చాన్నాళ్ల కిందటి సంగతి. కన్నడ హీరో రక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక పెళ్లి చేసుకోవాలనుకున్నారు. అన్ని మాటలు, చర్చలు కూడా జరిగిపోయాయి. కానీ అంతలోనే రష్మిక టాలీవుడ్ లో పాపులర్ అయిపోయింది. అదే టైమ్ లో రక్షిత్ తో తన పెళ్లిని రద్దు చేసుకుంది.
పెళ్లి రద్దుకు సంబంధించి వాళ్లిద్దరి మధ్య ఏం జరిగిందనేది బయట ప్రపంచానికి తెలియదు. అయితే అలా పెళ్లి కాన్సిల్ చేసుకున్న తర్వాత రక్షిత్-రష్మిక మధ్య రిలేషన్ షిప్ ఎలా ఉంది? అసలు రక్షిత్, ఆ బాధ నుంచి బయటపడ్డాడా?
తాజాగా దీనిపై మరోసారి స్పందించాడు రక్షిత్. ఓ వ్యక్తిని అదే పనిగా ద్వేషించడం కరెక్ట్ కాదని, దాని వల్ల మనసులో మరింత భారం పెరుగుతుందని అన్నాడు.
“మనకు నచ్చలేదని ఎదుటి వ్యక్తిని ద్వేషించడం కరెక్ట్ కాదు. ప్రతి ఒక్కరికి ఓ వ్యక్తిత్వం ఉంటుంది. దాన్ని మనం గౌరవించాలి. అభిప్రాయాలు కలవనంత మాత్రాన ద్వేషించాల్సిన అవసరం లేదు. మనసులు కలవనప్పుడు వదిలేయాలి, జీవితంలో ముందుకు సాగిపోవాలి. అంతేతప్ప, ఆ బాధను మోస్తూ ఉండకూడదు. అది మనకు మరింత భారంగా మారుతుంది. మన భవిష్యత్ ప్రణాళికలకు, ప్రయాణానికి ఆ భారం ఎంతమాత్రం ఉపయోగపడదు. దాన్ని వదిలించుకోవడమే మంచిది.”
ఇలా రష్మికతో బ్రేకప్ నుంచి బయటపడ్డానని పరోక్షంగా వెల్లడించాడు రక్షిత్. అయితే అలా బాధ నుంచి బయటపడడం అంత ఈజీ కాదని కూడా చెప్పుకొచ్చాడు.
“మనసుకు తగిలిన గాయాన్ని, ఆ భారాన్ని మరిచిపోవడం చాలా కష్టం. కానీ సరైన పద్ధతిలో అర్థం చేసుకుంటే ఆ భారాన్ని వదిలించుకోవడం తేలిక. ఆ బాధ లేదా భారాన్ని వదిలించుకోవడానికి చాలామంది ఎక్కువ టైమ్ తీసుకుంటారు. కొంతమంది తొందరగా అర్థం చేసుకొని, ఆ బాధ/భారం నుంచి బయటపడతారు. నేను తొందరగానే బయటకొచ్చేశాను.”
ప్రస్తుతం రష్మికతో తను ఫ్రెండ్లీగానే ఉన్నానని తెలిపాడు రక్షిత్. తమ సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఒకరికొకరు ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటారట. పుట్టినరోజులు వచ్చినప్పుడు శుభాకాంక్షలు కూడా చెప్పుకుంటున్నారట. అలా ఇద్దరం టచ్ లోనే ఉన్నామంటున్నాడు రక్షిత్. ఈ హీరో తాజా స్టేట్ మెంట్ తో రష్మికపై ట్రోలింగ్ కాస్త తగ్గుతుందేమో చూడాలి.