బ్రాహ్మణి తప్ప వేరు లేరా?

చంద్రబాబు ప్రస్తుతానికి లోపల వున్నారు. రేపో, మాపో బయటకు వస్తారు. అందులో సందేహం లేదు. ఈ లోగానో, ఆ తరువాతనో లోకేష్ ను అరెస్ట్ చేస్తారనే వదంతులు. ఇవి నిజం కావడానికి అవకాశం తక్కువ.…

చంద్రబాబు ప్రస్తుతానికి లోపల వున్నారు. రేపో, మాపో బయటకు వస్తారు. అందులో సందేహం లేదు. ఈ లోగానో, ఆ తరువాతనో లోకేష్ ను అరెస్ట్ చేస్తారనే వదంతులు. ఇవి నిజం కావడానికి అవకాశం తక్కువ. కానీ ఎందుకో ఆ వదంతులు పుట్టుకు వస్తున్నాయి. 

ఇలాంటి టైమ్ లో తెలుగుదేశం పార్టీకి ఆల్టర్ నేటివ్ ఎవరు అనే టాక్ మొదలుపెట్టేసారు. పైగా తెలుగుదేశం అనుకూల మీడియా ఈ విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. అసలు బాబుగారు బయటకు వస్తారు అని తెలుసు. లోకేష్ బయటే వున్నారనీ తెలుసు. కానీ అప్పుడే బ్రాహ్మిణి అనే పేరు ఎందుకు తెరమీదకు తెస్తున్నారు అన్నది ప్రశ్న.

బ్రాహ్మణి కన్నా ముందుగా నందమూరి బాలకృష్ణ వుండనే వున్నారు. ఆయన అర్హతలు చూద్దాం.

పలుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వయసుతో వచ్చిన పరిణితి వుంది.

ఇది ఎన్టీఆర్ స్ధాపించిన పార్టీ. అందులో సందేహం లేదు. ఎన్టీఆర్ సినీ వారసుడు బాలయ్య.

ఒకసారి పబ్లిక్ గా తన రాజకీయ వారసుడు కూడా బాలయ్యే అని ఎన్టీఆర్ అన్నారు.

నందమూరి చేతుల నుంచి నారా చేతులకు వెళ్లిన తెలుగుదేశం పార్టీ మళ్లీ నందమూరి కుటుంబం చేతుల్లోకి వస్తే, జనాల్లో వచ్చే రెస్పాన్స్ వేరు. కానీ ఆ దిశగా తెలుగుదేశం అనుకుల మీడియా ఎందుకు ఆలోచించడం లేదు.

బాలయ్య కూతుర్ని కోడల్ని చేసుకోవడం ద్వారా నందమూరి కుటుంబం మొత్తాన్ని చంద్రబాబు తన పక్కకు చేర్చుకోగలిగారు.

ఇప్పుడు అదే బాలయ్య కూతుర్ని ముందుకు తీసుకువచ్చి, నందమూరి కుటుంబానికి మరోసారి తెలుగుదేశం దక్కే అవకాశాలకు గండి కొడుతున్నారు. బ్రాహ్మణికి ఇస్తున్న ఎలివేషన్ కేవలం లోకేష్ భార్యగా, బాబుగారి కోడలి గా తప్ప బాలయ్య కూతురిగా మాత్రం కాదన్న విషయంలో అనుమానపడక్కరలేదు.

వీరంతా ఎక్కడ?

తెలుగుదేశం పార్టీలో బోలెడు మంది ఫార్టీ ఇండస్ట్రీ జనాలు వున్నారు.

యనమల.. అయ్యన్న.. అశోక్ గజపతి.. దేవినేని.. గోరంట్ల.. ఇలా చాలా అంటే చాలా మంది వున్నారు. బాబు అరెస్ట్ తరువాత వీళ్లంతా స్టేట్ మెంట్లు ఇచ్చి వుండొచ్చు. కానీ అంతకు మించి మాత్రం వాళ్లెవరు యాక్టివ్ కాలేదు. ఎందుకని? పార్టీ కష్టకాలంలో వున్నపుడు గట్టిగా మాట్లాడాల్సిన అవసరం వుంది కదా? ఎందుకని? లోకల్ గా వాయిస్ లు వినిపించి వదిలేసారు.  

అలా కాకుండా టోటల్ సీనియర్ లీడర్లు అంతా దాదాపు వంద మంది వుంటారు. వీరంతా కలిసి రాజమండ్రి లోనో, బెజవాడలోనో ధర్నా చేసి వుంటే జనాల్లో రియాక్షన్ ఎలా వుండేది? పోనీ వీళ్లందిరకీ చంద్రబాబుతో పని లేదా అంటే..రేపు ఒక వేళ పవర్ లోకి వస్తే మంత్రి పదవుల కోసం ముందు వుండేది వీరే.

కానీ వీరంతా ఎందుకు అంత యాక్టివ్ గా లేరు. నారా బ్రాహ్మణిని తెర మీదకు తేవడం, లోకేష్ స్వయంగా డీల్ చేయడం, బాలయ్య మీటింగ్ లు పెట్టడం ఇవన్నీ కలిసి టోటల్ ఇస్యూని ఓ ఫ్యామిలీ ఇస్యూగా మార్చేసాయి. దాంతో మిగిలిన వాళ్లు సైలంట్ అయ్యారు. మళ్లీ బాబుగారు బయటకు వస్తే, పరామర్శించడానికి ముందు వరుసలోకి వస్తారు వీరంతా.