వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ మీకు మాత్ర‌మేనా రామోజీ!

రామోజీరావు బెడ్ మీద ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో రావ‌డం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛను హ‌రించ‌డం కిందే వ‌స్తుంద‌ని ఈనాడులో వార్త వ‌చ్చింది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ గురించి త‌న దాకా వ‌స్తే కానీ ఈనాడుకి అర్థం…

రామోజీరావు బెడ్ మీద ఉన్న ఫొటో సోష‌ల్ మీడియాలో రావ‌డం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛను హ‌రించ‌డం కిందే వ‌స్తుంద‌ని ఈనాడులో వార్త వ‌చ్చింది. వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ గురించి త‌న దాకా వ‌స్తే కానీ ఈనాడుకి అర్థం కాలేదు. మ‌రి సీబీఐ విచార‌ణ జ‌రిగిన ప్ర‌తిసారి, అదంతా క‌ళ్ల‌తో చూసిన‌ట్టు, వినిన‌ట్టు వార్త‌లు రాయ‌డం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ హ‌రించ‌డం కాదా? అవినాష్‌రెడ్డి స్వ‌యంగా హ‌త్య‌లో పాల్లొన్న‌ట్టు అర్థ‌మ‌య్యేలా రాయ‌డం క‌రెక్టా? సీబీఐ అధికారికంగా నిర్ధారించ‌క ముందే బ్యాన‌ర్ హెడ్డింగ్ పెట్టి రాయ‌డం ఏ చ‌ట్టం ప్ర‌కారం క‌రెక్ట్‌?

జ‌నం డ‌బ్బుల‌తో మార్గ‌ద‌ర్శి ఎదిగింది. ఇది అంద‌రికీ తెలుసు. ఈనాడుని అడ్డం పెట్టుకుని మార్గ‌ద‌ర్శి సిబ్బంది అధికారులు, వ్యాపారుల‌తో చీటీలు వేయించింది. లొంగ‌ని అధికారుల‌పై ఈనాడులో వార్త‌లు వ‌చ్చేవి. చీటీ క‌ట్టిన వారికి మార్గ‌ద‌ర్శి డ‌బ్బు క‌రెక్ట్‌గా చెల్లించింది. ఇది మాత్ర‌మే నిజం. మ‌ధ్య‌లో క‌ట్ట‌లేక ఆగిపోయిన వాళ్లు, డ‌బ్బులు ఇరుక్కుపోయి ఎన్ని బాధ‌లు ప‌డ్డారో వాళ్ల‌కి మాత్ర‌మే తెలుసు. జ‌ర్న‌లిజం బ‌లంతో ప్ర‌భుత్వాల్నే ఒక ఆట ఆడించే ఈనాడుపై చీటీదారులు కానీ, రిజిస్టార్లు కానీ ఫిర్యాదు చేయ‌డానికి సాహ‌సిస్తారా?

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మార్గ‌ద‌ర్శి కాకుండా, అనేక చిట్‌ఫండ్ కంపెనీలు ఉండేవి. వాట‌న్నింటిని ప‌థ‌కం ప్ర‌కారం తొక్కేశారు. చిన్న అవ‌క‌త‌వ‌క జ‌రిగినా, పెద్ద అక్ష‌రాల‌తో ఈనాడులో వేసి జ‌నాల్లో అప‌న‌మ్మ‌కం పుట్టించి వాటిని దివాళా తీయించేవాళ్లు. మార్గ‌ద‌ర్శిలో ఏం జ‌రిగినా, బ‌య‌ట‌కు రాదు. వ‌చ్చినా రాసే ద‌మ్ము ఎవ‌రికీ లేదు.

ఈనాడు అనే ఆయుధంతో ఎంత మంది ప‌రువు ప్ర‌తిష్ట‌లు బ‌జారుకీడ్చారో? ఎంద‌రి వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ హ‌రించారో, అవమానాల‌కి గురి చేశారో బాధితుల‌కే తెలుసు. ల‌క్ష్మీపార్వ‌తిని పెళ్లి చేసుకోవ‌డ‌మే ఎన్టీఆర్ నేర‌మైన‌ట్టు, ఆయ‌న్ని కూడా వేధించారు. ల‌క్ష్మీపార్వ‌తిని ర‌క‌ర‌కాలుగా అవ‌హేళ‌న  చేయ‌డం వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ‌ను హ‌రించ‌డం కాదా?

ఊరంద‌రి భూక‌బ్జాల గురించి రాసే ఈనాడుకి, రామోజీ ఫిల్మ్ సిటీ క‌బ్జాల గురించి తెలియ‌దా? అదంతా రైతులు న్యాయంగానే ఇచ్చారా? భ‌య‌ప‌డి ఇచ్చారా? ఆ రోజుల్లో సోష‌ల్ మీడియా వుంటే మీ సామ్రాజ్యం పునాదులు అప్పుడే క‌దిలేవి.

ఇత‌రుల మీద విచార‌ణ జ‌రిగిన‌ప్పుడు మీరు బ్యాన‌ర్ ఐట‌మ్‌లు రాశారు. మీ మీద విచార‌ణ జ‌రిగితే మాత్రం వేధింపులు అవుతాయా? రామోజీ ముందు చేతులు క‌ట్టుకు నిల‌బ‌డే వాళ్లు కాకుండా, ఆయ‌న‌కి జ్వ‌రం వ‌చ్చేలా చేసేవాడు ఇన్నాళ్ల‌కి ఒక‌డొచ్చాడు. అత‌నే జ‌గ‌న్‌!