దెయ్యం లేకుండా హారర్ సినిమా తీయొచ్చా? విరూపాక్ష సినిమా చూస్తే తీయొచ్చు అని అర్థమౌతుంది. తంత్రాలకు థ్రిల్ జోడించి తీసిన ఈ సినిమా థియేటర్లలో హిట్టయింది. అయితే ఇంతకీ ఈ ఆలోచన దర్శకుడికి ఎలా వచ్చింది? దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ మేటర్ బయటపెట్టాడు డైరక్టర్ కార్తీక్ దండు.
2016లో ఓ వార్త చదివాడంట ఈ దర్శకుడు. చేతబడి చేస్తుందనే అనుమానంతో గుజరాత్ లో ఓ మహిళను చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి చంపేశారంట. నిజంగా ఆమెకు చేతబడి తెలిస్తే, ఆ గ్రామస్తుల్ని తను చంపేసి ఉండేది కదా అంటూ రివర్స్ లో ఆలోచించడం మొదలుపెట్టాడట. ఆ ఆలోచన నుంచే విరూపాక్ష కథ పుట్టిందంటున్నాడు కార్తీక్.
హారర్ కథలంటే తనకు చాలా ఇష్టమని తెలిపిన ఈ దర్శకుడు.. దెయ్యం ఎలిమెంట్ లేకుండా సినిమా తీయాలనే ఉద్దేశంతో విరూపాక్ష కథ రాసుకున్నట్టు తెలిపాడు. ఈ కథను ముందుగా నమ్మిన వ్యక్తి సుకుమార్ అంట. ఆయన ఆధ్వర్యంలో దాదాపు 6-7 వెర్షన్లు రాశాడట దర్శకుడు.
అలా రాసిన వెర్షన్ల నుంచి ఫైనల్ గా ఓ వెర్షన్ తీసుకొని విరూపాక్ష స్టోరీ లాక్ చేశారట. ఇక ప్రీ-క్లయిమాక్స్, క్లయిమాక్స్ లో వచ్చే ట్విస్టులకు సంబంధించి సుకుమార్ కు క్రెడిట్ ఇస్తున్నాడు కార్తీక్. సుకుమార్ సలహాలు, సూచనల మేరకు క్లయిమాక్స్ మార్చానని తెలిపాడు. ఈ ప్రాజెక్టులోకి సాయితేజ్ రావడానికి మెయిన్ రీజన్ కూడా సుకుమార్ అంటున్నాడు కార్తీక్ దండు.