటు ప్రతిపక్ష నేత.. పాతిక సంవత్సరాల వ్యవహారాల్లో చంద్రబాబు నాయుడు తన రాజకీయ చదరంగం కోసం ఎంతోమందిని పావులుగా వాడుకున్నారు. అవసరం మేరకు వాళ్లను వాడుకోవడం, ఆ తర్వాత వాళ్లనే శంకరగిరి మాన్యాలు పట్టించడంలో చంద్రబాబు నాయుడుకు మించిన వారు కనిపించరు!
నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేయడంలో కొందరు పేరు తెచ్చుకుంటే, వ్యక్తులను ఉపయోగించుకుని ఆ తర్వాత వాళ్ల అడ్రస్ గల్లంతు చేయడంలో పేరు పొందారు తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు. దీన్నొక కపట రాజకీయమని చెప్పొచ్చు.
అయితే ఎంతమందిని వాడుకున్నా..మళ్లీ వాడుకోవడానికే అన్నట్టుగా చంద్రబాబు నాయుడుకు ఎవరో కొందరు దొరుకుతూనే ఉండటం ఆయన రాజకీయానికి ఇంధనంగా మారింది! వాళ్లు ఏ లెక్కలతో చంద్రబాబు నాయుడుకు దగ్గరవుతారో కానీ, ఆయన లెక్కలు కుదిరికా.. వాళ్లకు చుక్కలే కనిపిస్తాయి! దీనికి అనేక ఉదాహరణలు!
తారక రాముడితో మొదలు!
బహుశా చంద్రబాబు నాయుడు వాడేసిన మొట్టమొదటి పెద్ద వ్యక్తి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు! అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ చంద్రబాబు చేత వాడుకోబడిన వ్యక్తి ఎన్టీఆరే! చంద్రబాబు చేత అత్యంత బాధించబడిన వ్యక్తి, తన ఆవేదనను బాహాటంగా వెల్లగక్కి, సొంత అల్లుడు అని కూడా చూడకుండా చంద్రబాబు నాయుడు ఒక వెన్నుపోటు దారుడు అని, అతడో ఆషాఢభూతి అని, అతడో ఔరంగజేబు అని తన గుండెకోతను వివరించి, చంద్రబాబు నాయుడి అసలు రూపాన్ని కూలంకషంగా వివరించింది కూడా ఎన్టీఆరే!
మధ్యయుగంలో తండ్రులను కారాగారానికి పంపి, అన్నదమ్ములను హత్య చేసి సామ్రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న ఔరంగజేబుతో చంద్రబాబును పోల్చారు ఎన్టీఆర్. అదే ఎన్టీఆర్ విషయంలో చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా మాట్లాడారో తెలుగు వారికి తెలియనిది ఏమీ కాదు. తెలుగుదేశం ఆవిర్భావ సమయంలో అధిష్టానం ఆదేశిస్తే తన మామపై పోటీకి సై అంటూ ప్రకటించి, తీరా టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే గోడ దూకడం ద్వారా ఎన్టీఆర్ ను వాడుకోవడం మొదలుపెట్టారు.
ఆ తర్వాత ఎన్టీఆర్ పై ఆషాఢభూతి భక్తిని చూపిస్తూ.. ఆయనకే వెన్నుపోటు పొడిచారు. ఎన్టీఆర్ కు నైతిక విలువలు శూన్యమని తన ఇంటర్వ్యూల్లో ప్రకటించుకున్నారు. ఎన్టీఆర్ మరణించాకా మాత్రం కథ మారింది! 2004లో అధికారం కోల్పోయాకా.. మళ్లీ ఎన్టీఆరే శరణమయ్యారు. ఎన్టీఆర్ పేరును స్మరిస్తూ మరో ఆటకు తెరతీశారు! అప్పటి నుంచి ఎన్టీఆర్ తో ఆటలు కొనసాగుతూనే ఉన్నాయి. నిర్భయంగా ఎన్టీఆర్ పేరును చంద్రబాబు నాయుడు తన అవసరానికి తగ్గట్టుగా వాడుకుంటూ ఉంటారు. తనను ఔరంగజేబు అంటూ ఎన్టీఆర్ తిట్టినా, చంద్రబాబు నాయుడు అవసరం మేరకు ఎన్టీఆర్ ను వాడుకుంటూనే ఉన్నారు.
ఎన్టీఆర్ తర్వాత నందమూరి కుటుంబం!
