పోర్న్ వీడియోల వ్యవహారంలో అరెస్టు అయిన శిల్పా షెట్టి భర్త రాజ్ కుంద్రా సంపాదన గురించి ఆసక్తిదాయకమైన వివరాలను వెల్లడించారు ముంబై పోలీసులు. ఇప్పటికే కుంద్రాను అరెస్టు చేసి విచారణ చేపట్టిన పోలీసులు.. ఈ బిజినెస్ ఎప్పుడు మొదలైంది, ఎంత సంపాదించారనే అంశం మీద కూడా కూపీ లాగినట్టుగా తెలుస్తోంది.
ఒక భవనంలో పోర్న్ వీడియోలను చిత్రీకరిస్తున్నారనే సమాచారాన్ని అందుకుని పోలీసులు అక్కడకు వెళ్లారట. అక్కడ దొరికిన వారిని విచారించగా.. వ్యవహారం మలుపులు తిరిగి రాజ్ కుంద్రా వద్దకు వెళ్లినట్టుగా తెలుస్తోంది. మొబైల్ యాప్స్ లోకి పోర్న్ వీడియోలను పంపుతూ వీరు క్యాష్ చేసుకుంటున్నారనేది ప్రాథమికంగా పోలీసులు వెల్లడించిన అంశం.
ఈ బిజినెస్ తో శిల్పా షెట్టి భర్త ఎంత సంపాదించాడనే అంశం గురించి ముంబై పోలీసులు స్పందిస్తూ.. కుంద్రా సంపాదన రోజుకు ఆరు నుంచి ఎనిమిది లక్షలు అంటూ పేర్కొనడం గమనార్హం! ఈ లెక్కన సగటున కుంద్రా నెలకు రెండు కోట్ల రూపాయల మొత్తాన్ని ఈ వీడియోల ద్వారా సంపాదించాడని అంచనా.
ఇంతకీ ఎప్పటి నుంచి రాజ్ కుంద్రా ఈ వ్యాపారం చేస్తున్నాడు? అంటే.. దాదాపు ఏడాదిన్నర నుంచీనట. 18 నెలలుగా కుంద్రా ఈ వ్యాపారంలోకి దిగాడని, కరోనా లాక్ డౌన్ దగ్గర నుంచి వారి వ్యాపారం ఊపందుకుందని పోలీసులు చెబుతున్నారు.
కరోనా సమయంలో చాలా మంది ఇళ్లకు పరిమితం కావడంతో.. పోర్న్ వీక్షణ కూడా చాలా పెరిగిందని గణాంకాలు కూడా చెబుతున్నాయి. ఆ పరిణామాలు ఆ వ్యాపారంలోని వారి ఆదాయాన్ని పెంచి ఉండవచ్చు.