ఇప్పటికే సగంసగం రాజకీయాల్లోకి వచ్చి రజనీకాంత్, కమల్ హాసన్ తమ వ్యవహారాలు ఎవరికీ అర్థం కానివ్వకుండా వ్యవహరిస్తున్నారు. తను రాజకీయాల్లోకి వచ్చేసినట్టే అని ప్రకటించి, అదేదో ఆధ్యాత్మిక రాజకీయం అంటూ రజనీకాంత్ ఎవరికీ అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. ఒకవైపు సినిమాల మీద సినిమాలు ఒప్పుకుంటూ రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చినట్టో, లేదో అనే క్లారిటీ జనాలకు ఇవ్వడం లేదు.
ఇక కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చి ఒక సారి తన పార్టీని ఎన్నికల బరిలోకి కూడా దింపారు. ఏదో నామమాత్రంగా ఎన్నికల ప్రచారం చేసి.. తక్కువ స్థాయి పర్సెంటేజ్ ఓటు బ్యాంకును కమల్ సాధించారు. అయితే కమల్ ఇప్పుడు సినిమాలతో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన తదుపరి రాజకీయాల కథాకమామిషేమిటో ఎవరికీ తెలియనిదిగా మారింది.
వీళ్లే అనుకుంటే.. ఇప్పుడు మరో తమిళ హీరో రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారట. ఆయన ఎవరో కాదు విజయ్. ఈ హీరో పొలిటికల్ ఎంట్రీ గురించిన ఊహాగానాలు, వార్తలు ఈనాటివి ఏమీ కావు. ఇప్పుడు మరోసారి వినిపిస్తున్నాయంతే. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ పార్టీ పోటీ చేస్తుందని, విజయ్ కూడా పోటీ చేస్తాడనేది తాజా రూమర్. విజయ్ తండ్రి ఢిల్లీ వెళ్లారని, కొత్త పార్టీని రిజిస్టర్ చేయిస్తున్నారని ఆ హీరో ఫ్యాన్స్ లో ప్రచారం జరుగుతూ ఉందట.
అయితే విజయ్ గురించి ఇలాంటి రూమర్లు కొత్త కాదు. కాబట్టి ఇవంత నమ్మశక్యం కాకపోవచ్చు. ఇప్పుడు హీరోగా విజయ్ కెరీర్ ఒక రకంగా పీక్స్ లో ఉంది. ఇలాంటి నేపథ్యంలో అతడు రాజకీయాల్లోకి వచ్చినా రావొచ్చు. కానీ తమిళనాట రాజకీయాల విషయంలో కమల్, రజనీలే రాణించలేకపోతున్నారు, ధైర్యంగా పోటీ చేయలేకపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో విజయ్ ఆ ధైర్యం చేస్తాడా? దక్షిణాదిన సినిమా హీరోల రాజకీయాలను జనాలు సీరియస్ గా తీసుకోని ప్రస్తుత పరిణామాల్లో విజయ్ రంగంలోకి దిగుతాడా? అనే వాటిపై ఆ హీరోనే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.