ఎన్టీఆర్ నే గాక ఆయన వారసులందరినీ కూడా బాగా వాడుకోవడం చంద్రబాబుకు కరతలామలకం అయ్యింది. ఈ చోద్యాన్ని తెలుగు ప్రజలు చూస్తూనే ఉన్నారు. ఆఖరికి నందమూరి కుటుంబం చంద్రబాబుకు అలా ఉపయోగపడుతుండటంపై ఉభయ రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు అయినా జాలి ఉందేమో కానీ..వారిని వాడుకోవడానికి చంద్రబాబుకు మాత్రం మొహమాటం లేదనేది తెలుగునాట సహజంగా వినిపించే మాట.
హరికృష్ణ, బాలకృష్ణ.. ఇతర ఎన్టీఆర్ పుత్రులు, పుత్రికలు.. వీరందరినీ ఎన్టీఆర్ ను దించేసేటప్పుడే చంద్రబాబునాయుడు ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత వాళ్లందరికీ జెల్లకొట్టి అధికారం హస్తగతం చేసుకోవడంతో వారే ఖిన్నులయ్యారు. ఎన్టీఆర్ కూతురు పురందేశ్వరి, అల్లుడు దగ్గుబాటి ఆ వేదనతోనే టీడీపీకి పూర్తి దూరం అయ్యారు. తమ రాజకీయ భవితవ్యాన్ని కాంగ్రెస్ లో వెదుక్కొన్నారు. చంద్రబాబు నాయుడు తమను వాడుకున్న తీరు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పలుసార్లు వివరించారు కూడా!
హరికృష్ణకు ఆరు నెలల మంత్రి పదవి, పార్టీ చిత్తయ్యాకా.. తన ముఖ్యమంత్రి పదవిపోయాకా మళ్లీ రాజ్యసభ సభ్యత్వంతో బుజ్జగించడం.. ఆ తర్వాత తనే ఆయనను తప్పించడం.. ఇవన్నీ చంద్రబాబు మార్కు వాడకం తాలూకు చేదు జ్ఞాపకాలు నందమూరి కుటుంబానికి.
నందమూరి వంశంలో మూడో తరం కూడా చంద్రబాబు నాయుడు వాడకం నుంచి తప్పించుకోలేకపోయింది. 2009 ఎన్నికల సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ను వాడేశారు. తను అధికారంలోకి రావడానికి తారక్ ను ప్రచారానికి ఉపయోగించుకున్నారు. అప్పటికే తాతకు, తండ్రులకు ఎదురయిన అనుభవాలను విస్మరించి ఎన్టీఆర్ చంద్రబాబు కోసం వీధికెక్కి ప్రచారం చేశారు. ఆ తర్వాత మాత్రం తారక్ కు చంద్రబాబు మార్కు ట్రీట్ మెంట్ అర్థం అయ్యింది. చేసేది లేక గమ్మునుండిపోయాడు. అయినా చంద్రబాబు తగ్గలేదు. తనకు ఎలా ఉపయోగపడరో చూడటానికి అన్నట్టుగా.. ఎన్టీఆర్ సోదరినే ఎన్నికల ప్రచారంలోకి దించాడు! అయితే ఈ సారి మాత్రం ఎన్టీఆర్ చలించలేదు. చంద్రబాబు మార్కు వాడకాన్ని అతడు మరిచిపోలేదు.
తెలంగాణలో చంద్రబాబు రాజకీయం కోసం ఉపయోగపడిన చుండు సుహాసినికి ఆ తర్వాత పార్టీలో అయినా ఏదైనా పదవులు ఇచ్చారా? ఇక నందమూరి ఫ్యామిలీలో బాలకృష్ణను వియ్యంకుడిగా చేసుకుని చంతద్రబాబు నాయుడు పూర్తిగా తన ఓన్ చేసేసుకున్నారు. ఇప్పుడు చంద్రబాబుకు, లోకేష్ కు చేదోడుగా ఉండటం తప్ప మరో పరిస్థితుల్లో లేరు బాలకృష్ణ.
ఇంట్లో వాళ్లైనా, బయటోళ్లైనా ఒక్కటే ట్రీట్ మెంట్!
