ఒక వైపు కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా దూసుకొస్తున్నా మినీ పురపాలక ఎన్నికలు నిర్వహిస్తుండడంపై ఎస్ఈసీని తెలంగాణ హైకోర్టు ఫుట్‌బాల్ ఆడింది. ఎస్ఈసీ వైఖరిపై తెలంగాణ హైకోర్టు విరుచుకుపడింది. అలాగే కేసీఆర్ ప్రభుత్వంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఎస్ఈసీ వైఖరిపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా కరోనా నియంత్రణపై కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. రేపటితో రాత్రిపూట కర్ఫ్యూ ముగుస్తుందని, అనంతర చర్యలేంటని హైకోర్టు ప్రశ్నించింది. పరిస్థితిని సమీక్షించి రేపు నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ తరపు న్యాయవాది ఏజీ ప్రసాద్ సమాధానం ఇచ్చారు.
ఏజీ సమాధానంపై హైకోర్టు తీవ్రంగా స్పందిస్తూ ….‘చివరి నిమిషంలో నిర్ణయాలు తీసుకోవడం ఎందుకు? నియంత్రణ చర్యలపై దాగుడు మూతలెందుకు? కనీసం ఒకరోజు ముందు చెబితే నష్టమేంటి? కట్టడి చర్యలపై మేం ఎలాంటి సూచనలూ ఇవ్వడం లేదు. క్షేత్ర స్థాయి పరిస్థితులు చూసి నిర్ణయం తీసుకోండి’ అని హితవు పలికింది. ప్రభుత్వాన్ని సంప్రదించి మధ్యాహ్నంలోపు చెబుతామని ఏజీ చెప్పి హైకోర్టును శాంతపరిచారు.
ఆ తర్వాత ఎస్ఈసీ వంతు వచ్చింది. ఇప్పటికే మినీ పురపాలక ఎన్నికల విషయమై కాంగ్రెస్ నేత షబ్బీర్ వేసిన వ్యాజ్యంపై విచారించిన హైకోర్టు …మరోసారి ఎస్ఈసీకి విన్నవించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రభుత్వంతో చర్చించి ఎన్నికల నిర్వహణకే మొగ్గు చూపినట్టు హైకోర్టుకు ఎస్ఈసీ తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా ఎస్ఈసీ తీరుపై ఆకాశమే హద్దుగా హైకోర్టు చెలరేగిపోయింది.
ఒక వైపు కరోనా విలయతాండం వేస్తుంటే, ప్రజల ప్రాణాలు పోతుంటే ఎన్నికలకు ఎందుకు వెళ్లారని ఎస్ఈసీని హైకోర్టు ప్రశ్నించింది. ప్రజల ప్రాణాలా? ఎన్నికలా?… ఏవి విలువైనవని ఎస్ఈసీని హైకోర్టు నిలదీసింది.యుద్ధం వచ్చినా.. ఆకాశం మీదపడినా ఎన్నికలు జరగాల్సిందేనా? అని గట్టిగా ప్రశ్నించింది.
అసలు ఎస్ఈసీ అధికారులు క్షేత్రస్థాయి పరిస్థితులను గమనిస్తున్నారా? అధికారులు భూమిపై నివసిస్తున్నారా? ఆకాశంలోనా? అంటూ అత్యంత ఘాటు ప్రశ్నలతో ఎస్ఈసీని ఉతికి ఆరేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ఎస్ఈసీని హైకోర్టు చాకిరేవు పెట్టిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కొన్ని మున్సిపాలిటీలకు ఇంకా సమయం ఉంది కదా అని హైకోర్టు అడగ్గా.. రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయంతోనే ఎన్నికలు నిర్వహిం చినట్టు ఎస్ఈసీ అధికారులు తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఏంటని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా రెండో దశ మొదలైనా నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారంటూ కోర్టు మండి పడింది.
ఎన్నికలు వాయిదా వేసే అధికారం ఎస్ఈసీకి లేదా? ఎన్నికల ప్రచారం సమయం కూడా ఎందుకు కుదించలేదంటూ అసహనం వ్యక్తం చేసింది. చివరికి ఎస్ఈసీ వివరణ సంతృప్తికరంగా లేదని.. అధికారులు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించడం గమనార్హం.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ వేసిన వ్యాజ్యంపై హైకోర్టు సింగిల్, డివిజన్ బెంచ్ చెప్పిన అంశాలపై తాజాగా చర్చ జరుగుతోంది. ఎన్నికల విషయంలో తాము జోక్యం చేసుకోలేమని, మరోసారి ఎస్ఈసీకే తిరిగి విన్నవించాలని పిటిషనర్‌కు సూచించిన హైకోర్టు …ఎన్నికలకు కేవలం ఒక రోజు ముందు ఘాటు వ్యాఖ్యలు చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే రీతిలో హైకోర్టు ముందే హెచ్చరించి ఉంటే ప్రజలకు ప్రయోజనం కలిగేదని మెజార్టీ అభిప్రాయం వ్యక్తమవుతోంది.