టాలీవుడ్ ఓ విధంగా చెప్పుకోవాలంటే ఓ కాసినో లాంటిది. ఇక్కడకు సూట్ కేసులు పట్టుకుని వచ్చేవాళ్లు వస్తుంటారు. ఖాళీ చేసుకుని తప్పుకునే వాళ్లు తప్పుకుంటూ వుంటారు. ఫ్యాసినేషన్ తో కొందరు, లాభాలార్జన కోసం ఇంకొంతమంది వస్తుంటారు. వెళ్తుంటారు.
కానీ ఇక్కడ ఇంకో రకం జనాలు కూడా వుంటారు. చిరకాలం ఇక్కడే వున్న అనుభవంతో, 'దీని మీద పందెం కాయి..దాని మీద పందెం ఒడ్డు' అంటూ కన్సల్టింగ్ వ్యవహారాలు అందిస్తుంటారు. నిజానికి వీళ్లు తమ అనుభవం అంతా ఒడ్డి, ఒకటి రెండు సూట్ కేసులు పొగొట్టుకుని వుంటారు. ఇంకా కాదంటే ఓ పది పన్నెండు కోట్లు అప్పుల్లో వుంటారు.
కానీ వీళ్లకు రోజులు గడవాలంటే, కొత్తగా సూట్ కేసులతో వచ్చే జనాలు కావాలి. ఇలా రండి అలా పది సూటుకేసులు పట్టుకెళ్లొచ్చు అని నమ్మబలికి, అమాయకులను రంగంలోకి దింపుతుంటారు. పాపం, దిగాక కానీ వాళ్లకు తెలియదు అసలు లోతు ఎంతో. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తూ, అంతో ఇంతో సంపాదించిన వారు ఇలాంటి భ్రమలకు, ప్రలోభాలకు గురై ఇక్కడి వస్తుంటారు.
ఇలాగే అమెరికా నుంచి ఓ బ్యాచ్ ఇక్కడకు రావడానికి రెడీ అవుతోందని బోగట్టా. చిన్న చితక డిస్ట్రిబ్యూషన్లు చేసిన ఓ కుర్ర బ్యాచ్ ఇక్కడి ఓ ప్రొడ్యూసర్ 'అనుభవాన్ని' నమ్మి, పది పన్నెండు కోట్లు పట్టుకుని రంగంలోకి దిగి, అతని సారథ్యంలో చిన్న సినిమాలు చేస్తారట. కానీ ఆ నిర్మాత అనుభవం కాస్ట్ పది, పన్నెండు కోట్లు నష్టం అన్నది ఇండస్ట్రీ టాక్. ఆయనకే అంత అనుభవం వుంటే హిట్ సినిమాలే తీసేవాడు కదా అన్న ఆలోచన లేకుండా గుడ్డిగా రంగంలోకి దిగిపోతున్నారట ఆ అమెరికా కుర్ర బ్యాచ్.
వీళ్లను తలచుకుని, గతంలో ఇలాగే అదే నిర్మాతను నమ్ముకుని వచ్చి, వెళ్లిన వాళ్లను తలచుకుని ఇండస్ట్రీ జనాలు జోకులు పేల్చుకుంటున్నారు. జరుగు..జరుగు..ఇంకోడొస్తున్నాడు..అంటూ.