ఎంత రాజకీయ నాయకుడు అయిన తనామనా అన్నట్టుగా ఉంటారు. సొంతవాళ్లను జాగ్రత్తగా చూసుకుంటారు. అయితే పిల్లనిచ్చిన మామను, తెలుగు ప్రజలు ఎన్నుకున్న సీఎంను శంకరగిరి మాన్యాలు పట్టించిన చంద్రబాబుకు బయటి వాళ్లు ఎంత? ఆ మధ్య నటి జయప్రద, ఆమె రాజకీయ సన్నిహితుడు అమర్ సింగ్ ఆడియోటేప్ ఒకటి జాతీయ స్థాయిలో వైరల్ అయ్యింది. ఆ సంభాషణలో జయప్రద మీద సానుభూతి వ్యక్తం చేశారు అమర్ సింగ్. ఇటీవలే మరణించారాయన. ఆ ఆడియో టేపులో ఆయన చంద్రబాబు ప్రస్తావన తీసుకొచ్చారు.
జయప్రదను చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం ఉపయోగించుకుని ఆ తర్వాత వదిలేశాడని అందులో ఆయన వ్యాఖ్యానించారు. అదీ చంద్రబాబు నాయుడి మార్కు వాడకం! జాతీయ స్థాయిలో మార్మోగుతుంది. ఆ తర్వాత జయప్రద కూడా చాలా సార్లు వాపోయింది. చంద్రబాబు మనుషులను ఉపయోగించుకుని, వదిలించుకుంటారని ఆమె బాహాటంగా వ్యాఖ్యానించారు.
ఆ జాబితా పెద్దదే!
చంద్రబాబు నాయుడుతో అతి సన్నిహితంగా మెలిగి, ఆయన భజన చేసి, ఆయన తిట్టమన్న వాళ్లను తిట్టి, ఆయన కరవమన్న వాళ్లను కరిచిన నేతలు ఎంతోమంది ఉన్నారు. అయితే ఆ తర్వాత వాళ్లకు చంద్రబాబు నాయుడు ఏ కిరీటాలు పెట్టారు? వాళ్ల రాజకీయ భవితవ్యం ఏమిటి? అంటే.. అదంతా పెద్ద కామెడీ వ్యవహారంగా కనిపిస్తుంది.
ఇంత వరకూ చంద్రబాబు నాయుడును నమ్ముకుని ఆయన అరవమన్న చోటల్లా అరిచిన రాజకీయ నేత ఎవరూ బాగుపడిన దాఖలాలు కనిపంచవు! దాన్ని శాపం అనాలా.. లేక చంద్రబాబు నాయుడు టచ్ చేస్తే వాళ్ల పరిస్థితి అంతేనా, అవసరం ఉన్నంత సేపే వ్యక్తులను పట్టించుకోవడం ఆ తర్వాత వాళ్లను వదిలించుకోవడంలో చంద్రబాబుది అందె వేసిన చేయి కావడం వల్ల ఇదంతా అనాలో కానీ.. ఈ లిస్టు మాత్రం పెద్దదే!
నాగం జనార్దన్ రెడ్డి..
బియ్యం రెడ్డి అంటూ ప్రతిపక్షాల వాళ్లు ఈయనను ఏడిపించేవి. తెలుగుదేశం పార్టీలో ఒకనొక దశలో చంద్రబాబు తర్వాత తనే అనుకున్నంత పని చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాకా.. అత్యంత దూకుడుతో పని చేసిన నేత నాగం. వైఎస్ పై చెలరేగిపోయారు. తనకు సంబంధం లేని రాయలసీమ రాజకీయంలోకి వచ్చి రచ్చ చేశారు. ఎక్కడికో బళ్లారి వెళ్లారు.
తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ అని బయట వాళ్లన్నారు, చంద్రబాబు తర్వాత తనే అని ఆయన అనుకున్నారు. అలా నాగం అరిచి గీ పెట్టినా టీడీపీ పవర్ లోకి రాలేదు. రెడ్డిని రెడ్డి చేతే తిట్టించాలనే లెక్కతో వైఎస్ పై నాగాన్ని ఉసిగొల్పినా ప్రయోజనం దక్కలేదు. దీంతో ఆయనను లైమ్ లైట్ నుంచి తప్పించారు. ఆ తర్వాత నాగం కెరీర్ అనేక టర్న్ లు తీసుకుని తిరిగి వైఎస్ నే పొగిడేంత వరకూ వచ్చింది.
రేవంత్ రెడ్డి..
