భక్త కన్నప్ప.. ఈ ప్రాజెక్టును ప్రభాస్ తో చేయాలని ఆయన పెదనాన్న కృష్ణంరాజు చాలా కలలుగన్నారు. కానీ ఆ కోరిక తీరకుండానే ఆయన కన్నుమూశారు. ఇక రీసెంట్ గా ఈ ప్రాజెక్టును మంచు విష్ణు ప్రకటించాడు. దీంతో రెబ్ స్టార్ ఫ్యాన్స్ కాస్త నిరాశకు గురయ్యారు.
అయితే ఈ ప్రాజెక్టు ప్రభాస్ కు దూరంకాలేదు. భక్త కన్నప్పలో ప్రభాస్ ఉన్నాడు. ఈ విషయాన్ని హీరో మంచు విష్ణు అధికారికంగా ప్రకటించాడు.
రీసెంట్ గా భక్త కన్నప్ప సినిమాను ప్రారంభించాడు మంచు విష్ణు. మోహన్ బాబు నిర్మాతగా, ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతోంది. కృతి సనన్ చెల్లెలు నుపుర్ సనన్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. సినిమా మొత్తాన్ని న్యూజిలాండ్ లో షూట్ చేయాలని నిర్ణయించారు.
ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో అన్ని భాషలకు చెందిన స్టార్ నటీనటులు నటిస్తారని లాంఛింగ్ రోజునే ప్రకటించాడు విష్ణు. చెప్పినట్టుగానే ప్రభాస్ పేరు ఎనౌన్స్ చేశాడు. భక్త కన్నప్ప సినిమాలో ఓ కీలక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడు.
తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాలో ప్రభాస్ శివుడిగా కనిపించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని మంచు విష్ణు పరోక్షంగా వెల్లడించాడు. ఆదిపురుష్ సినిమాలో రాముడిగా కనిపించిన ప్రభాస్, ఇప్పుడు శివుడిగా కూడా మెప్పించబోతున్నాడన్నమాట.