ఒకేసారి రెండు సినిమాలు ప్రకటించారు చిరంజీవి. వీటిలో ఒక సినిమాను తన కూతురు సుశ్మిత నిర్మాణ సారధ్యంలో చేస్తారు. మరో సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చేస్తారు. వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు కూడా వచ్చేశాయి.
ఈ సందర్భంగా తన సినిమాల ఆర్డర్ కూడా ఇచ్చేశారు చిరంజీవి. కూతురుకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై చేయబోతున్న సినిమా తన 156వ చిత్రం కాబోతోందని, ఆ తర్వాత తన 157వ చిత్రంగా యూవి క్రియేషన్స్ సినిమా వస్తుందని స్పష్టం చేశారు.
అంతా ఓకే అనుకుంటున్న టైమ్ లో చిరంజీవి 157వ సినిమా ప్రీ-ప్రొడక్షన్ ముందుగా స్టార్ట్ అయింది. దీంతో చాలామంది అనుమానం వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమాల ఆర్డర్ మారుతుందేమో అని భావించారు. కానీ అలాంటిదేం జరగడం లేదు.
యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై చిరంజీవి చేయబోతున్న సినిమాకు వశిష్ఠ దర్శకుడు. ఇదొక ఫాంటసీ అడ్వెంచరస్ మూవీ. ఈ సినిమాకు భారీగా గ్రాఫిక్స్, సెట్స్ అవసరం. అందుకే ఈ సినిమాకు కాస్త ముందుగానే ప్రీ-ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేశారు. ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమైన విషయాన్ని ఈరోజు అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు, సెట్ వర్క్, గ్రాఫిక్ డిజైన్ ముగిసేలోపు.. తన 156వ చిత్రాన్ని పూర్తిచేస్తారు చిరంజీవి. తాజా సమాచారం ప్రకారం, కూతురు నిర్మాతగా చిరంజీవి చేయబోయే సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ లాక్ అయింది. ప్రస్తుతం డైలాగ్ వెర్షన్ పనులు నడుస్తున్నాయి.