నాగం తర్వాత చంద్రబాబు వాడకానికి బాగా ఉపయోగపడిన రెడ్డి. నాగం ఔట్ డేటెడ్ అని భావించి, రెడ్డి వర్సెస్ రెడ్డి పోరాటానికి రేవంత్ ను వాడారు చంద్రబాబు. తీరా రేవంత్ రాజకీయం చంచల్ గూడ జైలుకు చేరింది.
ఇప్పుడు కాంగ్రెస్ లో ఆయన ఏదైనా పదవికి కోసం పోటీపడాలన్నా.. చంద్రబాబు తరపున బ్యాగులు మోసిన నేతగా ఆయన గురించి చర్చ మొదలైంది. ఒకరకంగా చూస్తే.. రేవంత్ రెడ్డి రాజకీయానికి చంద్రబాబు నాయుడు ఆ ఒక్క బ్యాగుతోనే శుభం కార్డు వేశారు!
మోత్కుపల్లి నర్సింహులు
చంద్రబాబును నమ్మి, చంద్రబాబు నాయుడు ఉద్ధరిస్తారని.. తన సర్వశక్తులూ ఒడ్డిన ఒక దళిత నేత మోత్కుపల్లి. చంద్రబాబు ఆడిన ఆటలో ఆయన ఏడ్చేశారు. తనను నమ్మించి మోసం చేశారని వాపోయారు. ఆఖరికి మోత్కుపల్లిని గవర్నర్ ను చేస్తారంటూ, అదిగో..ఇదిగో.. అంటూ ఆయననొక విదూషకుడిని చేశారు. చివరకు చంద్రబాబు నాయుడు చేత ఎదురైన ఛీత్కారాలతో మోత్కుపల్లి పచ్చకండువా విసిరిగొట్టి బయటకు వచ్చారు!
కాంగ్రెస్ పార్టీ, నేతలు!
చంద్రబాబు నాయుడు మార్కు వాడకాన్ని కాంగ్రెస్ పార్టీ కూడా తప్పించుకోలేకపోయింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్ తో చేతులు కలిపి చంద్రబాబు కొత్త వేషం వేశారు. ఆ వేషం దెబ్బకు తెలంగాణలో చేతులు కాల్చుకుంది కాంగ్రెస్ పార్టీ. తన అవసరం కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తో చేతుల కలపడానికి వస్తే..కాంగ్రెస్ మురిసిపోయింది. తమ హవా అలా ఉందని కాంగ్రెస్ భావించింది. అయితే చంద్రబాబు దెబ్బకు తాము తెలంగాణలో మరింత కుంచించుకుపోతామని కాంగ్రెస్ వాళ్లు ఊహించలేదు. తీరా ఇప్పుడు కాంగ్రెస్ ను చంద్రబాబు నాయుడు కేర్ చేసే పరిస్థితి లేదు!
పవన్ కల్యాణ్..!
చంద్రబాబు నాయుడుకు ఏకంగా రెండు టర్మ్ లలో ఉపయోగపడిన వ్యక్తి, ఇప్పటికీ చంద్రబాబు నాయుడు అజెండాను మోస్తున్న వ్యక్తి పవన్ కల్యాణ్. ఇందుకుగానూ పవన్ కల్యాణ్ ఇప్పటికే తగిన ప్రతిఫలం పొందారు. చంద్రబాబు నాయుడుకు 2014 ఎన్నికల్లో ఉపయోగపడి తనేదో ఘనకార్యం చేసినట్టుగా పవన్ ఫీలయ్యారు. దాన్ని చూసుకుని రావాల్సిన సమయంలో వస్తా అంటూ తన సినిమాల్లో డైలాగులు పెట్టుకుని గర్వం తలకెక్కించుకున్నారు.
ఆ తర్వాత ఐదేళ్ల పాటు చంద్రబాబు ఆటలో పావుగా పవన్ కల్యాణ్ పాత్ర కొనసాగింది. చంద్రబాబుకు అవసరం అయినప్పుడు మీడియా ముందుకు రావడం, జగన్ దూసుకుపోతున్నాడు అనిపించినప్పుడల్లా పవన్ వచ్చి గలాభా చేయడం.. అదో ఐదేళ్ల సీరియల్. అలా ఐదేళ్ల పాటు చంద్రబాబుకు అపరిమితంగా ఉపయోగపడి, చంద్రబాబు చేత అలా వాడబడిన పవన్ కల్యాణ్ ఆ తర్వాత వచ్చిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నెగ్గలేకపోయారు! అదీ చంద్రబాబు నాయుడి వాడకం ఫలితం.
