కరోనా వైరస్ బారిన పడిన ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం గురించి తెలుగు సమాజం ఎంతో ఆందోళనగా ఉంది. చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలు ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. తన మధుర స్వరంతో ఆబాలగోపాలాన్ని అలరించిన బాలు త్వరగా కోలుకుని ఎప్పట్లాగే సంగీత ప్రియుల్ని ఓలలాడించాలని కోరుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలు చెల్లెలు, గాయని ఎస్పీ శైలజ తన అన్న ఆరోగ్య పరిస్థితిపై ఆడియో విడుదల చేశారు. ఇంతకూ ఆమె ఏమన్నారంటే… ‘బాలు అన్నయ్య రోజు రోజుకూ బెటర్ అవుతున్నారు. డాక్టర్స్ ఆయన హెల్త్ డెవలప్మెంట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. వెంటిలేషన్ తీసేశారు. ఎకో సిస్టమ్ మాత్రం అలాగే ఉంచారు. నెమ్మదిగా స్పృహలోకి వస్తున్నారు. ప్రపంచమంతా అన్నయ్య ఆరోగ్యం కోసం ప్రార్థిస్తున్నారని నాకు తెలుసు. తప్పకుండా అన్నయ్య హ్యాపీగా బయటకు వస్తారు’ అని తెలిపారు.
వెంటిలేటర్ తొలగించారని శైలు చెప్పడం ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని ఇస్తోంది. వెంటిలేటర్ లేకుండానే ఆయన శ్వాస తీసుకోవడం ఎంతో ఊరటనిచ్చే విషయం. బాలు ఆరోగ్యంగా తిరిగి వస్తారనే భరోసా నింపే ఓ ఒక్క మాట వినేందుకు ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. నిదానంగా బాలు స్పృహలోకి వస్తున్నారని చెప్పడం కూడా కుటుంబ సభ్యులకే కాకుండా ప్రతి ఒక్కరికీ ఎంతో ధైర్యాన్ని ఇస్తోంది.