సినిమా వ్యాపారం అన్నది కొన్ని పద్దతుల మీద, మాటల మీద నడుస్తుంది. ఇక్కడ కాగితాలు..రాత కోతలు ముఖ్యం కాదు. మాట ముఖ్యం. ఇంతకీ విషయం ఏమిటంటే సీనియర్ హీరో నాగార్జునతో రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ తీయబోయే సినిమా సంగతే. ఈ సినిమా వెనుక చాలా సంగతి వుంది.
ఆ సంగతి చెప్పుకునే ముందు, కొంత వెనక్కు వెళ్లాలి. మళయాళంలో వచ్చిన ఓ సినిమా చూసి బెజవాడ ప్రసన్న దాని హక్కులు కొనమని పీపుల్స్ మీడియా నిర్మాతలకు చెప్పారు. అది తెలుగులో కాస్త మార్పులు చేర్పులు చేసి చేస్తే బాగుంటుందని. అప్పటికి పీపుల్స్ మీడియా-అభిషేక్ అగర్వాల్ భాగస్వాములు కనుక, ఆ సినిమా హక్కులు అభిషేక్ ఆర్ట్స్ పేరిట కొన్నారు.
ప్రసన్న కుమార్ లైన్ ను నాగార్ఙున కు చెబితే ఓకె అన్నారు. ఆ మేరకు కేవలం అసలు కథలోని మూడు పాయింట్లు వాడుకుని వేరే కథ తయారు చేసారు ప్రసన్న. కానీ ఎక్కడ తేడా వచ్చింది అంటే నాగ్ తో సినిమాను నిర్మాత చిట్టూరి శ్రీనుకు చేయాల్సి వచ్చింది.
సినిమా హక్కులు తన దగ్గర వున్నాయి కనుక, తనకు కొన్న మొత్తం..ఇంకా అదనంగా ఇవ్వాలని అభిషేక్ అగర్వాల్ డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కొనిపించిన పీపుల్స్ మీడియా నిర్మాతలు కొన్న రేటుకు ఇచ్చేయడానికి సిద్దంగానే వున్నారు. కానీ తన పేరున వుంది కనుక అభిషేక్ అగర్వాల్ ససేమిరా అంటున్నారు.
తనే కొనిపించానని, తనను ఇలా ఇబ్బంది పెట్టడం సబబా అని బెజవాడ ప్రసన్న బాధపడుతున్నారు. ఈ విషయంలో ఆసియన్ సునీల్ లాంటి వాళ్లు మధ్యవర్తిత్వం చేసినా అభిషేక్ అగర్వాల్ వినడం లేదని తెలుస్తోంది.
సరే, ఇంక ఎందుకు, ఆ మూడు పాయింట్లు కూడా వదిలేసి, కథ పూర్తిగా మార్చుకోవడానికి బెజవాడ ప్రసన్న రెడీ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ లోగా ఈ సినిమా హక్కులు తమ దగ్గర వున్నాయంటూ అభిషేక్ అగర్వాల్ నిన్నటికి నిన్న ప్రకటన ఇచ్చారు.
కొనిపించింది బెజవాడ ప్రసన్న…పెట్టుబడి పెట్టింది పీపుల్స్ మీడియా…పేరు అభిషేక్ అగర్వాల్ ది. దీంతో ఇంత తకరారు వచ్చింది. కానీ ఇక్కడ సినిమా జనాలు అభిషేక్ అగర్వాల్ చేస్తున్నది తప్పు అంటున్నారు. సినిమా రంగంలో మాట కీలకం అని చెబుతున్నారు.