ఒకవేళ అదే ఐదేళ్లూ పవన్ కల్యాణ్ నిఖార్సైన ప్రతిపక్షంగా వ్యవహరించి ఉంటే.. మరీ అలా తనే గెలవలేకపోవాడం, తన పార్టీ సింగిల్ సీటుతో నిలబడలేకపోవడం అనే దురావస్థ కచ్చితంగా ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు చేత వాడబడేవాళ్లెవ్వరైనా ఆ తర్వాత రాజకీయంగా కోలుకోలేని ఎదురుదెబ్బలు తినాల్సిందే అనే పరిస్థితికి అనుగుణంగా పవన్ కల్యాణ్ గత ఎన్నికల్లో చిత్తయ్యారు. అయితే ఇప్పటికీ పవన్ రూటు మారినట్టుగా లేదు.
ఇప్పటికీ చంద్రబాబు అజెండానే పవన్ కల్యాణ్ అజెండాగా కొనసాగుతుందనే అభిప్రాయాలే ఉన్నాయి. బీజేపీతో చేతులు కలిపినా.. పవన్ పరిస్థితి అదేలాగా ఉంది. అయితే ఇప్పటి వరకూ చంద్రబాబుతో తను కలిసి చేసిన జర్నీ నుంచి పవన్ పాఠాలు నేర్చుకోకపోతే.. దాని ఫలితాలను కూడా పొందేది బహుశా ఆయనేనని చెప్పనక్కర్లేదు!
అతిగా ఆవేశపడిన నేతలు ఇంకెంతో మంది!
చంద్రబాబు నాయుడు తన ప్రయోజనాల కోసం ఆడే రాజకీయ చదరంగంలో కొన్ని మదగజాలుంటాయి, మరి కొన్ని గుర్రాలు, ఇంకొన్ని బంట్లు ఉంటాయి. వీటన్నిటి పని మాత్రం ఒక్కటే.. చంద్రబాబు నాయుడుకు రక్షణ వలయంగా ఉండటం. ప్రత్యర్థుల దాడిలోనో, రాజకీయంలోనో.. వాళ్లు చిత్తయిపోవచ్చు గాక..తను మాత్రం సేఫ్ గా ఉండేందుకు ఒక ఫెన్స్ లా వాళ్లను ఉపయోగించుకుంటారు తెలుగుదేశం అధినేత.
ఒక జేసీ దివాకర్ రెడ్డి, ఇంకో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మరో వర్లరామయ్య వీళ్లందరూ చంద్రబాబు నాయుడు కోసం అతిగా ఆవేశపడిన వాళ్లే! వీళ్ల పరిస్థితి తర్వాత ఏమయ్యింది? సొంత కంచుకోటను కూడా చేజార్చుకుని, అందరి మీదా ఎగిరెగిరిపడటం తప్ప.. కేసులు, జైలు మొహాలను చూడాని జేసీ ప్రభాకర్ రెడ్డి జైల్లో ఊచలు లెక్కబెడుతున్నారు. ఆయన అన్న ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో కిమ్మనకుండా ఉన్నారు. చంద్రబాబు కోసం అతిగా ఆవేశ పడి, ఆఖరికి తమ కులం పేరును కూడా చంద్రబాబు పాదాల చెంత పెట్టాలని చూసిన జేసీల పరిస్థితి అది.
జగన్ మీద జేసీలు అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు ముసిముసి నవ్వులు నవ్విన చంద్రబాబు నాయడు.. ఇప్పుడు జేసీలను ఆదుకునేందుకు రోడెక్కారా? చంద్రబాబు డిక్షనరీలో అలాంటివి ఉంటాయా? పార్టీ కి రాజ్యసభ సీటు దక్కేటప్పుడు వర్ల రామయ్యను పట్టించుకోలేదు. తీరా పార్టీకి దక్కని సీటు కోసం ఆయనను పోటీ చేయించి.. అలా వర్ల రామయ్య రుణం తీర్చుకున్నారు చంద్రబాబు నాయుడు!
ఇతర పార్టీల్లోనూ ఏజెంట్లు!
