2014లో తిరిగి అధికారం సంపాదించిన తర్వాత చంద్రబాబు నాయుడు చేత బాగా బాధింపబడిన వారిలో ఒకరు మోత్కుపల్లి నర్సింహులు! చంద్రబాబు కోసం ఈయన ఒకరేంజ్ లో పని చేశారు. అంతకు ముందు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అయితే.. ఎన్టీఆర్ భవన్ లో నిత్యం ప్రెస్ మీట్లు పెట్టి జగన్, కేసీఆర్ లపై దుమ్మెత్తిపోశారు మోత్కుపల్లి. ఈయన ప్రెస్ మీట్ పెట్టని రోజంటూ ఉండేది కాదు వ్యవహారం!
ఈయన ఎంతలా సేవ చేశారంటే.. పార్టీ అధికారంలోకి రాగానే మోత్కుపల్లికి గవర్నర్ పదవి అంటూ చంద్రబాబు అనౌన్స్ చేసేశారు! ఒలింపిక్స్ లో మెడల్ గెలిస్తే నోబెల్ బహుమతిని ఇస్తానంటూ ప్రకటించిన మేధావి అయిన బాబుగారికి పార్టీ అధికారంలోకి రాగానే మోత్కుపల్లిని గవర్నర్ చేసేయడం పెద్ద కష్టం కాదని చాలా మంది నమ్మారు పాపం! వారిలో మోత్కుపల్లి కూడా ఒకరు!
చంద్రబాబు ఇచ్చే హామీల కామెడీ ఎలా ఉంటుందో మోత్కుపల్లి ఎపిసోడ్ ఆ తర్వాత చాటి చెప్పింది. మోడీకి చెప్పేస్తారని, మోత్కుపల్లిని గవర్నర్ ను చేసేయబోతున్నారని ఆ రెండు పత్రికలూ నిత్యం రాసేవి! ఈ విషయంలో మోడీతో చంద్రబాబు ప్రత్యేకంగా మాట్లాడారనే ప్రచారమూ చేశారు!
ఈ వార్తలన్నీ నిజం అనుకుని మరోవైపు మోత్కుపల్లి మరింతగా కష్టపడసాగారు! ఆ గవర్నర్ పదవి వద్దు.. ఏ ఎమ్మెల్సీనో, ఏదైనా నామినేటెడ్ పోస్టో అంటూ అడగలేని రీతిలో ఆయనను మునగ చెట్టు ఎక్కించారు! అయినా రాష్ట్రపతి, ప్రధానిగా ఎవరుండాలో డిసైడ్ చేసిన చంద్రబాబుకు మోత్కుపల్లిని గవర్నర్ చేయడం ఒక్క లెక్కనా అనే సన్నాయి నొక్కులూ వినిపించాయి ఆ సమయంలో!
ఇలా నెలలు, సంవత్సరాల పాటు ఈ కామెడీ కొనసాగింది. ఆఖరికి ఇదెంత వరకూ వెళ్లిందంటే.. మోత్కుపల్లి నర్సింహులు కేబీఆర్ పార్కులో మార్నింగ్ వాక్ చేస్తున్నా.. అక్కడ ఎదురుపడిన వాళ్లు, ఏంసార్ ఎప్పుడు గవర్నర్ కాబోతున్నారు.. అంటూ ఆరాలు తీయడం మొదలైంది! ఈ ప్రహసనం అలా కొనసాగి కొనసాగి.. చివరకు ఒకానొక రోజున మోత్కుపల్లి ఏడ్చేశారు!
ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టి.. చంద్రబాబును వ్యతిరేకించే వారిపై వందల సార్లు దుమ్మెత్తి పోసిన మోత్కుపల్లి నర్సింహులు తనకు చంద్రబాబు ద్రోహం చేశారంటూ వెక్కిళ్లుపెట్టి ఏడ్చారు. చంద్రబాబును నమ్మి తను కేసీఆర్ ను, జగన్ ను విపరీతంగా విమర్శించానంటూ బాధపడ్డారు! మరి అప్పటి వరకూ గవర్నర్ ను చేస్తానంటూ చెప్పిన చంద్రబాబు ఏ దశలో కూడా మోత్కుపల్లిని పిలిపించుకుని మాట్లాడినట్టుగా కానీ, ఆయనను ఊరడించినట్టుగా కానీ వార్తలు రాలేదు. ఆయన రాజీనామాను ప్రకటించి తప్పుకున్నారు. ఆ తర్వాత మోత్కుపల్లిని ఎవ్వరూ పట్టించుకోలేదు. అలాంటి మోత్కుపల్లి ఇప్పుడు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడటం ఇంకో కామెడీ.
చంద్రబాబును నమ్మి మోసపోయినట్టుగా వెక్కిళ్లు పెట్టుకుని ఏడ్చిన ఈయన.. మళ్లీ తెరపైకి వచ్చి అలవాటైన పాత కామెడీలు చేస్తున్నారు! మరి జైల్లో ఉన్న బాబుగారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మోత్కుపల్లికి ఇంకోసారి గవర్నర్ హామీ ఇవ్వొచ్చిక!