విశాఖ‌కు కాపురం…జ‌గ‌న్ వ్యూహం!

రాజ‌కీయాల్లోనే కాదు, జీవితంలో అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు. ఎన్నెన్నో అనుకుంటుంటాం, ఏవేవో ఊహించుకుంటాం…అవ‌న్నీ కార్య‌రూపం దాల్చ‌వు. ఇది అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే. అలాగ‌ని క‌ల‌లు క‌న‌కుండా ఉండ‌లేం. ఆశ‌యం లేక‌పోతే మ‌నిషి అనిపించుకోరు. ఏదో తిన్నామా,…

రాజ‌కీయాల్లోనే కాదు, జీవితంలో అనుకున్న‌వ‌న్నీ జ‌ర‌గ‌వు. ఎన్నెన్నో అనుకుంటుంటాం, ఏవేవో ఊహించుకుంటాం…అవ‌న్నీ కార్య‌రూపం దాల్చ‌వు. ఇది అంద‌రికీ తెలిసిన స‌త్య‌మే. అలాగ‌ని క‌ల‌లు క‌న‌కుండా ఉండ‌లేం. ఆశ‌యం లేక‌పోతే మ‌నిషి అనిపించుకోరు. ఏదో తిన్నామా, ప‌డుకున్నామా, లేచామా అని బ‌తుకీడ్చే వాళ్లు… ఈ భూమ్మీద‌కి ఎవ‌రికీ తెలియ‌కుండా వ‌చ్చిన‌ట్టే, తెలియ‌కుండానే వెళ్లిపోతారు.

కానీ ఏ ఆశ‌యం, ల‌క్ష్యం లేక‌పోతే జీవిత‌మైనా, రాజ‌కీయ‌మైనా చ‌ప్ప‌గా వుంటుంది. ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మూడు రాజ‌ధానులు ఏర్పాటు చేయాల‌ని క‌ల‌లుక‌న్నారు. క‌ల‌ల్ని సాకారం చేసుకునేందుకు మూడు రాజ‌ధానుల బిల్లుల్ని తీసుకొచ్చారు. విశాఖ‌ను ప‌రిపాల‌న రాజ‌ధాని చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. అలాగే అమ‌రావ‌తిని శాస‌న‌, క‌ర్నూలును రాజ‌ధానిగా ప్ర‌క‌టించారు. అయితే జ‌గ‌న్ స‌ర్కార్ ఒక‌టి త‌లిస్తే, ఏపీ హైకోర్టు మ‌రోలా తీర్పు ఇచ్చింది. ఇది జ‌గ‌న్ స‌ర్కార్ ఆశ‌యాల‌కు పూర్తి వ్య‌తిరేకంగా వుంది.

దీంతో ఢిల్లీ వేదిక‌గా న్యాయ పోరాటం చేయ‌క త‌ప్ప‌నిస‌రి ప‌రిస్థితి నెల‌కుంది. అది ఎప్పుడవుతుందో కూడా తెలియ‌ని స్థితి. కానీ ఎన్నిక‌ల‌కు ఏడాది మాత్ర‌మే గ‌డువు వుండ‌డంతో మూడు రాజ‌ధానుల విష‌య‌మై తాము అనుకున్న‌ది చేయాల‌న్న ప‌ట్టుద‌ల‌తో జ‌గ‌న్ స‌ర్కార్ వుంది. సుప్రీంకోర్టు తీర్పు మేర‌కే రాజ‌ధానిపై న‌డుచుకుంటామ‌ని ఒక వైపు మంత్రులు చెబుతూ వ‌చ్చారు. ఇవాళ ఉత్త‌రాంధ్ర ప‌ర్య‌ట‌న‌లో సీఎం జ‌గ‌న్ విశాఖ నుంచి పాల‌న‌పై తేల్చి చెప్పారు.

సెప్టెంబ‌ర్ నుంచి విశాఖ కేంద్రంగా ప‌రిపాల‌న సాగిస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అయితే సుప్రీంకోర్టులో న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌కు ప‌రిష్కారం ల‌భించ‌కుండా విశాఖ నుంచి ప‌రిపాల‌న సాగించ‌డం సాధ్య‌మా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. జ‌గ‌న్ ప్ర‌క‌ట‌న వెనుక వ్యూహం వుంద‌నే చ‌ర్చ న‌డుస్తోంది. తాజా రాజ‌కీయ ప‌రిణామాలు వైఎస్ జ‌గ‌న్‌కు న‌ష్టం క‌లిగించేలా వున్నాయ‌ని, వాటి నుంచి ప్ర‌జానీకాన్ని దృష్టి మ‌ళ్లించేందుకు ఆయ‌న ఎత్తుగ‌డ వేశార‌నే చ‌ర్చ న‌డుస్తోంది.

వివేకా హ‌త్య కేసులో వైఎస్ భాస్క‌ర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయ‌డం, మ‌రోవైపు వైఎస్ అవినాష్‌రెడ్డికి తాత్కాలిక ఉప‌శ‌మ‌నం ల‌భించిన సంగ‌తి తెలిసిందే. వివేకా హ‌త్యోదంతం వైఎస్ జ‌గ‌న్‌కు రాజ‌కీయంగా న‌ష్టం తెస్తోంది. సొంత చిన్నాన్న హ‌త్య కేసులో నిందితుల‌ను జ‌గ‌న్ వెన‌కేసుకొస్తున్నార‌నే అప‌ప్ర‌ద‌ను ఆయ‌న మూట‌క‌ట్టుకోవాల్సి వ‌స్తోంది. దీంతో ఈ చ‌ర్చ నుంచి ఏపీ స‌మాజాన్ని పూర్తిగా ప‌క్క‌దారి ప‌ట్టించేందుకు మ‌రోసారి రాజ‌ధాని అంశాన్ని తెరపైకి తెచ్చార‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

విశాఖ‌లో సెప్టెంబ‌ర్ నుంచి కాపురం అనే మాట‌తో ఏపీ రాజ‌కీయాలు పూర్తిగా రాజ‌ధాని అంశం చుట్టూ తిప్పాల‌నేది జ‌గ‌న్ వ్యూహంగా క‌నిపిస్తోంది. ఇది త‌న‌కు లాభ‌మే త‌ప్ప‌, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ న‌ష్టం తీసుకురాద‌ని జ‌గ‌న్ న‌మ్మ‌కం. సెప్టెంబ‌ర్ నుంచి విశాఖ కేంద్రంగా తాను పాల‌న మొద‌లు పెట్టాల‌ని అనుకున్నార‌ని, టీడీపీ, ప‌చ్చ ద‌ళం కుట్ర‌పూరితంగా అడ్డుకుంటోందంటూ ప్ర‌చారం చేసుకోడానికి ఆయుధం దొరుకుతుంద‌ని వ్యూహాత్మ‌కంగా మాట్లాడారని అంటున్నారు. 

ఒక‌వేళ సుప్రీంకోర్టులో ఏపీ స‌ర్కార్‌కు వ్య‌తిరేక‌త తీర్పు వ‌చ్చినా, ఇదంతా టీడీపీ కుట్ర‌గా చంద్ర‌బాబును ఉత్త‌రాంధ్ర‌లో దోషిగా నిల‌బెట్టాల‌ని జ‌గ‌న్ ప‌థ‌క ర‌చ‌న చేశారు. జ‌గ‌న్ వ్యూహం ఎంత వ‌రకూ ఫ‌లిస్తుందో కాల‌మే జ‌వాబు చెప్పాల్సి వుంది.