చంద్రబాబు నాయుడుకు ఉండే నెట్ వర్క్ ఎక్కడెక్కడో ఉంటుంది. దానికి ఇతర పార్టీల నేతలు కూడా మినహాయింపు కాదు. తన ప్రధాన ప్రత్యర్థిని ఢీ కొట్టడానికి ఇతర పార్టీల్లోనూ ఏజెంట్లను పెట్టగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. వైఎస్ హయాంలో అయినా, జగన్ హయాంలో అయినా.. చంద్రబాబు ఏజెంట్లు.. బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, జనసేనలు, ప్రజారాజ్యాలు.. ఇలా అన్ని పార్టీల్లోనూ ఉంటూ వచ్చారు.
అలాంటి వాళ్లు చంద్రబాబుకు ప్రధాన ప్రత్యర్థి అయిన వాళ్లపై దుమ్మెత్తిపోయడానికి అయినా, అవసరం అయిన సమయాల్లో తాము ఉన్న పార్టీల పొట్ట చీల్చుకురావడానికి అయినా వెనుకాడలేదు. అయితే అలాంటి వారు కూడా బావుకుంటున్నది ఏమీ లేదు, వారి బానిసత్వానికి లోలోపల మూటలేం అందుతాయో ఏమో!
ఇప్పుడు కాంగ్రెస్ నేత తులసిరెడ్డి అయినా, కమ్యూనిస్టు పార్టీ నేతలైనా.. చంద్రబాబుకు సేవలు చేస్తూ తమ చిత్తశుద్ధిని చాటుకుంటున్నట్టుగా కనిపిస్తారని సామాన్యులే అనుకుంటారు!
కనిపించని ఏజెంట్లూ..!
చంద్రబాబు నాయుడిది అంతా బ్యాక్ డోర్ పాలిటిక్సే, ఇతర పార్టీల్లోనే కాదు..అనేక వ్యవస్థల్లో కూడా చంద్రబాబు నాయుడు తన వాళ్లను జొప్పించి తన అవసరం మేరకు వాళ్లను ఉపయోగించుకుంటారు అనే పేరు కొత్తది కాదు. పాతికేళ్ల తన రాజకీయంలో చంద్రబాబు నాయుడు అలాంటి ఏజెంట్లను ఎంతో మంది పెట్టుకున్నారనే అభిప్రాయాలున్నాయి. ఆ ఏజెంట్లకు మాత్రం చంద్రబాబు నుంచి విందులు, వినోదాలు అన్నీ అందుతాయనే మాట అప్పుడప్పుడు వినిపిస్తూ ఉంటుంది.
ఎన్నాళ్లీ రాజకీయాలు!
1995 నుంచి చంద్రబాబు నాయుడు అలాంటి రాజకీయాలే కొనసాగిస్తూ ఉన్నారు. ఆయన రాజకీయంగా గెలిచిందల్లా పరాన్నజీవిగానే. ఎన్టీఆర్ చేతి నుంచి అధికారం లాగేసుకుని, ఆయనను బద్నాం చేశారు. 1999లో బీజేపీ పుణ్యాన గెలిచారు, 2004 తర్వాత వాళ్లను తిట్టారు. 2009లో కమ్యూనిస్టులతో కూడారు. ఆ తర్వాత వాళ్లను తిట్టారు.
2014కు మళ్లీ బీజేపీ దేవతలా కలిసొచ్చింది. అప్పుడు మోడీ దేవుడయ్యాడు. ఆ తర్వాత మోడీని తిట్టారు. తను ఎన్నో యేళ్లు తిట్టిన కాంగ్రెస్ తో జతకలిశారు. చిత్తయ్యారు. ఇప్పుడు మళ్లీ మోడీ భజన.. రేపు మోడీ ఓడి ఇంకొకరు వస్తే.. వాళ్ల భజన! ఇదీ చంద్రబాబు నాయుడి పాతికేళ్ల రాజకీయంలోని కుటిల చాప్టర్లు. ఈ వేషాలన్నీ చూసి విసిగి వేసారి చంద్రబాబు నాయుడును, ఆయన పార్టీని 23 సీట్లతో నిలబెట్టారు ప్రజలు. అయినా చంద్రబాబు తీరు మాత్రం మారడం లేదు.
ఇప్పటికే 95నాటి వ్యూహాలతోనే ఆయన కనిపిస్తున్నారు. ఆ తరహా రాజకీయాలను ప్రజలే ఇప్పుడు ఛీత్కరించుకుంటున్నారు, కానీ ఆయన వాటినే నమ్ముకున్నట్టున్నారు కాబట్టి.. చంద్రబాబు నాయుడి రాజకీయ జీవితం కూడా ముగిసినట్టేనేమో!