జనాభాలో ఇప్పుడు మనమే నంబర్ వన్

ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యథిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈ విషయంలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, చైనా జనాభా 142.57 కోట్లు…

ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యథిక జనాభా కలిగిన దేశంగా భారతదేశం అవతరించింది. ఈ విషయంలో చైనాను ఇండియా అధిగమించింది. ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం, చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారతదేశ జనాభా 142.86 కోట్లు.

జననాల రేటు పడిపోవడంతో చైనా జనాభా క్షీణతను ఎదుర్కొంటోంది. చైనాలో అనేక ప్రాంతాలు జనన రేటును పెంచే ప్రణాళికలను కూడా ప్రకటించాయి. కానీ ప్రయత్నాలు ఫలించలేదు. చైనా జనాభా తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో భారత్ లో జనాభా పెరుగుదల సగటు నిలకడగా ఉండడంతో, చైనాను అధిగమించింది.

2011 తర్వాత ఇండియాలో జనాభాను లెక్కించలేదు. 2021లో జరగాల్సి జనగణన కరోనా వల్ల ఆలస్యమైంది. ఐక్యరాజ్యసమితి డేటా ప్రకారం, భారతదేశ జనాభాలో దాదాపు పావు వంతు మంది 14 ఏళ్లలోపు ఉన్నారు. జనాభాలో 68 శాతం మంది 15 నుంచి 64 ఏళ్ల మధ్య ఉన్నవారు కాగా, 7 శాతం మంది 65 ఏళ్లు పైబడిన వారు.

వివిధ ఏజెన్సీల అంచనాల ప్రకారం భారతదేశ జనాభా, 3 దశాబ్దాల పాటు పెరుగుతూనే ఉంటుంది. 165 కోట్లకు చేరుకుంటుంది. అక్కడ్నుంచి తగ్గుముఖం పడుతుంది.

ఇక ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభా 8.045 బిలియన్లకు చేరుకుంటుందని ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొంది. యూరోప్, అమెరికాతో పాటు, జపాన్ లాంటి కొన్ని ఆసియా దేశాల్లో జనాభా తగ్గిపోతోంది.