పీఎస్- 2కు భారీ ఓపెనింగ్సే కానీ…!

త‌మిళ సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 3,200 థియేట‌ర్ల‌లో విడుద‌లై తొలి రోజు మంచి స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించింద‌ని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఈ సినిమా ఓపెనింగ్ డే గ్రాస్…

త‌మిళ సినిమా పొన్నియ‌న్ సెల్వ‌న్ 2 ప్ర‌పంచ వ్యాప్తంగా సుమారు 3,200 థియేట‌ర్ల‌లో విడుద‌లై తొలి రోజు మంచి స్థాయిలో వ‌సూళ్ల‌ను సాధించింద‌ని అంటున్నాయి ట్రేడ్ వ‌ర్గాలు. ఈ సినిమా ఓపెనింగ్ డే గ్రాస్ 38 కోట్ల రూపాయ‌లు అని తెలుస్తోంది. ఈ సినిమాను భారీ బ‌డ్జెట్ తో, పేరున్న తారాగ‌ణంతో పెద్ద ఎత్తున తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే పీఎస్ 1 రూపంలో ఒక పార్టు విడుద‌ల అయ్యింది. సీక్వెల్ పార్టు గ్రాస్ వ‌సూళ్ల రూపంలో పాజిటివ్ ఫ‌లితాన్నే పొందింది.

అయితే.. తొలి వెర్ష‌న్ కు తొలి రోజు ద‌క్కిన గ్రాస్ తో పోలిస్తే ఇది స‌గం కూడా లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. త‌మిళ బాక్సాఫీస్ లెక్క‌ల ప్ర‌కారం పొన్నియ‌న్ సెల్వ‌న్ తొలి పార్టు తొలి రోజున ఏకంగా 80 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌ను సాధించింది. త‌మిళ‌నాడు వ‌ర‌కూ పీఎస్ 1 సూప‌ర్ హిట్. త‌మిళ‌నాడులో ఆ సినిమా భారీ వ‌సూళ్ల‌ను సాధించింది. 

తెలుగు, హిందీ వెర్ష‌న్ల విష‌యంలో దానిపై అంచ‌నాలున్నా.. ఈ  భాష‌ల్లో అది అంచ‌నాల‌ను అందుకోలేదు. క‌థ‌, క‌థ‌నాలు తెలుగు వారికి కానీ, త‌మిళేత‌రుల‌కు కానీ పెద్ద‌గా అర్థం కాక‌పోవ‌డం, ఆస‌క్తిని రేకెత్తించ‌డంలో కూడా విఫ‌లం కావ‌డ‌మే గాక‌, గంద‌ర‌గోళాన్నే మిగ‌ల్చ‌డ‌మే పొన్నియ‌న్ సెల్వ‌న్ కు నెగిటివ్ గా నిలిచింది. దీంతో త‌మిళ‌నాడు మిన‌హా ఎక్క‌డా పొన్నియ‌న్ సెల్వ‌న్ ప్ర‌భంజ‌నం పెద్ద‌గా లేదు. 

త‌మిళం త‌ర్వాత తెలుగులోనే  పొన్నియ‌న్ సెల్వ‌న్ 1 కాస్తో కూస్తో రాబ‌ట్టుకుంది. మ‌రి సీక్వెల్ విష‌యానికి వ‌స్తే త‌మిళ‌నాట కూడా తొలి వెర్ష‌న్ అంత ప్ర‌భంజ‌నం లేద‌ని స్ప‌ష్టం అవుతోంది. 38 కోట్ల రూపాయ‌ల గ్రాస్ తో ఫ‌స్ట్ పార్ట్ తొలి రోజు వ‌సూళ్ల‌లో స‌గం వ‌సూళ్ల స్థాయిలో ఈ సినిమా నిలిచింది. రివ్యూలు అయితే ఫ‌ర్వాలేద‌నిపించుకునే రీతిలోనే వ‌చ్చాయి. 

ఈ నేప‌థ్యంలో పీఎస్ 2 ఏ స్థాయి వ‌సూళ్ల మార్కును అందుకుంటుంద‌నేది ఆస‌క్తిదాయ‌క‌మైన అంశం. ఫ‌స్ట్ వెర్ష‌న్ తో పోలిస్తే రెండో వెర్ష‌న్ విడుద‌లైన థియేట‌ర్ల సంఖ్య  కూడా త‌క్కువే. పీఎస్ 1 ఏకంగా 4500 స్క్రీన్ ల‌పై ప్ర‌ద‌ర్శితం అయ్యింది తొలి రోజున‌.