ప్రస్తుతం ప్రభాస్ లైనప్ చూస్తుంటే.. ఇకపై ఈ హీరో అన్నీ భారీ సినిమాలే చేస్తాడేమో అనిపిస్తోంది. సాహో ఫ్లాప్ తర్వాత వెనక్కి తగ్గుతాడేమో అని చాలామంది అనుకున్నారు. కానీ అందరి అంచనాల్ని తలకిందులు చేస్తూ తన ఆలోచన ఏంటో చెప్పకనే చెబుతున్నాడు ప్రభాస్. అతడు ఎనౌన్స్ చేస్తున్న ప్రాజెక్టులన్నీ పాన్-ఇండియా సినిమాలే. అన్నీ వేటికవే భారీ బడ్జెట్ మూవీస్.
ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 3 సినిమాలున్నాయి. ఈ 3 సినిమాల బడ్డెట్ అక్షరాలా 900 కోట్ల రూపాయలు. రిలీజ్ అయ్యేసరికి అటుఇటుగా లెక్కలు మారి, ప్రమోషన్ తో కలిపి మరో 100 కోట్లు పెరిగినా ఆశ్చర్యంలేదు.
ప్రస్తుతం రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు ప్రభాస్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ బడ్జెట్ అక్షరాలా 150 కోట్ల రూపాయలు. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్ ఫిక్షన్ సినిమా చేయబోతున్నాడు ప్రభాస్. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై రానున్న ఆ సినిమాకు 250 కోట్ల రూపాయల బడ్జెట్ అనుకుంటున్నారు.
ఇక ఈరోజు ప్రకటించిన ఆదిపురుష్ మూవీ బడ్జెట్ అయితే ఏకంగా 500 కోట్ల రూపాయలు. ప్రభాస్ కెరీర్ లో బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా ఇదే. ఇలా ప్రభాస్ చేతిలో ఉన్న 3 సినిమాల బడ్జెట్ కలుపుకుంటే అక్షరాలా 900 కోట్ల రూపాయలు అవుతోంది.