లేడీ అమితాబ్ కంటే ఆమే ప‌వ‌ర్‌ఫుల్‌

లేడీ అమితాబ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి ఆ పార్టీలో ప్రాధాన్యం ల‌భించ‌లేదా? అంటే ఔన‌నే సమాధానం వ‌స్తోంది. విజ‌య‌శాంతి కంటే మాజీ మంత్రి డీకే అరుణ‌కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే…

లేడీ అమితాబ్, బీజేపీ సీనియ‌ర్ నాయ‌కురాలు విజ‌య‌శాంతికి ఆ పార్టీలో ప్రాధాన్యం ల‌భించ‌లేదా? అంటే ఔన‌నే సమాధానం వ‌స్తోంది. విజ‌య‌శాంతి కంటే మాజీ మంత్రి డీకే అరుణ‌కు బీజేపీ అధిక ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే క‌ర్నాట‌క ఎన్నిక‌ల్లో స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో డీకే అరుణ చోటు ద‌క్కించుకున్నారు.

తాజాగా బీజేపీ స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితా విడుద‌ల చేసింది. ఇందులో తెలంగాణ నుంచి అరుణ‌కు చోటు ద‌క్క‌డం విశేషం. ఇదిలా వుండ‌గా ఆ జాబితాలో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ, అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డాతో స‌హా మొత్తం 40 మందికి స్థానం క‌ల్పించారు. వారిలో డీకే అరుణ పేరు ఉండ‌డాన్ని ప‌రిశీలిస్తే, ఆమెకు జాతీయ నాయ‌క‌త్వం గుర్తింపు, గౌర‌వం ఇచ్చిన‌ట్టుగా తెలుస్తోంది.

కేసీఆర్ స‌ర్కార్‌పై విరుచుకుప‌డ‌డంలో అరుణ ముందు వ‌రుస‌లో వుంటారు. కేసుల‌కు భ‌య‌ప‌డ‌డం లేదు. ప్ర‌స్తుతం ఆమె జాతీయ కార్య‌వ‌ర్గంలో ఉన్నారు. విజ‌య‌శాంతి విష‌యానికి గ‌త కొంత కాలంగా బీజేపీపై అసంతృప్తిగా ఉన్నారు. అలాగ‌ని ఆ పార్టీకి దూరంగా వుండ‌డం లేదు. బీజేపీలో ఉన్నా లేన‌ట్టుగా విజ‌య‌శాంతి ప‌రిస్థితి త‌యారైంది. అప్పుడ‌ప్పుడు మాత్ర‌మే బీజేపీ కార్య‌క్ర‌మాల్లో విజ‌య‌శాంతి పాల్గొంటున్నార‌ని చెబుతున్నారు.

డీకే అరుణ మాత్రం తెలంగాణ‌లో బీజేపీకి వ‌చ్చిన ప్ర‌తిక‌ష్టంలోనూ పాలు పంచుకుంటున్నారు. కేసీఆర్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్నారు. కేసీఆర్ ప్ర‌భుత్వ విధానాల‌ను ఎండ‌గ‌ట్ట‌డంలో అరుణ బ‌ల‌మైన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ ల‌క్ష‌ణాలే ఆమెకు జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాయి. 

తెలంగాణ‌లో బీజేపీని బ‌లోపేతం చేయ‌డానికి బీఆర్ఎస్‌, కాంగ్రెస్ పార్టీల‌కు చెందిన నాయ‌కుల‌తో సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు వార్త‌లొస్తున్నాయి. ఏది ఏమైనా డీకే అరుణ స్టార్ క్యాంపెయిన‌ర్ జాబితాలో చోటు ద‌క్కించుకోవ‌డం ద్వారా బీజేపీ అధిష్టానం వ‌ద్ద త‌న ప‌లుకుబ‌డి ఏంటో నిరూపించుకున్నారు.