ప్రముఖ నటి, యాంకర్ హరితేజ సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన వ్యక్తిగత, వృత్తిగత విషయాలను షేర్ చేసుకుంటుంటారు. ఈ నెల 5న పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఈ విషయాన్నే తనే సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారామె. అయితే తాను డెలవరీ సమయంలో కరోనాబారిన పడి ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు. హరితేజ భావోద్వేగా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
‘కరోనా విపత్కాలంలో బయట జరుగుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే.. నా స్వీయానుభవం చెప్పుకోవాలనిపించింది. నా వల్ల కొంతమందైనా మారుతారేమోనని ఈ వీడియో చేస్తున్నాను. డెలివరీకి సరిగ్గా వారం రోజుల ముందు ఆస్పత్రికి వెళ్లాను. వైద్యులు పరీక్షలు చేసి బేబీ ఆరోగ్యంగా ఉందని.. సాధారణ డెలివరీ అవుతుందని చెప్పారు.
నాకెంతో సంతోషంగా అనిపించింది. బేబీ కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సమయంలో అనుకోనివిధంగా మా కుటుంబం మొత్తం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. నాకు కూడా పాజిటివ్ వచ్చింది. ఏం చేయలో నాకు అర్థం కాలేదు. నేను ఎక్కువ జాగ్రత్తగా లేకపోవడం వల్లే ఇలా అయిందని అనిపించింది. అప్పుడు నేను చాలా ఇబ్బందికి గురయ్యా.
మా ఆయనకు నెగెటివ్ వచ్చింది. రెగ్యులర్‌గా చెకప్‌కి వెళ్లే డాక్టర్లు డెలివరీ చేయమని చెప్పారు. దాంతో కోవిడ్ ఆస్పత్రులను సంప్రదించా. నాకు పాజిటివ్ కాబట్టి బేబీకి కూడా వస్తుందని భయపడ్డాను. అన్ని రకాల టెస్టులు చేయించుకున్నాను. రిజల్ట్ కోసం రాత్రిళ్లు రాత్రిళ్లు ఎదురు చూశా. డెలివరీ అంటే సంతోషంగా ఉంటుంది.
డెలివరీ టైంలో ఒక్కదాన్నే పోరాడాను. దీపు ఒక్కడే చూసుకున్నాడు. కోవిడ్ వార్డులో ఒక్కదాన్నే ఉన్నాను. బేబీ పుట్టగానే నా దగ్గర నుంచి తీసుకెళ్లారు. పాపకు కొవిడ్ పరీక్ష చేయగా నెగటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పాపని వీడియో కాల్లో చూడాల్సి వచ్చింది. పాపకు పాలు ఇవ్వడానికి కూడా లేదు.
నాకెంతో బాధగా అనిపించేది. చికిత్స అనంతరం నన్ను ఇంటికి పంపించారు. ప్రెగ్నెన్సీ వాళ్లు చాలా జాగ్రత్తగా ఉండండి. మన వల్ల మనతో పాటు పక్కవాళ్లకు ఇబ్బంది కలుతుంది. ముందే జాగ్రత్తగా ఉండండి. బయట తిరగకండి’ అంటూ హరితేజ విజ్ఞప్తి చేసింది.