బీజేపీకి.. ప‌వ‌న్ క‌న్నా.. అల్లు అర్జున్ బెట‌రా!

క‌ర్ణాట‌క‌లో తెలుగు హీరోల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించ‌డం కొత్తేమీ కాదు. తెలుగు మూలాలున్న ప్రాంతం, మాతృభాష‌ను తెలుగుగా క‌లిగి ఉన్న వారున్న ప్రాంతంలో తెలుగు హీరోల ప్ర‌చారాలు సాగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో తెలుగు…

క‌ర్ణాట‌క‌లో తెలుగు హీరోల‌తో ఎన్నిక‌ల ప్ర‌చారాలు నిర్వ‌హించ‌డం కొత్తేమీ కాదు. తెలుగు మూలాలున్న ప్రాంతం, మాతృభాష‌ను తెలుగుగా క‌లిగి ఉన్న వారున్న ప్రాంతంలో తెలుగు హీరోల ప్ర‌చారాలు సాగుతూ ఉంటాయి. ఈ ప్రాంతంలో తెలుగు హీరోల‌కు అభిమాన‌వ‌ర్గాలూ ఉన్నాయి. ఈ అభిమాన‌వ‌ర్గాలు త‌మ‌లో తాము కొట్టుకోవ‌డం కూడా రొటీనే.

ఆ మ‌ధ్య ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్- జూనియ‌ర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. చిత్తూరుతో స‌రిహ‌ద్దును పంచుకునే క‌ర్ణాట‌కలో ఈ ర‌చ్చ జ‌రిగింది. ఈ గొడ‌వ‌లో ఒక అభిమాని కూడా చ‌నిపోతే ప‌వ‌న్ క‌ల్యాణే వెళ్లి ఆ కుటుంబాన్ని ప‌రామ‌ర్శించాడు. తెలుగు హీరోల అభిమాన‌గ‌ణాల మ‌ధ్య ఈ రేంజ్ లో ర‌చ్చ ఉండేది కొన్నాళ్ల కింద‌ట వ‌ర‌కూ!

అలాగే తెలుగు హీరోల ఛ‌రిష్మాతో ప్ర‌చారం పొంద‌డానికి నేత‌లూ త‌హ‌త‌హ‌లాడ‌తారు, ఎలాగోలా నాలుగు ఓట్లు వ‌చ్చినా మంచిదే అనేది వారి లెక్క‌!  ఆ మ‌ధ్య చిరంజీవితో ప్ర‌చారం కోసం కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నించింది. చిరంజీవి త‌న పార్టీని కాంగ్రెస్ లోకి విలీనం చేసిన కొన్నాళ్ల‌కు క‌ర్ణాట‌క ఎన్నిక‌లు వ‌స్తే చిరును తీసుకెళ్లింది కాంగ్రెస్ హైక‌మాండ్. గ‌త ఎన్నిక‌ల్లో కూడా చిరంజీవి త‌మ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తారంటూ కాంగ్రెస్ వాళ్లు ప్ర‌చారం చేసుకున్నారు. అయితే చిరంజీవి వెళ్ల‌లేదు.

ఇప్పుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ను వాడుకోవాల‌ని బీజేపీ క‌ర్ణాట‌క నేత‌ల ఐడియా కావొచ్చు. ఢిల్లీ నుంచి ఈ విష‌యాన్ని చెప్పించారేమో! అయితే.. ప‌వ‌న్ క‌ల్యాణ్ క‌న్నా బీజేపీ క‌న్న‌డ నేత‌లు అల్లు అర్జున్ ను ప్ర‌చారానికి పిలిపించుకుంటే ఎక్కువ ప్ర‌యోజ‌నం ఉండ‌వ‌చ్చు. అల్లు అర్జున్ అయితే తెలుగు బెల్ట్ లోనే కాదు.. క‌న్న‌డీగుల మ‌ధ్య కూడా ఎక్కువ పాపుల‌ర్!

వాస్త‌వంగా చెప్పాలంటే ఇప్పుడు ప్యూర్ క‌ర్ణాట‌క‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ ను గుర్తుపట్టేవారి క‌న్నా అల్లు అర్జున్ కే ఎక్కువ గుర్తింపు ఉంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎవ‌రో తెలిసిన క‌న్న‌డీగుల కంటే అల్లు అర్జున్ ను ఎరిగిన వారే ఎక్కువ‌! న‌యాత‌రం క‌న్న‌డ సినీ అభిమానుల్లో అల్లు అర్జున్ అలాంటి గుర్తింపును క‌లిగి ఉన్నాడు. అత‌డి ఇటీవ‌లి సినిమాలు అక్క‌డ ఇలాంటి గుర్తింపును ఇచ్చాయి. మ‌రి పుష్పం పార్టీ నేత‌లు ప‌వ‌న్ ను బ‌తిమాల‌డం క‌న్నా పుష్పాను న‌మ్ముకుంటే ప‌ని జ‌రుగుతుందేమో!