మెగాస్టార్ సినిమాలో ఒకరు కాదు…ఏకంగా ముగ్గురు అందగత్తెలు అలరించనున్నారు. మెగాస్టార్ చిరంజీవి-కొరటాల శివ కాంబినేషన్‌లో “ఆచార్య” సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్ కారణంగా సినిమా షూటింగ్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమా షూటింగ్‌లు మళ్లీ ట్రాక్ ఎక్కుతున్న నేపథ్యంలో టాలీవుడ్ విషయాలు చక్కర్లు కొడుతున్నాయి.
తాజాగా ఆచార్య సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలపై చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో చిరు తనయుడు, యంగ్ హీరో రామ్‌చరణ్ కూడా నటిస్తుండడంతో ఆచార్యపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ఈ సినిమాలో రామ్‌చరణ్ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడని తెలిసింది. ఈ సినిమాలో ముగ్గురు అందాల భామలు కనిపిస్తుండడం ఎంతో ప్రత్యేకం.
చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్, రామ్‌చరణ్‌కు జోడీగా కైరా అద్వానీ లేదా జాన్వీకపూర్ నటించనున్నట్టు సమాచారం. ఇక మరో భామ రెజీనా కసాండ్రా ఐటెం సాంగ్‌లో కనువిందు చేయనున్నారు. ఈ సినిమాలో చిరంజీవి జోడీగా పలువురి హీరోయిన్ల పేర్లు వినిపించినా చివరికి కాజల్ అగర్వాల్ సెటిల్ అయ్యారు. మొత్తానికి ముగ్గురు బ్యూటీలు మాత్రం ఆచార్య సినిమాలో పక్కా అని తేలిపోయింది.